- ఏడింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీపీ రాధాకృష్ణన్
హైదరాబాద్, వెలుగు: పెండింగ్ లో ఉన్న ఏడు బిల్లులుకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శనివారం ఆమోదం తెలిపారు. వీటిలో ప్రైవేట్‌యూనివర్సిటీల బిల్లు, పంచాయతీ రాజ్ చట్టానికి సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన మూడు బిల్లులు, తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్), మైనార్టీ కమిషన్, మున్సిపల్ యాక్ట్ సవరణ బిల్లులు ఉన్నాయి. ఇటీవల గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను కలిసిన సందర్భంగా పెండింగ్ బిల్లుల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఆ బిల్లులకు ఆమోదం తెలపాలని ఆయన కోరారు.
గవర్నర్ ఆమోదంతో బిల్లులన్నీ చట్టాలుగా మారనున్నాయి. కాగా, రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీలను యూనివర్సిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు తెచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు అసెంబ్లీ, కౌన్సిల్ నిరుడు ఆగస్టులో ఆమోదం తెలిపాయి. అయితే ఆ బిల్లును అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టారు. భద్రాచలం జనాభా 60 వేలకు పైగా ఉండడంతో మున్సిపాలిటీగా మార్చేందుకు గత ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది. అయితే గవర్నర్ దాన్ని పెండింగ్ లో పెట్టగా.. భద్రాచలం నియోజకవర్గ కేంద్రాన్ని భద్రాచలం, సీతారాంనగర్, శాంతినగర్ గ్రామ పంచాయతీలుగా విభజించి సర్కార్ మరో బిల్లు తెచ్చింది.