
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి ప్రసంగిoచారు. గవర్నర్ ప్రసంగంలో సహజంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన, అమలు పరుస్తున్న సామాజిక, ఆర్థిక విధానాల ప్రస్తావన ఉంటుంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రసంగం అదే ఒరవడిలో కొనసాగింది.
గవర్నర్ తన ప్రసంగంలో తెలంగాణలో పాలన ప్రజల కేంద్రంగా కొనసాగుతోందని అన్నారు. దీన్ని స్వాగతించాలి. భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే సార్వభౌమాధికారులు. మహాత్మా గాంధీ పాలన అంటే ప్రజలను సేవించడమే అని అభివర్ణించారని.. ఆ ఆశయం కోసం ప్రభుత్వం పని చేస్తుందన్నారు గవర్నర్.
ప్రజలు కూడా అలాగే పాలన జరగాలని కోరుకుంటారు. తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలో ప్రథమస్థానంలో ఉందన్నారు. ఇందుకు కారణం తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడం, వ్యవసాయం చేసే రైతులకు ఆర్థిక సహాయం చేయడం అని ప్రస్తావించారు.
రూ. 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల రుణాలను ప్రభుత్వం రుణమాఫీ చేయడాన్ని గవర్నర్ ప్రసంగంలో ప్రశంసించారు. ఇందుకోసం ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. సన్నబియ్యం పండించిన రైతులకు ఎకరానికి రూ. 500 బోనస్ ఇస్తున్నది. గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్న విషయాలన్నీ వాస్తవాలకు చాలా దగ్గరగా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రం జనాభాలో సుమారు 50% మంది మహిళలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం తీసుకున్న పథకాలపై గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వాగ్దానం లబ్ధి చేకూర్చింది.
ఈ కార్యక్రమాన్ని మహాలక్ష్మి మహిళల ఉచిత బస్సు ప్రయాణం పేరుతో అమలు చేసింది. మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణంపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ పథకం అందరికీకాగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి లబ్ధి చేకూర్చేదిగా ఉంటే బాగుండేది. మహిళా సంఘాలకు ప్రభుత్వం యూనిఫామ్ కుట్టే పని అప్పచెపుతుంది. మహిళల కోసం ఇందిరా శక్తి, మహిళా క్యాంటీన్లు ప్రవేశపెట్టిన అంశాన్ని గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ రెండు చర్యలు మహిళా సాధికారతకు తోడ్పడుతాయి.
సామాజిక న్యాయం, సాంకేతిక నైపుణ్యానికి ప్రాధాన్యత
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు సంపూర్ణంగా పరిరక్షించాలి. ఇందుకోసం పోలీసు వ్యవస్థను ఆధునికీకరించాలి. ఈ అంశాన్ని గవర్నర్ తన ప్రసంగంలో గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో ఎక్కువ శాతం ఉన్న తమకు అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయంలో బీసీలు ఉన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ ప్రకటనతో బీసీలలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
మన రాష్ట్రంలో నిరుద్యోగం ప్రతి సంవత్సరం గణనీయంగా పెరుగుతోంది. విద్యార్థులు డిగ్రీలు సంపాదిస్తున్నారు. కానీ, వారికి ఉద్యోగానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యం కొరవడింది. ఈ కారణంగా ఉద్యోగాలు లభించడంలేదు. పట్టభద్రులు, విద్యావంతులకు ఉద్యోగాలు రావాలంటే వారికి సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి.
విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరచడం కోసం స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ అంశాన్ని గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని, ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించిన అంశాన్ని గవర్నర్ ప్రశంసించారు.
విద్య , క్రీడలకు ప్రాధాన్యం
మారుతున్న ఆర్థిక, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు జరగాలి. ప్రస్తుతం మన విద్యావిధానం నిస్సందేహంగా లోపభూయిష్టంగా ఉంది. ఈ అంశాన్ని గ్రహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానాన్ని సమూలంగా సమీక్షించి తగిన చర్యలు సూచించడం కోసం రాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇది సకారాత్మక చర్య. మన దేశంలో ఆటలలో పాల్గొనేవారికి తగిన ప్రోత్సాహం లభించడం లేదు. మన క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని నిర్ణయించింది.
అధికార పక్షం ప్రభుత్వాన్ని సమర్థిస్తే , ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. బహుశా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 19న ప్రవేశపెట్టవచ్చు. గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ శాసనసభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిస్సందేహంగా ప్రతిపక్షానికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది. దాన్ని గవర్నర్ ప్రసంగించేటప్పుడు కాకుండా గవర్నర్ ప్రసంగంపైన చర్చ సందర్భంగా ఉపయోగిస్తే కొంత మేలు.
కేసీఆర్ పూర్తి బడ్జెట్ సెషన్లో పాల్గొంటే బాగు గవర్నర్ ప్రసంగం కార్యక్రమానికి భారతీయ రాష్ట్ర సమితి అధినేత, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరుకావడం స్వాగతించదగ్గ అంశం. మొత్తం బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరై ప్రభుత్వానికి అవసరమైన సలహాలు, సూచనలు చేయాలి.
కేసీఆర్ ఈ సమావేశంలో పాల్గొంటే తెలంగాణ శాసనసభ సమావేశాలు రసవత్తరంగా జరిగే అవకాశముంది. గవర్నర్ ప్రసంగంపై స్పందించిన కేటీఆర్ గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నట్లు రైతుల రుణమాఫీ అందరికీ జరగలేదని కేవలం 25% నుంచి 30% మందికి జరిగిందన్నారు.
ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ జరుగుతోంది. స్పీకర్‌పై బీఆర్‌ఎస్ సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి అసభ్యంగా మాట్లాడారని, అతన్ని సెషన్ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ చర్చ సందర్భంగా ఏ అంశంపైన అయినా సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం చేయవచ్చు. కానీ పరుషపదజాలం పనికిరాదు.
- డా. పి. మోహన్ రావు, విశ్రాంత ప్రొఫెసర్–