కుల గణన సర్వేలో పాల్గొనని వారికి తెలంగాణ సర్కార్ బిగ్ అప్డేట్

కుల గణన సర్వేలో పాల్గొనని వారికి తెలంగాణ సర్కార్ బిగ్ అప్డేట్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా కుల గణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. వివిధ కారణాలతో ఈ కుల గణనలో సర్వేలో  కొందరు పాల్గొనలేదు. ఈ క్రమంలో కుల గణన సర్వేలో పాల్గొనని వారికి  ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది.  బుధవారం (ఫిబ్రవరి 12) కమాండ్ కంట్రోల్ సెంటర్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. 

ఈ భేటీలో కుల గణన నివేదిక, పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై ప్రధానంగా చర్చించారు. ఈ భేటీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే నిర్వహిస్తామని పేర్కొన్నారు. 2025, ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రీ సర్వే నిర్వహిస్తామని తెలిపారు.

మొదటి సారి సర్వేలో పాల్గొనని వారు ఇప్పుడు వివరాలు ఇవ్వొచ్చని చెప్పారు. సర్వేలో పాల్గొనని వాళ్లు ఆన్‌లైన్, టోల్‌ ఫ్రీ నంబర్ లేదా మండల కార్యాలయానికి వెళ్లి తమ వివరాలు ఇవ్వొచ్చని చెప్పారు. గతంలో 96.9 శాతం మంది కుల గణన సర్వేలో పాల్గొన్నారని.. కేవలం 3.1 పర్సంట్ మంది మాత్రమే సర్వేలో పాల్గొనలేదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన నివేదిక స్పష్టంగా ఉందని.. కేవలం సర్వేలో పాల్గొనని 3.1 పర్సంట్ మంది కోసం మాత్రమే రీ సర్వే నిర్వహిస్తామన్నారు.

ALSO READ | ఏ క్షణమైనా.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ !

కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వంటి వాళ్లు కొందరు ఉద్దేశపూర్వకంగా సర్వేలో పాల్గొనలేదని ఫైర్ అయ్యారు. ఇక, ఎన్నికల్లో మాట ఇచ్చినట్లుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేస్తాం. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపి వాళ్లపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కలిసి వచ్చే రాజకీయ పార్టీలను తీసుకొని ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలుస్తామన్నారు.