బ్యారేజీ పూర్తికాకుండానే సీసీ ..మేడిగడ్డ ఎస్ఈ, ఈఈపై సర్కార్ చర్యలు..

బ్యారేజీ పూర్తికాకుండానే సీసీ ..మేడిగడ్డ ఎస్ఈ, ఈఈపై సర్కార్ చర్యలు..
  • చార్జ్​ మెమోలు జారీ చేసిన ఇరిగేషన్ శాఖ
  • పది రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం
  • బ్యారేజీ నిర్మాణం పూర్తికాకుండానేసర్టిఫికెట్ ​కోసం మూడు సార్లు ఎల్​ అండ్​ టీ లేఖలు
  • 15 రోజుల్లోనే సీసీ జారీ చేసిన అధికారులు
  • నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనేఇచ్చారనే అనుమానాలు
  • నిరుడు సెప్టెంబర్​లో సీసీని రద్దు చేసిన సర్కార్​

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ పూర్తి కాకుండానే నిర్మాణ సంస్థ ఎల్​అండ్​ టీకి కంప్లీషన్​ సర్టిఫికెట్ (సీసీ)​ ఇచ్చిన అంశంపై సర్కారు చర్యలకు సిద్ధమైంది. బ్యారేజీకి ఆ సమయంలో ఎస్ఈగా పనిచేసిన బి.వి. రమణా రెడ్డి, ఈఈ తిరుపతిరావుకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇరిగేషన్​ శాఖ సెక్రటరీ రాహుల్​ బొజ్జా చార్జ్​మెమోలు జారీ చేశారు. ఏపీ సివిల్​ సర్వీసెస్​ రూల్స్​ 1991లోని రూల్​ 20  ప్రకారం (2016లో తెలంగాణకు అడాప్ట్​ చేసుకున్న) ఇద్దరు అధికారులపై విచారణ చేయాలని మెమోల్లో పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిర్మాణ సంస్థకు లబ్ధి చేకూర్చడం వంటి కారణాలతో ఇద్దరు అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందిన 10 రోజుల్లో రాతపూర్వక వివరణ ఇవ్వాలని, వ్యక్తిగతంగా వచ్చి విచారణ అధికారులకు వివరణ డాక్యుమెంట్లను సమర్పించాలని మెమోల్లో పేర్కొన్నారు. ఇచ్చిన గడువులోపు వివరణ ఇవ్వకుంటే విచారణ చేపట్టాల్సి ఉంటుందన్నారు. విచారణాధికారిపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకురావాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఉత్తర్వుల్లో హెచ్చరించారు. 

సీసీ రద్దు

మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి ఇచ్చిన సీసీని నిరుడు సెప్టెంబర్​ 24న ప్రభుత్వం రద్దు చేసింది. అందుకు సంబంధించి నిర్మాణ సంస్థ ఎల్​అండ్​టీకి ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ నోటీసులు కూడా పంపించింది. బ్యారేజీ కంప్లీట్​అయినట్టు ఇచ్చిన సర్టిఫికెట్​ను రిటర్న్​ చేయాల్సిందిగా నోటీసుల్లో కోరారు. వాస్తవానికి కంప్లీషన్​ సర్టిఫికెట్​ ఇచ్చే నాటికి బ్యారేజీ వద్ద పెండింగ్​లో ఉన్న పనుల విలువ దాదాపు రూ.150 కోట్ల వరకు ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆ పనులు పూర్తికాకముందే సీసీ ఇవ్వాలని అధికారులకు నిర్మాణ సంస్థ ఎల్​ అండ్​ టీ 3 సార్లు లేఖలు రాసింది. 2019 జూన్​ 21న అప్పటి సీఎం కేసీఆర్​ బ్యారేజీని ప్రారంభించగా.. అదే ఏడాది ఆగస్టు 6న సీసీ​ ఇవ్వాలంటూ అప్పటి ఈఈకి నిర్మాణ సంస్థ మొదటిసారి లేఖ రాసింది. అయితే, డ్యామేజ్ లున్నాయని, వాటి రిపేర్లు పూర్తి చేయాలని సంబంధిత సంస్థకు అధికారులు 2020లో లేఖ రాశారు. ఆ పనులను చేపట్టకుండానే.. మిగిలిపోయిన పనులను చేయకుండానే మరోసారి 2020 అక్టోబర్​ 12న  బ్యారేజీ అధికారులకు లేఖ రాసింది. డ్యామేజీలు బాగు చేయాలని, మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరుతూ నిర్మాణ సంస్థకు నాటి ఈఈ 2021 ఫిబ్రవరి 17న లేఖ రాశారు. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా 2021 మార్చి 10న సర్టిఫికెట్​ ఇవ్వాలంటూ అధికారులకు మరోసారి లేఖ రాసింది.

5 రోజుల్లోనే ఆదరబాదరగా సర్టిఫికెట్​

వాస్తవానికి నిర్మాణ సంస్థ రెండోసారి రాసిన లేఖలో బ్యారేజీకి దిగువన డ్యామేజీలున్నాయని, వాటికి రిపేర్లు చేయాల్సి ఉందని పేర్కొంది. కంప్లీషన్​ సర్టిఫికెట్​ ఇచ్చే ముందు నిర్మాణ సంస్థ నుంచి అండర్​టేకింగ్​ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కానీ, అది​ లేకుండానే.. మూడోసారి లేఖ రాసిన వెంటనే ఆదరబాదరగా నిర్మాణ సంస్థకు అధికారులు సీసీ ఇచ్చారు. 2021 మార్చి 15న నాటి మేడిగడ్డ ఈఈ తిరుపతి రావు కంప్లీషన్​ సర్టిఫికెట్​ను జారీ చేశారు. దానిపై అప్పటి ఎస్ఈ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ లేఖ రాసిన 5 రోజుల్లోనే సీసీ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  నాటి ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే నిర్మాణ సంస్థకు వెంటనే సీసీ జారీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి.