- లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం
- తమిళనాడు లేదా పుదుచ్చేరి నుంచి పోటీ
- పరిశీలనలో మరో నాలుగైదు నియోజకవర్గాలు
- గవర్నర్‌గా 4 ఏండ్ల 6 నెలల పాటు పనిచేసిన తమిళిసై
- నేడో రేపో ఇన్చార్జ్ గవర్నర్‌ను నియమించనున్న రాష్ట్రపతి
హైదరాబాద్ , వెలుగు : రాష్ట్ర గవర్నర్ పదవికి తమిళిసై సోమవారం రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. అనంతరం తమిళిసై రాజీనామా చేసినట్టు రాజ్ భవన్ ప్రెస్ సెక్రటరీ నుంచి ప్రకటన విడుదలైంది. కాగా, రాజీనామా తర్వాత ఆమెను సీఎస్ శాంతికుమారి మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్ భవన్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో తమిళిసై ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇంత కాలం తనకు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. త్వరలో రాష్ట్రపతి తెలంగాణకు ఇన్చార్జ్ గవర్నర్‌ను నియమించనున్నట్టు తెలుస్తున్నది.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ లేదా పక్క రాష్ర్ట గవర్నర్ కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ జరుగుతున్నది. కాగా, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నందున తమిళిసై రాజీనామా చేశారు. తమిళనాడు లోని కన్యాకుమారి లేదా తిరునల్వేలి లేదా చెన్నై సౌత్ లేదా పుదుచ్చేరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. బీజేపీ సైతం మెజారిటీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. త్వరలో పెండింగ్ లో ఉన్న సీట్లకు క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉన్నందున , రాజీనామాకు బీజేపీ హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే తమిళిసై పదవి నుంచి వైదొలిగినట్టు సమాచారం.
నాలుగేండ్లు.. బీఆర్ఎస్ సర్కారుతో విభేదాలు
గవర్నర్ గా తమిళిసై 2019 సెప్టెంబర్ 8న బాధ్యతలు చేపట్టగా.. 4 ఏండ్ల 6 నెలల 10 రోజుల పాటు పనిచేశారు. గవర్నర్ గా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత కాలం గత బీఆర్ఎస్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య మంచి వాతావరణమే కొనసాగింది. గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి పేరును క్యాబినెట్ పంపగా గవర్నర్ తిరస్కరించడంతో ప్రభుత్వానికి , రాజ్ భవన్ కు మధ్య గ్యాప్ నెలకొన్నది. సోషల్ మీడియా వేదికపై అధికార పార్టీ కార్యకర్తలు, నేతలు గవర్నర్ ను విపరీతంగా ట్రోల్ చేశారు.
ఆమె గవర్నర్ గా వ్యవహరించడం లేదని, బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని కేటీఆర్, హరీశ్‌రావు, కవిత , ఇతర ప్రజప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఎన్నో సార్లు ఆరోపించారు. అప్పటి నుంచి కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ వరకు కేసీఆర్, గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితి ఏర్పడింది. గవర్నర్ జిల్లాలకు వెళ్లినపుడు కలెక్టర్, ఎస్పీ , అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాకపోవడం, ప్రొటోకాల్ పాటించకపోవడం, రాజ్ భవన్ కు సీఎం, మంత్రులు రాకపోవడం, అధికారిక కార్యక్రమాలకు సైతం గవర్నర్ ను ఇన్వైట్ చేయకపోవడంతో వివాదం మరింత ముదిరింది. మరో వైపు రాజ్ భవన్లో నిర్వహించే బతుకమ్మ, బోనాలు ఇతర ఫెస్టివల్స్‌కు ఆహ్వానించినా సీఎం, మంత్రులు దూరంగా ఉండటంతో గవర్నర్ పలుసార్లు చూసి.. ప్రధాని, హోం మంత్రికి సైతం ఫిర్యాదులు చేసినట్టు వార్తలు వినిపించాయి.
ఇక అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టడం, వాటిపై వివరణ కోరడం, వివరణ ఇచ్చినా ఆమోదించకపోవడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ అంశంపై ప్రభుత్వ ఆదేశాలతో సీఎస్ శాంతి కుమారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం మరింత వివాదానికి కారణమయ్యింది. ఆ టైమ్‌లో గవర్నర్ స్పందిస్తూ సుప్రీంకోర్టు కంటే రాజ్ భవనే దగ్గర అని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టడంతో ఆర్టీసీలోని అధికార పార్టీ యూనియన్ నేతలు, కార్యకర్తలు ఏకంగా రాజ్ భవన్ ముట్టడించారు.
