తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రపంచంలోనే గొప్ప చరిత్ర ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969 మొదలు 2014 వరకు దశలవారీగా పోరాటం విస్తృతంగా కొనసాగడంతో పాటు 1969లో తుపాకీ తూటాలకు ఎదురొడ్డి పోరాడి తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించిన చరిత్ర తెలంగాణది. అమరవీరుల త్యాగాల పునాదులతో దశలవారీగా జరిగిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని నేటి పాలకులు విస్మరించి వారి స్వీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత ఎజెండాలతో ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ రగిలించేందుకు దశాబ్ది ఉత్సవాల పేరిట వేలాది కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తూ సంబరాలను జరుపుకుంటున్నారు.
తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్, తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, వరంగల్ డిక్లరేషన్, సూర్యాపేట డిక్లరేషన్, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ, తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ విద్యార్థి సంఘం, డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్, ఆదివాసీ విద్యార్థి సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, అనేక సంఘాలతో పాటు కొంత మంది రాజకీయ నాయకులు తెలంగాణ పేరిట పార్టీలను స్థాపించి వాళ్ల వ్యక్తిగత కారణాలతో వివిధ పార్టీలలో విలీనం చేశారు . తెలంగాణ ఉద్యమం నిరంతరం ప్రజల్లో రగిలే నిప్పు కణికల్లాగా ఉద్యమ ప్రస్థానం కొనసాగింది.10 జిల్లాలతో కూడిన తెలంగాణ స్వరాష్ట్రం కోసం బెల్లి లలితక్క,
మారోజు వీరన్న, ఐలన్న, నల్ల వసంత్, సుదర్శన్, కనకాచారి, ఆకుల భూమయ్య, ముక్క కరుణాకర్, అనేకమంది ప్రజా పోరాటాలను నిర్వహించి ఉద్యమాలతో ప్రజలను చైతన్యం చేశారు. ఈ పోరాటంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి రాజ్యం చేతిలో అమరులయ్యారు. 17 ముక్కలైన బెల్లి లలితక్కను, అమరవీరులను తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం యాది మరిచిందనే చెప్పవచ్చు. బెల్లి లలితక్క త్యాగం ఉన్నతమైనది.
ప్రజలకు చేసిందేమీ లేదు
2009 నుంచి 2014 ఉద్యమంలో అసువులు బాసిన వందలాది మంది తెలంగాణ బిడ్డల కుటుంబాలను, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది. 2009లో విద్యార్థి, ఉద్యోగ, ప్రజా,కార్మిక, కర్షక పోరాటాల మూలంగా వెల్లువెత్తిన ఉద్యమాన్ని ఓటు బ్యాంక్ గా మలుచుకుని 2014, 2018లో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా దశాబ్ది ఉత్సవాల పేరిట మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారు. వేలాది కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఆర్భాటాలతో కార్యక్రమాలను నిర్వహించి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి, రాబోయే రోజుల్లో మూడవసారి అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి ప్రజల్లో రగిలించే ప్రయత్నంలో భాగమే దశాబ్ది ఉత్సవాలు తప్ప దశాబ్ది కాలంలో తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదు. అమరుల కుటుంబాలకు ఇస్తానన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలతో సరిపెట్టారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను భావోద్వేగానికి తెరలేపి తమ స్వీయ ప్రయోజనానికి ప్రజలను వాడుకున్నారు.
పాలమూరు రంగారెడ్డి ఏమాయె!
నీళ్లు రావాలంటే, నిధులు కావాలి, నిధులు కావాలంటే నియామకాలు జరగాలి. అది కేసీఆర్ కుటుంబానికి ప్రయోజనం తప్ప తెలంగాణ ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం కాదు. నీళ్ల కోసం ప్రాజెక్టులను నిర్మాణం చేయాలి. ప్రాజెక్టులకు నిర్మాణం చేయాలంటే బడ్జెట్ కేటాయించాలి. భూమిలేని లక్షలాదిమంది కుటుంబాలకు ఎకరా భూమి కూడా పంపిణీ చేయలేదు. నియామకాలు ఎవరికి వచ్చాయి ? ప్రజలకు ఏమి ప్రయోజనం చేకూరింది? సమైక్య పాలనలో కృష్ణా నదీ జలాలలో ఎంత వాటర్ దక్కిందో నేడు స్వరాష్ట్రంలో కూడా అంతే వాటర్ దక్కుతుంది తప్ప అదనంగా ఒక్క టీఎంసీ కూడా రాలేదని పోరాటం నేటికి కొనసాగుతుంది.
దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులైన పాలమూరు రంగారెడ్డి, నక్కలగండి, డిండి ప్రాజెక్టులను పెండింగ్లోనే ఉంచారు కానీ పూర్తి చేయలేదు. అసెంబ్లీలో మాత్రం బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నప్పటికీ ఆచరణలో ఒక్క రూపాయి కూడా విడుదల చేసి దక్షిణ తెలంగాణలో వివక్షతకు గురవుతున్న ప్రజలకు మాత్రం నీటి సమస్యను తేల్చడం లేదు. తెలంగాణ యువత కొట్లాడితే ఉద్యోగాలు అరకొర అవి పేపర్ లీకేజీల వ్యవహారమే తప్ప నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు. పౌర ప్రజాస్వామిక హక్కులను దశాబ్ది కాలం పాటు తెలంగాణలో లేని దుస్థితి స్వరాష్ట్ర పాలనలో ఏర్పడింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య పాలన కంటే భిన్నంగా ప్రజలకు, ప్రజల ఆకాంక్షలకు ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించారు.
స్వరాష్ట్రాన్ని బాగు చేయడానికి సమయం పడుతుందని మాటలు చెబుతూ, కాలయాపన చేస్తూ 9 ఏండ్ల కాలం వెళ్లబుచ్చారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ హామీని అమలు చేయకపోగా గడిచిన 9 ఏండ్లుగా రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయలేదు. రైతులు పండించిన ప్రతి పంటను మద్దతు ధరకు కొంటామని రైతులకు హామీ ఇచ్చిన కేసీఆర్.. తొమ్మిదేళ్ల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయకపోగా నేటికీ యాసంగి వరి ధాన్యం కల్లాలలోనే ఉండిపోయింది. ఇలా అన్నిట్లా స్వరాష్ట్ర పాలనలో అన్యాయమే కనిపిస్తున్నది.
గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం
రైతాంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది. ఫ్రెండ్లీ పోలీసులు అంటూనే ప్రజలు ప్రజాస్వామిక వాదులపై ఉద్యమకారులపై ప్రశ్నిస్తున్న వాళ్లపై అక్రమ కేసులు పెట్టుతూ జైల్లో బంధిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల దళితులపై దాడులు, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న దళితులపై ప్రజలపై దాడులు చేస్తున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఆజాం జహీ మిల్, పార్ట్ టూల్స్, అల్విన్, హెచ్ఎంటి, ఐడీపీఎల్ లను ప్రభుత్వం తెరవలేదు. కార్మిక వర్గానికి కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడికతీత చెరువుల ఆధునీకరణ పేరుతో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నది.
వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా చేసింది ఏమీ లేదు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఏరియా ఆసుపత్రితో పాటు ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ అమలేది? పల్లె ప్రకృతి వనం వైకుంఠధామాలు నర్సరీలు క్రీడా ప్రాంగణాల పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం ఖజానా చేసుకొని పల్లెల్లో పేదవారిని మరింత పేదవారిగా మార్చారు. దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కానీ నేటికీ అమలు కాలేదు. సమైక్య ముఖ్యమంత్రి పోయి తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చారు తప్ప పాలనలో, తెలంగాణ ప్రజల బతుకుల్లో వచ్చిన మార్పేమీలేదు. ఆ మార్పు దోచుకోవడానికి వచ్చింది తప్ప విధానపరమైన భిన్నమైన పాలన కోసం వచ్చిన అనుభూతి లేదు.
వేముల గోపినాథ్