యాదాద్రి అనగానే అందరికి గుర్తొచ్చేది.. శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారి దేవాలయం. కొండపై కొలువైయున్న ఆ లక్ష్మీనారసింహుడిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు యాదగిరిగుట్టకు తరలి వస్తుంటారు. దానికి అత్యంత సమీపంలో మానేపల్లి కుటుంబసభ్యులు(మానేపల్లి ట్రస్ట్) సుమారు 22 ఎకరాల విశాల ప్రాంగణంలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయ శిల్పకళ భక్తులను కట్టిపడేస్తుంది. స్వర్ణగిరిగా పేరొందిన ఆ ఆలయాన్ని చూసేందుకు ప్రముఖులు క్యూ కడుతున్నారు.
గురువారం(ఆగష్టు 29) తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ప్రసాదాలు అందజేశారు.