ఈ కార్యక్రమం వెనుక అధికార పార్టీ ఉందని, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ కార్యక్రమం జరిగిందని అప్పటి యూనియన్ నేతలు బహిరంగానే వ్యాఖ్యానించారు. మేడారం పర్యటనకు ప్రభుత్వం హెలికాప్టర్ ఏర్పాటు చేయకపోవడంతో కాన్వాయ్ లోనే వెళ్లడం.. ఇలా గవర్నర్ కు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అసెంబ్లీలో సైతం పలు టెక్నికల్ అంశాలను కారణాలుగా చూపించి అధికార పార్టీ నేతలు గవర్నర్ స్పీచ్ ను క్యాన్సిల్ చేశారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైల్ పెండింగ్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీలకు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యానారాయణ పేర్లను బీఆర్ఎస్ ప్రభుత్వం పంపింది. ఈ పేర్లను గవర్నర్ ఆమోదించలేదు. సర్వీస్ కేటగిరీ స్పష్టం చేయలేదని, రూల్స్ ప్రకారం అనర్హులుగా తేలడంతో పక్కన పెట్టినట్టు గవర్నర్ మీడియాకు తెలిపారు. కాగా ఈ ఇద్దరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో కొత్త వివాదం స్టార్ట్ అయింది. ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీలకు పంపిన ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ ఆలీఖాన్ పేర్లను ఆమోదించడంతో మరో వివాదం స్టార్ట్ అయింది. ఇటీవల విచారణ జరిపి మళ్లీ కేబినెట్ ద్వారా పేర్లు పంపాలని హైకోర్టు ఆదేశించగా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ ఆలీఖాన్ పేర్లను మళ్లీ పంపింది. అయితే, వాటిని గవర్నర్ ఆమోదించలేదు.
రాష్ర్ట ప్రజలకు లేఖ
గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తమిళిసై రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. తెలంగాణ గవర్నర్ పదవికి భావోద్వేగాలతో రాజీనామా చేశానని, ఈ అద్భుతమైన రాష్ట్రానికి సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అన్నింటికీ మించి తెలంగాణలోని సోదర సోదరీమణుల ఆప్యాయత తనను ఆకట్టుకుందని, అద్భుతమైన ప్రయాణం, చిరస్మరణీయ జ్ఞాపకాలతో నిండిన హృదయంతో రాష్ట్రాన్ని వీడుతున్నానని లేఖలో తమిళిసై పేర్కొన్నారు.
ఎన్నో కార్యక్రమాలతో తనదైన ముద్ర
రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ ఇవ్వకపోవడం, అధికార పార్టీ కార్యకర్తలు, నేతలు విమర్శలపై తమిళిసై పలు సార్లు మీడియా ఎదుట బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిత్యం వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, యూనియన్లకు అపాయింట్ మెంట్ ఇచ్చి వారి వినతిపత్రాలు తీసుకోవడం, వాటిని ప్రభుత్వానికి పంపడం, సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని రాజ్ భవన్ బయట డ్రాప్ బ్యాక్స్ ఏర్పాటు చేయడం.. ఇలా ఎన్నో కార్యక్రమాలను తమిళిసై చేపట్టారు. గిరిజన తండాలను దత్తత తీసుకోవడం, స్వచ్ఛంద సంస్ధలు, ఐటీ కంపెనీల సౌజన్యంతో పేద విద్యార్ధులకు ల్యాప్ టాప్‌లు అందజేయటం వంటి కార్యక్రమాలతో ముందు కెళ్లారు. కరోనా టైమ్ లోను నిమ్స్, గాంధీ హాస్పిటల్ లను తనిఖీ చేసి, రోగులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు.
వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉంది
తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు తన జీవితంలో ఎప్పటికి మరువలేనని గవర్నర్ తమిళిసై అన్నారు. ఇక్కడి అన్నలు, చెల్లెలు, అక్కలు, తమ్ముళ్లను, పెద్దలను వదిలి వెళ్తున్నం దుకు బాధగా ఉన్నదని పేర్కొన్నారు. సోమ వారం చెన్నై వెళ్లేముందు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సేవ చేసేందుకు వెళ్తున్నానని, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎప్పటికీ తెలంగాణ ప్రజల చెల్లెనే అని స్పష్టం చేశారు.