సర్కారు సాగు లెక్కలు నమ్మేలా లేవు

తెలంగాణా రాష్ట్రంలో   భూ వినియోగ విధానం అంటూ ఏమీలేదు. గత 8 ఏళ్లలో భూమి స్వభావం పూర్తిగా మారిపోయింది. ప్రజల జీవనోపాధికి వనరుగా ఉండాల్సిన భూమి పూర్తిగా ఆస్తిపర వర్గాల చేతిలో మార్కెట్ సరుకుగా మారిపోతున్నది.  సాగు భూములన్నీ, రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారిపోతున్నాయి. వ్యవసాయంతో ఎప్పుడూ  సంబంధం లేనివాళ్ళు పెద్ద ఎత్తున వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తూ, ఆయా భూములను పడావు పెడుతున్నారు .  లేదా కౌలుకు ఇస్తున్నారు.   రాష్ట్రంలో కౌలు రైతుల సంఖ్య లక్షల్లో పెరిగిపోవడానికి  ఇదే కారణం.

గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సాగు భూముల విస్తీర్ణ గణాంకాలను పెంచుకుంటూ పోతున్నది.  వ్యవసాయేతర భూములుగా మారిపోయిన లక్షల ఎకరాలు ఇప్పటికీ, వ్యవసాయ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంటున్నాయి. కొన్ని చోట్ల ఇళ్ళు కట్టి, కాలనీలుగా మారిన  భూములు కూడా ఇప్పటికీ, వ్యవసాయ భూములుగా  చూపిస్తూ ప్రభుత్వం నుంచి అందే ప్రయోజనాలను పొందుతున్నారు.   రాష్ట్ర ప్రభుత్వం  అందిస్తున్న రైతు బంధు నిధులను ఈ భూముల యజమానులు పొందుతున్నారు. ప్రభుత్వం ఈ విచక్షణా రహిత నిధుల పంపిణీ వల్ల, ప్రతి ఏటా వేల కోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. రైతు బంధు లబ్దిదారుల పేర్లు , సర్వే నంబర్ల వారీగా కూడా ప్రభుత్వం బయట ఉంచడంలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసలు భూమి ఎంత ? అందులో సాగు భూమి ఎంత ? అనేదే ప్రశ్న .  

సాగు భూములు పెరిగాయా ? తగ్గాయా?

మొత్తం తెలంగాణ విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. అంటే సుమారుగా  2,76,94,829.8 ఎకరాలు అన్నమాట .  రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఉన్న నికర సాగు భూమి 1,22,53,670 ఎకరాలు మాత్రమే అని ప్రభుత్వం ప్రకటించింది. 2014 , 2018 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సామాజిక, ఆర్థిక నివేదికల ప్రకారం 2014 నుంచి 2018 మధ్య కాలంలో  అటవీ భూములు 68,57,500 ఎకరాల నుంచి  67,45,000 ఎకరాలకు  తగ్గాయి. వ్యవసాయేతర భూమి విస్తీర్ణం  22,37,500 ఎకరాల నుంచి 20,85,000 ఎకరాలకు తగ్గింది. ఇతర పడావు భూముల విస్తీర్ణం 17,92,500 ఎకరాల నుంచి 18,77,500 ఎకరాలకు పెరిగింది.  ఇదే కాలంలో  నికర సాగు భూమి విస్తీర్ణం మాత్రం  1,24,02,500 ఎకరాల నుంచి 1,16,50,000 ఎకరాలకు తగ్గింది. తక్షణ పడావు భూముల విస్తీర్ణం, వృథా భూముల విస్తీర్ణం బాగా  పెరిగాయి.  మరి సాగు భూములు ఎట్లా పెరిగినట్లు? విచిత్రం ఏమిటంటే 2019 తరువాత ఇప్పటి వరకూ ఈ భూముల విస్తీర్ణాలలో ఎటువంటి మార్పులు జరిగాయో రాష్ట్ర ఆర్థిక, గణాంక శాఖ స్పష్టంగా ప్రకటించడం లేదు. ప్రతిసారీ పాత లెక్కలే కొత్త నివేదికలలో ఇస్తున్నది. 

