- అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
అమ్రాబాద్, వెలుగు : నల్లమల అడవుల్లోని చెంచుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఆదివారం శ్రీశైలంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో కలిసి అమ్రాబాద్, లింగాల మండలాల్లో మంత్రి పర్యటించారు. తెలంగాణ జెన్‌కోలో ఆఫీసర్లను కలిసి వారి సమస్యలు, విద్యుత్ ఉత్పత్తి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సార్లపల్లి, కుడిచింతల బయలు, మల్లెల తీర్థం, అప్పాపూర్ తదితర చెంచుపెంటలను సందర్శించి, అక్కడి ప్రజలతో మాట్లాడారు.
ఐటీడీఏను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, రైతు బంధు మూడో విడత నిధులు సంక్రాంతి నాటికి మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో అవసరమైన రోడ్ల వివరాలు పంపితే నిధులు మంజూరు చేస్తామన్నారు. నల్లమలను అభివృద్ధి చేస్తే స్థానిక ప్రజలతో పాటు చెంచులకు ఉపాధి పెరుగుతుందన్నారు.