
- మంచిర్యాల బ్యాక్ వాటర్ ప్రొటెక్షన్కు రూ.100 కోట్లు
- కుప్టీ ప్రాజెక్టు సర్వేకు రూ.50 లక్షలు
ఆదిలాబాద్, వెలుగు: ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2025–26 బడ్జెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు రూ. 23,373 కోట్లు కేటాయించగా.. ఇందులో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు సైతం నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. జైనథ్ మండలంలోని పెన్ గంగా నదిపై నిర్మిస్తున్న చనాఖా కోర్టా ప్రాజెక్టుకు రూ.179.13 కేటాయించింది.
ఈ నిధులుతో ప్రాజెక్టుల కాల్వల నిర్మాణానికి, భూ సేకరణకు మార్గం సుగమమయ్యింది. మత్తడివాగు ప్రాజెక్టు రూ.3 కోట్లు, ప్రాణహిత చేవేళ్లు ప్రాజెక్టు రూ.32.22 కోట్లు, కుమ్రం భీం పెద్దవాగుకు రూ 5.52కోట్లు, స్వర్ణ ప్రాజెక్టు రూ. 71 లక్షలు, సాత్నాల ప్రాజెక్టు రూ. 8.52 కోట్లు, జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు రూ.10.70 కోట్లు కేటాయించింది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న నేరడిగొండ మండలంలోని కుప్టీ ప్రాజెక్టు సర్వే కోసం రూ.50 లక్షలు కేటాయించింది. గతేడాది బడ్జెట్లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.234 కోట్లు కేటాయించగా నిధులు విడుదల చేయక పనులు ముందుకు సాగలేదు.
నీల్వాయి ప్రాజెక్టుకు రూ.13 కోట్లు, ర్యాలీ వాగు ప్రాజెక్టుకు రూ.కోటి, గొల్ల వాగు ప్రాజెక్టుకు రూ.86 లక్షలు కేటాయించింది. అటు కాళేశ్వరం బ్యాక్ వాటర్ కారణంగా ప్రతి ఏడాది మంచిర్యాల నీట మునుగుతున్న నేపథ్యంలో గతేడాది రూ.100 కోట్లు కేటాయించిన సర్కార్ ఈసారి కూడా అవే కేటాయింపులు చేసింది. ప్రాజెక్టులకు నిధులు రావడంతో కాల్వలు, ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించనుంది.