
- బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా జీవోలు ఇవ్వరాదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఏపీ అక్రమంగా చేపడుతున్న గోదావరి బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టును వెంటనే ఆపాలంటూ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ)కి రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ నెల 8న ఏపీ సర్కారు జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ జీవో కూడా జారీ చేసిందని, దీనిని వెంటనే రద్దు చేయాలని కోరింది. ఇలాంటి జీవోలు ఇచ్చే ముందు విభజన చట్టం ప్రకారం కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, అలాంటివేవీ లేకుండా ఏపీ జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చిందని ఆరోపించింది.
ఈ మేరకు రెండు బోర్డులకు శుక్రవారం ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ లేఖలు రాశారు. ప్రాజెక్టు కోసం సెంట్రల్ వాటర్ కమిషన్, కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీల నుంచి ఏపీ ఎలాంటి టెక్నికల్ క్లియరెన్సులు తీసుకోలేదని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు ఉండే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లోనూ దీనిపై చర్చించలేదన్నారు. విభజన చట్టం, గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధంగా ఏపీ జీబీ లింక్‌ను చేపడుతున్నదని, దాని వల్ల తెలంగాణ నీటి హక్కులకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో రెండు రాష్ట్రాల నీటి వాటాల కేటాయింపులపై వాదనలు జరుగుతున్నాయని, ఇలాంటి టైమ్‌లో ఏపీ ఏకపక్షంగా ఇలాంటి జీవోలు ఇవ్వరాదని తేల్చి చెప్పారు.
జీఆర్‌ఎంబీ మమ్మల్ని లెక్క చేయట్లే..
జీబీ లింక్‌పై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా.. కేంద్ర జల శక్తి శాఖ తమకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినా జీఆర్‌ఎంబీ పట్టించుకోవడం లేదని ఈఎన్సీ అనిల్ అన్నారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా జీఆర్‌ఎంబీ పనిచేస్తున్నదని విమర్శించారు. జీఆర్‌ఎంబీ మీటింగ్‌లో జీబీ లింక్ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పోలవరం కుడి కాల్వ (ట్విన్ టన్నెల్స్) ద్వారా రూ.40 వేల క్యూసెక్కుల నీటిని (3.5 టీఎంసీలు) తరలించుకెళ్లేందుకు ఏపీ ఈ ప్రాజెక్టును చేపట్టిందని చెప్పారు. జీబీ లింక్ ద్వారా మరిన్ని ఎక్కువ నీళ్లను తీసుకెళ్లేందుకు హెడ్ రెగ్యులేటర్, ఆఫ్ టేక్ రెగ్యులేటర్లకు మరిన్ని ఇంప్రూవ్‌మెంట్స్ చేస్తున్నదని, కుడి కాల్వను వెడల్పు చేస్తున్నదని పేర్కొన్నారు.