
- అసెంబ్లీలో బిల్లును ఆమోదించాక రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లే చాన్స్
- దానికి ఆమోదముద్ర వేయించి షెడ్యూల్ 9లో పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి
- తమిళనాడును కేస్ స్టడీగా తీసుకొని ముందుకు..
- కేంద్రం ఒప్పుకోకుంటే సుప్రీంకోర్టులో చాలెంజ్
- పక్కా ఆధారాలతో న్యాయ పోరాటం చేయాలని సర్కార్ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. ఇన్నాళ్లూ బీసీల సంఖ్య, వారి స్థితిగతులకు సంబంధించి లెక్కా పత్రం లేకపోవడంతో గట్టిగా అడిగే పరిస్థితి లేదని.. ఇప్పుడు పక్కా ఆధారాలు చేతికి రావడంతో వాటి సాయంతో కొట్లాడి మరీ బీసీ రిజర్వేషన్లు సాధించాలని నిర్ణయించింది. రిజర్వేషన్లు 50% దాటరాదన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో తమిళనాడును కేస్ స్టడీగా తీసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించింది. తెలంగాణ రిజర్వేషన్లను సైతం షెడ్యూల్9లో పెట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని భావిస్తున్నది. అక్కడ కుదరకపోతే నేరుగా సుప్రీంకోర్టులో చాలెంజ్చేయాలనుకుంటున్నది. ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకుంటున్నది. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, డెడికేటెడ్కమిషన్నివేదికపై ఇటీవల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.
స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. అలా చేస్తే ఎన్నికల వరకే రిజర్వేషన్లు పరిమితమవుతాయని, అలా కాకుండా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధిస్తే విద్య, ఉద్యోగాల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయవచ్చనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు మార్చి మొదటి వారంలోనే అసెంబ్లీలో చట్టం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తర్వాత చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్‌పై రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నది. అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత ఆ బిల్లు గవర్నర్‌వద్దకు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కనుక ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్‌కు పంపనున్నట్టు తెలుస్తున్నది. బిల్లు రాష్ట్రపతికి వెళ్లగానే రాష్ట్ర పెద్దలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఇప్పటి దాకా బీసీల లెక్కలే లేవు..
రాష్ట్రంలో ఇప్పటివరకు బీసీల లెక్కలను ప్రభుత్వం శాస్త్రీయంగా సేకరించలేదు. ‘‘బీసీలకు ఏ ఆధారంతో రిజర్వేషన్లు పెంచాలని కోరతున్నారు? రాజకీయంగా, ఉపాధి, విద్య పరంగా బీసీల వెనుకబాటుతనంపై ఉన్న లెక్కలేంటి? అలాంటి వివరాలున్నప్పుడే రిజర్వేషన్లు పెంచే చాన్స్ఉంటుంది” అని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇదే అస్ర్తాన్ని వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భావిస్తున్నది. దీంతో ఇటీవల చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ప్రతి ఒక్కరి పూర్తి వివరాలు డిజిటలైజ్ చేశారు. కులం, మతం, వెనుకబాటుతనం లాంటి సామాజిక అంశాలతోపాటు విద్య, ఉపాధి, ఆదాయం తదితర వివరాలను సేకరించారు. గతంలో వివరాలు ఇవ్వకుండా మిగిలిపోయిన 3.1 శాతం మందికి మరో చాన్స్ ఇస్తున్నారు. ఆయా వర్గాల ప్రజలు, బీసీ సంఘాల నేతలు, మేధావుల నుంచి సమగ్ర సమాచారం సేకరించింది. ఈ పక్కా ఆధారాలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని.. తమిళనాడు మాదిరి షెడ్యూల్9లో చేర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అయితే, రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ ఉండడంతో సాధ్యాసాధ్యాలపై రాజకీయ, అధికార వర్గాలతో పాటు బీసీ సంఘాలు, సామాన్యుల్లోనూ చర్చ జరుగుతున్నది. అయితే, రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం ససేమిరా అంటే.. ప్రభుత్వమే సుప్రీంకోర్టు తలుపు తట్టాలని చూస్తున్నది.
తమిళనాడు తరహాలో..
కేంద్రం ఒప్పుకోకుంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో తమిళనాడును కేస్ స్టడీగా తీసుకొని ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అక్కడ ఏ రకంగా బీసీల రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం కల్పించారు? అందుకు దారితీసిన పరిణామాలు ఏంటి? నాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కేంద్రం ఎలా షెడ్యూల్9లో చేర్చింది? వీటిపై అధికారులతో ప్రభుత్వం రిపోర్ట్ తయారు చేయిస్తున్నది. న్యాయపరంగా ఎట్లా ముందుకు వెళ్లాలనే దానిపైనా స్టడీ చేస్తున్నది. దేశవ్యాప్తంగా 50% దాటకుండా రిజర్వేషన్లు అమలవుతుండగా.. ఒక్క తమిళనాడులో 69% అమలవుతున్నాయి. ఇందులో బీసీలకే 50% రిజర్వేషన్లు (26.5% బీసీలు, 20% ఎంబీసీలు, 3.5% ముస్లిం బీసీలు) అమల్లో ఉన్నాయి. 1993 నవంబర్‌లో జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో తమిళనాడు ప్రభుత్వం.. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం 69% రిజర్వేషన్లు కొనసాగించగలిగేలా రాజ్యాంగాన్ని సవరించడానికి చర్యలు తీసుకోవాలని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదిస్తూ.. బిల్లు పెట్టింది. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. తమిళనాడు చేసిన చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ కిందికి తీసుకురావాలని సీఎం జయలలిత నేతృత్వంలోని బృందం ఢిల్లీలో పట్టుబట్టింది. అలా రాష్ట్రపతి ఆమోదం లభించడమే కాకుండా.. ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ కిందికి తేవడంతో తమిళనాడులో రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.
ఏమిటీ తొమ్మిదో షెడ్యూల్?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 31 ప్రకారం 9వ షెడ్యూల్ కింద చేర్చిన చట్టాలు లేదా నిబంధనలను ఏ కోర్టు, ట్రిబ్యునల్ రద్దు చేయడానికి వీల్లేదు. ఆ చట్టాలు, నిబంధన లు మరే తీర్పు, డిక్రీ లేదా ఆదేశానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ అమలు లో ఉంటాయి. అందులో భాగంగానే సుప్రీం కోర్టు, హైకోర్టులు 50 శాతానికి పైగా ఉండే రిజర్వేషన్లను కొట్టివేస్తూ తీర్పులు ఇచ్చినప్ప టికీ, ఆ తీర్పు మాత్రం తమిళనాడుకు వర్తించడం లేదు. దీంతో తాము చేసే చ ట్టాన్ని కూడా షెడ్యూల్9లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది.