హైదరాబాద్: చైనాలో హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ఎంపీవీ) వైరస్ విజృంభణతో మరోసారి ప్రపంచదేశాలు భయాందోళనకు గురి అవుతున్నాయి. గతంలో చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన మరణ మృదంగం ప్రత్యక్షంగా చూసిన ప్రజలు.. మరోసారి అదే దేశం నుండి మరో ప్రాణాంతం వైరస్ పుట్టుకురావడంతో హడలెత్తిపోతున్నారు. ఈ సారి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని బిక్కు బిక్కుమంటున్నారు. హెచ్ఎంపీవీ వ్యాప్తితో ప్రపంచ దేశాలు అలర్ట్ అవుతున్నాయి. ప్రజలకు పలు సూచనలు చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలని రాష్ట్ర ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచించింది. చైనాలో విజృంభిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు ఇప్పటికే వరకు తెలంగాణలో నమోదు కాలేదని ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని తెలిపింది. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారు ముందస్తు జాగ్రత్తలో భాగంగా జన సమూహాలకు దూరంగా ఉండాలని సూచించింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చేయాల్సినవి, చేయకూడని పనులకు సంబంధించిన గైడ్ లైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ALSO READ | తెలంగాణ గ్రామీణ బ్యాంకు IFSC కోడ్ మారింది.. చెక్ డిటెయిల్స్
చేయాల్సిన పనులు:
-మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోటిని ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపర్‌తో కవర్ చేసుకోవాలి.
-మీకు జ్వరం, దగ్గు, తుమ్ములు ఉంటే బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలి
సబ్బు లేదా శానిటైజర్‌తో మీ చేతులను తరచుగా శుభ్రం చేసుకోండి
-ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తులకు దూరం పాటించాలి
జన సాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలను వెళ్లరాదు
-ఎక్కువగా నీళ్లు తాగాలి పౌష్టికాహారం తీసుకోవాలి
-తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవాలి
చేయకూడని పనులు:
ఇతరులతో -కరచాలనం(షేక్ హ్యాండ్) చేయవద్దు
-ఫ్లూ బారిన పడిన వారు ఉపయోగించిన టిష్యూ పేపర్, కర్చీఫ్‌లను ఇతరులు వాడరాదు
కళ్ళు, ముక్కు, నోటిని తరచుగా తాకవద్దు
ఫ్లూ లక్షణాలుంటే- వైద్యుని సంప్రదించకుండా సొంతంగా మెడిసిన్ వాడొద్దు