- ప్రారంభించనున్న సీఎం రేవంత్
- రేపటి నుంచి లబ్ధిదారుల ఎంపిక
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన మొబైల్ యాప్ ను గురువారం సెక్రటేరియెట్ లో సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేయనున్నారు. శుక్రవారం నుంచి లబ్ధిదారుల ఎంపికను స్టార్ట్ చేయనున్నట్టు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
లబ్ధిదారుల ఎంపికలో అవినీతికి ఆస్కారం లేకుండా, రాజకీయ ప్రమేయానికి తావు లేకుండా, పారదర్శకంగా అర్హులైన వారిని ఎంపిక చేయడానికి వీలుగా మొబైల్ యాప్‌ను రూపొందించామని మంత్రి పొంగులేటి తెలిపారు. లబ్ధిదారుల ఆర్థిక స్థితి, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయన్నారు. వచ్చే నాలుగేండ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలను చేపడతామని, ఈ అంశంపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని ఆయన తెలిపారు.
హౌసింగ్ శాఖ పునరుద్ధరణ..
పేదలకు ఇండ్లు నిర్మించే హౌసింగ్ శాఖను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తూ ఈ శాఖను పునరుద్ధరించి లబ్ధిదారుల ఎంపిక నుం చి ఇండ్ల నిర్మాణం, పర్యవేక్షణ కోసం ఇతర శాఖలు, కార్పొరేషన్లలో ఉన్న 296 మంది ఉద్యోగులను తిరిగి మాతృశాఖకు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. కాగా, హౌసింగ్ శాఖను సపరేట్ చేస్తున్నట్టు మంత్రి ప్రకటించడంపై హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్స్, వర్క్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ హర్షం తెలిపింది. స్కీమ్‌ను విజయవంతం చేస్తామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు .