బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం :ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు

బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం :ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు
  • చెక్కులు పంపిణీ చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే 

మణగూరు/ అశ్వాపురం వెలుగు : వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. గల్లంతై మృతి చెందిన అశ్వాపురం వెంకటాపురం గ్రామానికి చెందిన తాటి ఆదెమ్మ, కల్లూరి నేలమయ్య కుటుంబ సభ్యులకు, మణగూరు పరిధిలోని సుందరయ్య నగర్ ప్రాంతానికి చెందిన దివ్యాంగుడు నందికొల్ల రాము కుటుంబానికి రూ.5 చొప్పున కలెక్టర్ జితేశ్​వి పాటిల్, పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు సోమవారం అందజేశారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరదలతో ప్రజలు అలర్ట్​గా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరించి నిధులు తీసుకువచ్చి పూర్తిస్థాయిలో వరదలు నియంత్రించేందుకు చర్యలు చేపడతానని ఎమ్మెల్యే తెలిపారు. ముంపు ప్రాంతంలోని ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని కోరారు.

 ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మొండికుంట, మల్లెల మడుగు గ్రామాల్లో పర్యటించి వరదలతో నష్టపోయిన బాధితులను పరామర్శించారు. పాడైన పంట పొలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురంలో తహసీల్దార్ స్వర్ణ, మాజీ ఎంపీపీ సుజాత, ఎంపీడీవో వరప్రసాద్, ఎంపీవో ముత్యాలరావు, కాంగ్రెస్ లీడర్లు ఓరుగంటి భిక్షమయ్య, గాదకేశవరెడ్డి, మొండికుంట మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి రైతులు పాల్గొన్నారు.