
- తెలంగాణ గేమ్‌చేంజర్ మహాలక్ష్మి
- ఉచిత బస్సు స్కీమ్‌తో మహిళలకు
- రూ.5 వేల కోట్లు ఆదా: గవర్నర్ జిష్ణుదేవ్
- రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతున్నది
- తెలంగాణకు అన్నదాతలే ఆత్మ.. వారి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం
- రూ.25 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేసినం.. వరికి 500 బోనస్ ఇస్తున్నం
- రైతుల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసినం
- స్కిల్ యూనివర్సిటీతో యువత నైపుణ్యం పెంచుతున్నం
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు,ఎస్సీ వర్గీకరణ బిల్లులు తెస్తున్నం
- ప్రతి సభ్యుడు తప్పకుండా సభకు రావాలి.. చర్చలో పాల్గొనాలి
- అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ‘మహాలక్ష్మి పథకం’ గేమ్‌చేంజర్‌గా మారిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకూ 149.63 కోట్ల ఉచిత బస్సు ట్రిప్పులను కల్పించామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.5005.95 కోట్లు ఆదా అయిందని వెల్లడించారు. ఇందిరా మహిళాశక్తి మిషన్ పాలసీ ద్వారా రూ.లక్ష కోట్ల ఆర్థిక సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన సాగుతున్నదని చెప్పారు. బుధవారం శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలతోపాటు ఉజ్వలమైన భవిష్యత్తుకు, తెలంగాణ అభివృద్ధికి రూపుదిద్దుకున్న ప్రణాళికలను వెల్లడించారు. ‘‘మా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంది. అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యం. రైతులు, మహిళలు, యువతకు అన్నివిధాలా సహకారం అందిస్తాం” అని తెలిపారు.
ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ పరిపుష్టి, సాంకేతిక
విజ్ఞానంలో ఆధునికత, సామాజిక న్యాయం వంటి అంశాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలవబోతున్నదని ప్రకటించారు. రాష్ట్రానికి రైతులు ఆత్మ లాంటివారని, వారి అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయబద్ధమైన వాటా కోసం ట్రిబ్యునల్– 2 ముందు బలంగా వాదనలు వినిపించిందని చెప్పారు. మహిళల సాధికారత, రక్షణ, సమాన అవకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ప్రభుత్వానిది ధృడ సంకల్పం
అన్ని రంగాల్లో సమృద్ధిని సాధిస్తూ, పురోగతిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలబెట్టేందుకు అందరం సంఘటితంగా, విశ్వాసంతో, నిబద్ధతతో కలిసి ముందుకు సాగుదామని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. అవకాశాలకు నెలవుగా, అభివృద్ధి మార్గంలో సాధికారత కలిగిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ భవిష్యత్తు మరింత ఉజ్వలమైందని చెప్పారు. యువ, డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పాలసీ, ప్రతి కార్యక్రమం, ప్రతి సంస్కరణ అవకాశాలు కల్పించడానికి, ప్రజల సాధికారత కోసం, సమ్మిళిత వృద్ధి కోసం స్పష్టమైన విజన్‌తో నిర్దేశించినవని వివరించారు. ఈ వేగగతి నిలువరించలేనిదని అన్నారు. ప్రభుత్వ సంకల్పం దృఢమైనదని చెప్పారు. “నా ప్రభుత్వం ప్రతి పౌరుడి ఆకాంక్షలను నెరవేర్చి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు వెళ్తున్నది. రైతులు, యువత, మహిళలు, కార్మికులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అభిప్రాయాలకు అనుగుణంగా అపరిమితమైన అవకాశాలతో తెలంగాణ తన ప్రయాణాన్ని వేగవంతం చేస్తూ అభివృద్ధికి ఒక దిక్సూచిలా, ఒక మోడల్ రాష్ట్రంగా ఉండాలని భావిస్తున్నది. అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తున్నది” అని పేర్కొన్నారు.
రుణమాఫీ చేసినం..భూ సమస్యలకు భూ భారతి చట్టం
ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలు అని, రాష్ట్రానికి రైతులు ప్రాణమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉందన్నారు. దేశంలో అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ మారిందని చెప్పారు. అన్నదాతలకు రుణమాఫీ చేశామని, 23.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని తెలిపారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేల చొప్పున వారికి అందిస్తున్నామని, రైతు వేదికలకు టెక్నాలజీ అనుసంధానం చేసి రైతు నేస్తం అమలు చేస్తున్నామని వెల్లడించారు. వరి పంటకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని, అన్నదాతల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పాలనను బలోపేతం చేస్తున్నదని తెలిపారు. భూ సంబంధిత సేవలను సరళతరం చేయడం, భూ సమస్యలను సకాలంలో పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని అన్నారు. భూ పరిపాలనను క్రమబద్ధీకరించి, పౌరులందరికీ భూ భద్రత కల్పించడానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు.