శ్వేతపత్రం విడుదల చేయాలి

రాష్ట్రంలో ఇప్పటికే అనేక జిల్లాలలో సాగు భూములు రియల్ ఎస్టేట్ వారి చేతుల్లో పడి  వేలాది ఎకరాలు వాటి స్వభావాన్ని కోల్పోవడం మనం చూస్తున్నాం. అయినప్పటికీ ప్రభుత్వానికి ఇంత సాగు భూమి ఎక్కడి నుంచి వస్తున్నది ? ఆ భూములలో పండిన పంటలు ఎక్కడికి వెళుతున్నాయి? ఎవరు కొంటున్నారు ? ఎక్కడ నిల్వ చేస్తున్నారు? నిజానికి ఏ‌‌‌‌పీఎం‌‌‌‌సీ చట్టం ప్రకారం రాష్ట్రంలో పండే పంటల కొనుగోలు, అమ్మకం వివరాలు మార్కెటింగ్ శాఖ వెబ్ సైట్ పై ప్రతిఫలించాలి. కానీ ఆ శాఖ వెబ్ సైట్ పై ఈ లెక్కలు చాలా తక్కువగా ఉంటున్నాయి.  2019-–21 మధ్యలో రాష్ట్రంలో అటవీ భూములు, పడావు భూములు, ఇతర గడ్డి భూములు వ్యవసాయానికి వీలుగా మారాయని అనుకున్నా, ప్రభుత్వం చెబుతున్నట్లుగా , ఈ స్థాయి  విస్తీర్ణం పెరిగే అవకాశం ఏమాత్రం లేదు. మనకు కనిపిస్తున్నదేమంటే,   రైతు బంధు నిధుల ఖర్చుకు  అనుగుణంగా సాగు భూముల విస్తీర్ణాన్ని అంకెల్లో పెంచుకుంటూ పోతున్నారు తప్ప, వాస్తవంగా అంత భూ విస్తీర్ణం లేదనీ,  అంత  విస్తీర్ణంలో పంటల సాగు కూడా జరగడం లేదనీ  స్పష్టమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రాష్ట్ర భూ విస్తీర్ణం పై, భూ వినియోగం పై, నికర సాగు భూమిపై  శ్వేతపత్రం విడుదల చేయాలి.    సాగు చేయని  భూములకు రైతు బంధు ఇవ్వొద్దు. మిగిలిన నిధులను  పంటల బీమా పథకానికి , వ్యవసాయ మౌలిక సదుపాయాలకు ఉపయోగించవచ్చు.

పొంతన లేని సాగు  లెక్కలు

ఈ గణాంకాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 2019-–20 నుంచి 2021-–22 మధ్యలో సాగు భూముల విస్తీర్ణాన్ని మాత్రం విపరీతంగా పెంచి చూపిస్తున్నది. వ్యవసాయ శాఖ విడుదల చేసే వీక్లీ రిపోర్ట్స్ ప్రకారం 2019 ఖరీఫ్ సాగు విస్తీర్ణం 1,10,36,735 ఎకరాలు, 2020 ఖరీఫ్ సాగు విస్తీర్ణం 1,35,63,492 ఎకరాలు, 2021 ఖరీఫ్ సాగు విస్తీర్ణం 1,29,19,312 ఎకరాలు , 2022 ఖరీఫ్ విస్తీర్ణం సెప్టెంబర్ 28 నాటికి 1,36,03,798 ఎకరాలు. ఉద్యాన పంటల విస్తీర్ణం దీనికి అదనం. ఉద్యాన శాఖ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న తాజా నివేదిక 2018-–19 సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఉద్యాన పంటల విస్తీర్ణం 12,40,000  ఎకరాలు. ప్రతి సీజన్ లో ఎకరానికి 5000 చొప్పున పెట్టుబడి సహాయం అందించే వ్యవసాయ శాఖ  రైతు బంధు గణాంకాలకు, వ్యవసాయ శాఖ వీక్లీ రిపోర్ట్స్ కు , రాష్ట్ర ఆర్థిక, గణాంక శాఖ ప్రకటించే గణాంకాలకు మధ్య పొంతన లేకుండా పోతున్నది. వ్యవసాయ శాఖ ప్రకారం 2018 ఖరీఫ్ లో 1,04,72,000 ఎకరాలకు, 2019 ఖరీఫ్ లో 1,22,52,000 ఎకరాలకు,  2020 ఖరీఫ్ లో 1,45,78,000 ఎకరాలకు, 2021 ఖరీఫ్ లో 1,47,20,000 ఎకరాలకు పంపిణీ చేయగా, రైతు బంధు పంపిణీ కోసం సాగు విస్తీర్ణం 2022-–23 రబీ నాటికి 1,53,53,000 ఎకరాలకు పెరిగింది.  

కన్నెగంటి రవి,

రైతు స్వరాజ్య వేదిక