హైదరాబాద్: గ్రూప్–2 పరీక్షకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు జరగనున్నాయి. 2 రోజులు నాలుగు సెషన్లలో గ్రూప్–2 పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. డిసెంబర్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటాయి. పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాలని టీజీపీఎస్సీ అభ్యర్థులకు కీలక సూచన చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి.
పరీక్షా కేంద్రానికి ఎలక్ట్రానిక్స్ పరికరాలు తేవద్దని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. హాల్ టికెట్ డౌన్ లోడ్ సమయంలో ఏదైనా సమస్యలు తలెత్తితే సంబంధింత అధికారులను సంప్రదించాలని పేర్కొంది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. కాగా, 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షకు మొత్తం 5.57 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.
2024 ఆగస్ట్ నెలలోనే గ్రూప్-2 పరీక్షలు జరగాల్సి ఉండగా.. అదే సమయంలో డీఎస్సీ ఎగ్జామ్స్ ఉండటంతో ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం లేదని.. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తికి సానూకూలంగా స్పందించిన ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలను యధావిధిగా నిర్వహించి.. గ్రూప్-2 పరీక్షలను పోస్ట్‌పోన్ చేసింది. డీఎస్సీ, గ్రూప్-3 పరీక్షలు పూర్తి కావడంతో గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.