మహిళలకు సర్కారు దన్ను: మహిళా శక్తి పేరిట వ్యాపారాల్లో టాప్​ ప్రయారిటీ

మహిళలకు సర్కారు దన్ను: మహిళా శక్తి పేరిట వ్యాపారాల్లో టాప్​ ప్రయారిటీ
  •     ఇప్పటికే ఫ్రీ జర్నీ.. రూ. 500కే సిలిండర్​
  •     మహిళా సంఘాలకే యూనిఫామ్​ స్ట్రిచ్చింగ్​, బడుల బాగోగు బాధ్యతలు
  •     మొదలైన ‘మహిళా శక్తి’ క్యాంటిన్లు 

హైదరాబాద్, వెలుగు:  మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంపై రాష్ట్ర సర్కారు ఫోకస్​ పెట్టింది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెస్తున్న స్కీముల్లో ఎక్కువ శాతం  మహిళలే లబ్ధిదారులుగా ఉంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో  ఫ్రీ జర్నీ, రూ. 500కే సిలిండర్​, మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బీమా సదుపాయం, సోలార్ పవర్ యూనిట్లు, మహిళా శక్తి క్యాంటిన్లు వంటివి ఇందులో ఉన్నాయి. త్వరలోనే మహిళా సంఘాల వస్తువుల అమ్మకానికి హైదరాబాద్ లో స్టాల్స్​ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 64 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉండగా ఈ సంఖ్యను ఒక కోటికి పెంచాలని, మహిళలకు అవగాహన కార్యక్రమాలు కల్పించి సంఘాల్లో చేరేలా చొరవ చూపాలని రూరల్ డెవలప్ మెంట్, సెర్ఫ్, స్ర్తీనిధి అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. 

53 కోట్ల ఫ్రీ టికెట్లు

గత ఏడాది డిసెంబర్ 7న సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం అనంతరం 48 గంటల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలోని ‘‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ’’ మహాలక్ష్మి స్కీమ్​ను ప్రారంభించారు. అప్పటి నుంచి శనివారం వరకు 53 కోట్ల ఫ్రీ జర్నీ టికెట్లు జారీ చేశారు.  బస్సుల్లో ఉచిత ప్రయాణాల వల్ల మహిళలకు రూ. 1,900 కోట్లు ఆదా అయ్యాయని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. 7 నెలల నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ శాతం సుమారు 110 శాతం నమోదవుతున్నది. స్కీమ్ స్టార్ట్ అయ్యాక బస్సుల్లో రద్దీ అనూహ్యంగా పెరగటంతో కొత్తగా ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులను కూడా ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. 

సర్కారు బడుల బాగోగు బాధ్యతలు!

గతంలో ‘మన ఊరు మన బడి’ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను వేల కోట్లతో రెనోవేషన్ చేయాలని గత సర్కారు నిర్ణయించి టెండర్లు కూడా పిలిచింది. అయితే ఈ కార్యక్రమం ముందుకు సాగలేదు. అయితే.. గత డిసెంబర్​లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వ  బడుల రెనోవేషన్ పనులను మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసింది.   బడుల బాగోగులు, బాధ్యతలను అమ్మ కమిటీలకు అప్పగించటం ద్వారా ఈ విద్యా సంవత్సరంలో ఆశించిన స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 26,823 ప్రభుత్వ పాఠశాలల్లో 20,680 చోట్ల ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేశారు. 17,729 పాఠశాలల్లో అవసరమైన పనులన్నీ ఈ కమిటీలకు అప్పగించారు.

సక్సెస్ ఫుల్ గా స్కూల్ యూనిఫాంల స్ట్రిచ్చింగ్

మహిళా సంఘాలకు స్కూల్​ యూనిఫామ్​ స్ట్రిచ్చింగ్​ బాధ్యతలను కూడా ప్రభుత్వం అప్పగించింది. ఒక్కో స్టూడెంట్ కు ఒక్కో జత కుట్టేలా 15 లక్షలకు పైగా యూనిఫామ్​ ఆర్డర్లను ఇచ్చింది. ఈ పనిని మహిళా సంఘాలు సక్సెస్​ ఫుల్​గా పూర్తి చేశాయి. మొదట ఈ బాధ్యతలు అప్పగించినప్పుడు ఒక్కో జత రూ. 50 చెల్లించగా తర్వాత దీనిని రూ. 75కి ప్రభుత్వం పెంచింది. 

వ్యాపారాల్లో ‘మహిళా శక్తి’

రాష్ట్రంలో ఉన్న సుమారు 64 లక్షల మంది స్వయం సహాయక బృందాల సభ్యులకు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ‘మహిళా శక్తి’ స్కీమ్ ను తీసుకొచ్చింది. రాష్ట్రంలో 1,050 మీ సేవా కేంద్రాలు, ఆధార్ కేంద్రాల అవసరం ఉందని ప్రభుత్వానికి అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. వీటిని మహిళా సంఘాలకు ఇవ్వాలని సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయించి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. మహిళలతో చిన్న పరిశ్రమలు, వ్యాపారాలను ఏర్పాటు చేయించడం.. వారి ఆర్థిక స్వావలంబనకు సహకరించటం.. సామాజిక భద్రత కోణంలో మహిళా సంఘాలను బలోపేతం చేయటం ‘మహిళా శక్తి’ ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి.

మహిళల ఆధ్వర్యంలో సాగే చిన్న పరిశ్రమలు, వ్యాపారాలకు రూ. 25 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటితో పాటు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు ఇవ్వనుంది. మహిళా సంఘాలు తయారు చేసే వస్తువులను అమెజాన్,  ఫ్లిప్ కార్ట్ , బిగ్ బాస్కెట్ లాంటి ఈ కామర్స్ లో అందుబాటులో ఉంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పౌల్ట్రీ, డెయిరీ, ఫిషరీస్​ రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించాలని భావిస్తున్నది. ఇటీవల ‘మహిళా శక్తి’ పేరుతో సెక్రటేరియెట్​లో రెండు క్యాంటిన్లను మంత్రి సీతక్క లాంచ్​ చేశారు. ఈ ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటిన్లను ప్రభుత్వ ఆఫీసులు, కలెక్టరేట్లు, నేషనల్​ హైవేస్, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటిని మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

మహిళా సంఘాలకు శిల్పారామంలో స్టాల్స్

మహిళ సంఘాలు తయారు చేసే వస్తువులకు హైదరాబాద్ లో సరైనా స్టాల్స్ లేకపోవటంతో.. పబ్లిక్ కు కొనాలని ఆసక్తి ఉన్నా అవి ఎక్కడ దొరుకతాయన్న సమాచారం లభించటం లేదు. ఈ నేపథ్యంలో మహిళ సంఘాలకు శిల్పారామంలో స్టాల్స్ కేటాయించాలని సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇటీవల ఆయన శిల్పారామాన్ని పరిశీలించారు. 

ఇందులో 117 స్టాల్స్ ఖాళీగా ఉన్నాయని సీఎంకు అధికారులు తెలిపారు. వీటిని మహిళా సంఘాలకు కేటాయించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం వీటి రెనోవేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల చివరి కల్లా లేదా వచ్చే నెల మొదటి వారంలో ఇక్కడ మహిళా సంఘాల స్టాల్స్ స్టార్ట్ కానున్నాయి. సెలవు రోజులు, వీకెండ్ లో శిల్పారామానికి హైదరాబాద్​తోపాటు వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం, టూరిస్టులు వస్తుంటారు. దీంతో మహిళా సంఘాల ఉత్పత్తులకు సేల్స్​ పెరుగుతాయని ప్రభుత్వం భావించి.. స్టాల్స్​ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తర్వాత దశలవారీగా హైదరాబాద్​లో అన్ని ముఖ్య కేంద్రాల్లోనూ  మహిళా సంఘాల స్టాల్స్  ఏర్పాటు చేయాలని భావిస్తున్నది.