- 25.67 లక్షల పెండింగ్ అప్లికేషన్లలో 25 శాతమే పరిశీలన పూర్తి
- ఆ వెంటనే జీవో 58,59 అప్లికేషన్లలో అర్హమైన వాటికీ పట్టాలు
హైదరాబాద్, వెలుగు: ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం) అప్లికేషన్ల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ స్థానిక ఎన్నికల షెడ్యూల్ రాకపోతే ఫిబ్రవరి రెండో వారంలో స్పెషల్ డ్రైవ్‌కు ప్లాన్ చేస్తున్నది. లేదంటే స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత నాలుగైదు రోజుల పాటు కేవలం అధికారులు ఎల్ఆర్ఎస్ పైనే దృష్టిపెట్టేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. దాదాపు నాలుగైదు నెలల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసే ప్రక్రియ నడుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కింద 25.67 లక్షల దరఖాస్తులు అందాయి.
ఇందులో ఇప్పటి వరకూ కేవలం 7 లక్షల లోపు అప్లికేషన్ల పరిశీలన మాత్రమే పూర్తయినట్టు లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఆమోదించిన దరఖాస్తులు లక్షా 50 వేల వరకు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద ఉద్యోగులను బిజీ చేయడంతో అప్లికేషన్ల పరిష్కారం ఆలస్యం అవుతున్నట్టు సమాచారం. అదే సమయంలో కొందరు అధికారులు లంచం ముడితే కానీ.. అప్లికేషన్లను పరిశీలించం.. పరిష్కరించం అనే ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందులో భాగంగానే స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎల్ఆర్ఎస్ను కంప్లీట్ చేయాలని చూస్తున్నది.
మున్సిపాలిటీల పరిధిలో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు 10.54 లక్షలు, గ్రామ పంచాయతీల పరిధిలో 10.76 లక్షలు రాగా.. మిగిలినవి కార్పొరేషన్ల పరిధిలో వచ్చాయి. వాటి పరిశీలన, ఆమోదం, ఫీజు వసూలుకు వివిధ దశలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూములను రక్షిస్తూ.. అర్హత ఉన్న లేఅవుట్లను క్రమబద్ధీకరించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్పట్లో అప్‌లోడ్ చేయలేదు.
మొత్తంగా 75 శాతం అసంపూర్తి దరఖాస్తులే అందజేశారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, లే అవుట్ కాపీలు, ఇతర పత్రాలు అప్‌లోడ్ చేయకుండా వచ్చి న దరఖాస్తులకు అప్‌లోడ్ చేసుకునేందుకు మళ్లీ అవకాశం ఇచ్చారు. ఇటీవలే ఎల్ఆర్ఎస్పై రివ్యూ చేసిన ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ మార్చి నెలాఖరులోగా ఎల్ఆర్ఎస్ సమస్యలు పరిష్కరించాలని డెడ్ లైన్ పెట్టారు. అయితే అంతకంటే ముందే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
58,59 జీవోలపైనా త్వరలోనే నిర్ణయం
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జీవో 59ను అమలు చేసి, అర్హులైన వారికి రెగ్యులైజేషన్ కింద పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. గత ప్రభుత్వంలో అప్లికేషన్లు తీసుకున్నారు. అయితే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో జీవో 58,59 దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ దరఖాస్తుల్లో నిజమైన లబ్ధిదారులు ఉంటే వాటిని పరిష్కరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఈ అప్లికేషన్లను పూర్తి చేయాలనుకుంటున్నది.
59 జీవో కింద వచ్చిన 50 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా సుమారు రూ.6 వేల కోట్ల వరకు ఖజానాకు సమకూరుతుందని రెవెన్యూ శాఖ అంచనా వేసింది. ఇదే జీవో కింద అధిక విలువ గల భూములను క్రమబద్దీకరిస్తే ఇంకో రూ.5,500 కోట్లు వస్తాయని... జీవో 76, 118 దరఖాస్తుల పరిష్కారం ద్వారా అదనంగా రూ.300 కోట్లు అందుతాయని ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఈ జీవో కింద పరిశీలన పూర్తై డిమాండ్ నోటీసు మేరకు డబ్బులు పూర్తిగా చెల్లించినవారు, పాక్షిక మొత్తం చెల్లించినవారు, తనిఖీలు పూర్తిచేసుకున్న వారు, కన్వేయన్స్ డీడ్‌లు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం విధించిన స్టేతో ఆ భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేనివారు వేల మంది ఉన్నారు.
జీవో 59 ప్రకారం రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని ఉంటున్న పేదలకు ఆ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత 2014 జూన్ 2 నాటికి ఆక్రమణలో ఉన్న భూములను రెగ్యులరైజ్ చేస్తామని జీవోలో పేర్కొన్నా.. 2023లో విడుదల చేసిన జీవోలో దరఖాస్తు చేసుకునే నాటికి ఆక్రమణలో ఉన్నా క్రమబద్ధీకరిస్తామని సర్కారు పేర్కొన్నది. రెగ్యులరైజ్ కోసం 125 నుంచి 250 గజాల వరకు స్థలాలకు మార్కెట్ విలువలో 25 శాతం.. 250 గజాల నుంచి 500 గజాల ఉన్న స్థలాలకు 50 శాతం, 500–750 గజాల స్థలాలకు 75శాతం, 750 గజాలపైన ఉంటే మార్కెట్ విలువలో 100 శాతం సొమ్ము చెల్లించాలి. క్రమబద్ధీకరణకు సంబంధించిన మరో జీవో 58 ప్రకారం... 125 చదరపు గజాలలోపు భూమిలో నిర్మాణాలుంటే ప్రభుత్వం ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తుంది.
ఎల్ఆర్ఎస్ పూర్తయితే రూ.10 వేల కోట్ల ఆదాయం !
హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలోనే మొత్తం 4.60 లక్షలకు పైగా దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ కింద అందగా, వాటి ద్వారా హెచ్ఎండీఏకు రూ.వెయ్యి కోట్లు, జీహెచ్ఎంసీకి రూ.450 కోట్ల ఆదాయం సమకూరుతుందనే అంచనాలు ఉన్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో అక్రమ లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో కేసులు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
ఆ తర్వాత గత ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను పరిశీలించి.. పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తుల్లో అర్హమైన వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ మొత్తం ఆయా మున్సిపాలిటీల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక మొత్తం అప్లికేషన్లలో దాదాపు 20 శాతం వరకు దరఖాస్తులు అనర్హమైనవని అధికారులు గుర్తించినట్లు సమాచారం.