హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు జారీకి పటిష్టమైన కార్యచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సూచించారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధా నాలపై గురువారం ( సెప్టెంబర్ 19న ) సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహా..రేషన్ కార్డుల జారీపై అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులందరికి డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చే దానిపై కసరత్తు చేశారు. ఈ అంశంపై త్వరలో మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, సీఎం ప్రిన్సిపాల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, సంగీత సత్యనారాయణ, మాణిక్ రాజ్, రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్ పాల్గొన్నారు.