గవర్నర్ పర్యటన విజయవంతం చేయాలి

గవర్నర్ పర్యటన విజయవంతం చేయాలి
  • ములుగు, జనగామ కలెక్టర్లు దివాకర, రిజ్వాన్​బాషా
  • 27, 28 తేదీల్లో జిల్లాల్లో పర్యటన
  • జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలు, రచయితలు, కవులతో కలెక్టరేట్లలో చర్చ
  • రామప్ప, లక్నవరం సందర్శన

ములుగు, వెంకటాపూర్(రామప్ప)/ జనగామ అర్బన్, వెలుగు : తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమాలను సక్సెస్​ చేయాలని కలెక్టర్లు దివాకర, రిజ్వాన్​బాషా అధికారులకు సూచించారు. ఈనెల 27, 28 తేదీల్లో జిల్లాల్లో పర్యటించనున్నారు. 27న ములుగు కలెక్టరేట్​లో రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలు రచయితలు, కవులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వారితో పలు అంశాలపై చర్చించి అనంతరం జిల్లాలోని వెంకటాపూర్ మండలం రామప్ప రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు.

 గోవిందరావుపేట మండలం లక్నవరం సైతం సందర్శించనున్నారు. రాత్రి ములుగు జిల్లాలో బస ఉంటుందని, 28న హనుమకొండ పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర తెలిపారు. గవర్నర్ పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో జిల్లా ఎస్పీ శబరీశ్, డీఎఫ్​వో రాహుల్ కిషన్ జాదవ్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయలతో కలిసి సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, గవర్నర్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

 జిల్లా అధికారులకు కేటాయించిన విధులను జాగ్రత్తగా నిబద్ధతతో నిర్వర్తించాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని, ముఖ్యంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చేయాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీవో సత్య పాల్ రెడ్డి, జడ్పీ సీఈవో సంపత్ రావు, డీఎస్పీ రవీందర్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : ఆక్రమణలపై హైడ్రా ఫోకస్

గవర్నర్​ పర్యటన ఏర్పాట్ల పరిశీలన..

జనగామ జిల్లాలో రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ పర్యటన ఏర్పాట్లను జనగామ కలెక్టర్ రిజ్వాన్ ​బాషా షేక్, అడిషనల్ కలెక్టర్లు పింకేశ్ కుమార్, రోహిత్ సింగ్ తో కలిసి గవర్నర్ ప్రిన్సిపల్​ సెక్రటరీ బుర్రా వెంకటేశం శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కలెక్టరేట్​లో వివిధ శాఖలను సందర్శించి, పర్యవేక్షించారు. గవర్నర్ పర్యటనకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లపై చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం జనగామ మండలంలోని ఓబుల్​కేశ్వాపూర్​ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద మినీ ఆడిటోరియాన్ని సందర్శించి తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా జిల్లాకు చెందిన 20 మంది రచయితలు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర పురస్కార గ్రహీతలతో మీటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. రోడ్ల మరమ్మతులు, పరిశుభ్రత చర్యలు చేపట్టాలని, భోజనం, తాగునీటి వసతులకు సంబంధించి సూచనలు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.