సాహసోపేతంగా కుల గణన
రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించడం ద్వారా ప్రభుత్వం సాహసోపేతమైన మార్పు దిశగా ప్రయాణానికి శ్రీకారం చుట్టిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సామాజిక న్యాయాన్ని అందించే దిశగా ఇటీవల నిర్వహించిన సర్వే ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్ట బద్ధత కల్పించడానికి ప్రభుత్వం బిల్లును ప్రతిపాదించిందని తెలిపారు. జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫారసుల ఆధారంగా ఎస్సీ ఉప వర్గీకరణపై బిల్లును ప్రవేశపెట్టనుందని చెప్పారు. ‘ జయ జయహే తెలంగాణ – జననీ జయ కేతనం’ను రాష్ట్ర గీతంగా చేసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన పోరాటాలు, త్యాగాలను గౌరవించడమే కాకుండా భవిష్యత్తు కోసం ఆశను, స్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వం నింపుతున్నదని గవర్నర్ అన్నారు. తెలంగాణ ఘనమైన సంస్కృతికి నిలయం అని పేర్కొన్నారు. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారని తెలిపారు. సెక్రటేరియెట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నామని చెప్పారు. ‘‘తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు.. అది ఒక భావోద్వేగం, పోరాటానికి, స్థిరత్వానికి, ధృడ సంకల్పానికి ఒక గుర్తు అని పేర్కొన్నారు.
క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ..
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఇంధన రంగంలో భద్రత, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగావకాశాలు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ -–2025 ద్వారా రోడ్ మ్యాప్‌ను ప్రకటించామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. 2029–30 నాటికి 6 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పాటుపడుతున్నదని తెలిపారు. 49,500 మందికి ఉద్యోగాలను కల్పించేలా తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ రూ.1,78,950 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని చెప్పారు. గత సంవత్సర కాలంలో 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్టు తెలిపారు. క్రీడల్లో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు బిల్లును ఆమోదించామని చెప్పారు.
మెట్రో విస్తరణ..పట్టణాభివృద్ధి నమూనాగా ఫ్యూచర్ సిటీ
మెట్రో రైలు నెట్ వర్క్ విస్తరణ , మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ ఏర్పాటు వంటి ప్రాజెక్టులతో దేశంలోనే నెట్ జీరో సిటీ ఆవిర్భవించబోతున్నదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. 7 మండలాలు, 56 గ్రామాలతో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీ దేశంలో పట్టణాభివృద్ధిలో ఒక నమూనాగా నిలువబోతున్నదని గవర్నర్ వివరించారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబానికి 10 లక్షలకు పెంపు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు గృహ నిర్మాణం, విద్య, ఉపాధికి తీసుకున్న చర్యలు, రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణం వంటివి వివరించారు. పారిశ్రామిక వృద్ధి సాధన, పెట్టుబడులను ఆకర్షించడం, ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఐటీ హబ్‌ల విస్తరణ, ఏఐ, డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ తన హోదాను సుస్థిరం చేసుకుంటున్న విధానాలు వంటి అనేక అంశాల్లో రాష్ట్ర లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
బడ్జెట్.. భవిష్యత్ విజన్‌కు ప్రతిబింబం
బడ్జెట్ కేవలం అంకెల కూర్పు మాత్రమే కాదని, భవిష్యత్తు కోసం ప్రభుత్వ ప్రాధాన్యతలు, విజన్‌కు ప్రతిబింబమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. మన పాలసీలను, కార్యక్రమాలను, సంక్షేమ చర్యలను తెలియజేసే ఒక ఆర్థికపరమైన నమూనా అని పేర్కొన్నారు. శాసన సభ్యులు అత్యంత ఆసక్తితో, శ్రద్ధతో బడ్జెట్ చర్చలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. ‘‘నేటి రోజున జరిగిన బడ్జెట్ చర్చలు రేపటి ఆర్థిక ఇబ్బందులను నివారిస్తుంది . కొన్నిసార్లు అంకెలు భయపెట్టినప్పటికీ, ప్రతి కేటాయింపు వెనుక మన ప్రజల ఆకాంక్షలు వున్నాయని మనం గుర్తించాలి” అని గవర్నర్ తెలిపారు.
ఏడాదిలోనే ఎంతో సంక్షేమం..
యువజన సాధికారత కల్పించాలన్న లక్ష్యంతో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటుతోపాటు ప్రపంచంతో పోటీ పడే నైపుణ్యాలు గల ప్రతిభావంతులను అందించడానికి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను అందించే కార్యక్రమం చేపట్టామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల కోసం 40 శాతం డైట్, 200 శాతం కాస్మొటిక్ చార్జీలను పెంచామని వివరించారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా ప్రభుత్వం లక్ష కోట్ల ఆర్థిక సహాయంతో లక్ష మంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తుందని చెప్పారు. గృహజ్యోతి పథకం ద్వారా 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నదని తెలిపారు. 43 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా రూ. 500 కే ఎల్పీజీ సిలిండర్ అందిస్తున్నట్టు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్కీమ్ ప్రారంభంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అత్యంత నాణ్యమైన విద్యను పొందుతారని గవర్నర్ తెలిపారు. టెంపుల్, ట్రైబల్, వెల్‌నెస్ టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ఆధ్యాత్మిక, చారిత్రక, సహజ అందాల విశిష్ట మేళవింపును పర్యాటకులకు అందిస్తున్నదని చెప్పారు. కల్లుగీత కార్మికులకు ‘కాటమయ్య రక్షణ కవచం’, చేనేత కార్మికుల కోసం ‘తెలంగాణ చేనేత అభయ హస్తం’లాంటి ప్రత్యేక కార్యక్రమాలను పటిష్టపరిచినట్టు తెలిపారు.