బనకచర్లపై ఎందుకంత సీక్రెట్!.. మీకు ముందే తెలిసినా మాకెందుకు చెప్పలేదు?

బనకచర్లపై ఎందుకంత సీక్రెట్!.. మీకు ముందే తెలిసినా మాకెందుకు చెప్పలేదు?
  • జీఆర్​ఎంబీపై తెలంగాణ ఆగ్రహం 
  • కేంద్ర జలశక్తి శాఖ నోటీసులు ఇచ్చినా చెప్పరా? అని ఫైర్​
  • అన్ని వివరాలు చెప్పాల్సిన అవసరం లేదన్న బోర్డు మెంబర్ సెక్రటరీ అళగేషన్
  • ఆయనకు వంతపాడిన ఏపీ ఆఫీసర్లు..  కౌంటర్ ఇచ్చిన తెలంగాణ
  • జీబీ లింక్ ప్రాజెక్ట్​పై సమగ్ర పవర్​పాయింట్ ​ప్రజెంటేషన్​
  • పెద్దవాగు తప్ప గోదావరిపై ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టునూ బోర్డుకిచ్చేది లేదన్న తెలంగాణ

హైదరాబాద్, వెలుగు: గోదావరి-–బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టు గురించి గోదావరి రివర్ మేనేజ్​మెంట్​బోర్డు (జీఆర్ ఎంబీ)కు ముందే తెలిసినా ఎందుకు సీక్రెట్​గా ఉంచారని తెలంగాణ అధికారులు మండిపడ్డారు. ఏపీ ఆ వివరాలను బోర్డుకు ఇచ్చినా.. ఆ డిటెయిల్స్​​పంపాలని 2024 నవంబర్ లోనే కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించినా.. కనీసం ఆ సమాచారాన్ని తమకు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు గురించి తెలిసినా ఎందుకు దాచిపెట్టారని, దాని వెనుక ఉద్దేశాలేంటని బోర్డును తెలంగాణ అధికారులు నిలదీశారు.  సోమవారం జలసౌధలో జీఆర్ఎంబీ 17 వ బోర్డు మీటింగ్ నిర్వహించారు. బోర్డు మెంబర్ సెక్రటరీ అళగేషన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్​కుమార్ హాజరయ్యారు. ఏపీ నుంచి జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వర రావు, సీఈ సుధాకర్ పాల్గొన్నారు. జీబీ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ అధికారులు ఇటు బోర్డు, అటు ఏపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అక్రమ ప్రాజెక్టు తీరు తెన్నులపై సమగ్ర వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.


జీబీ లింక్ ప్రాజెక్ట్ కు సంబంధించి 5 నెలల క్రితమే బోర్డుకు కేంద్ర జలశక్తి శాఖ నోటీసులు ఇచ్చిందని తెలంగాణ అధికారులు గుర్తుచేశారు. తెలంగాణ, ఏపీ సీఎంలు కేంద్రానికి రాసిన లేఖలనూ బోర్డుకు ఇచ్చిందని, ఆ వివరాలను కనీసం తమకు చెప్పకుండా రహస్యంగా ఉంచిందని మండిపడ్డారు. ఆ ప్రాజెక్టుతో తెలంగాణపైపడే ప్రభావంపై వివరాలు అందజేయలేదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై బోర్డు సభ్యకార్యదర్శి స్పందిస్తూ.. కేంద్రం, బోర్డుకు మధ్య జరిగే కమ్యూనికేషన్స్​ను  రాష్ట్రాలకు చెప్పాల్సిన అవసరం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఆయన తీరుపై తెలంగాణ  అధికారులు తీవ్రంగా స్పందించారు. రెండు రాష్ట్రాల సభ్యులతో ఏర్పడిన బోర్డులో అత్యంత ప్రధానమైన విషయాన్ని సభ్యుల దృష్టికి తేవాల్సిన బాధ్యత బోర్డుకు లేదా? అని నిలదీశారు. కాగా,  ఏపీ అధికారులు బోర్డుకు వంతపాడారు. ఇలాంటి వివరాలను రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. గోదావరి ట్రిబ్యునల్ అనుమతులకు విరుద్ధంగా, పోలవరం ప్రాజెక్టు విస్తరణలో భాగంగా బనకచర్ల పనులు చేపడుతుండడం ఎట్టిపరిస్థితుల్లోనూ తమకు ఆమోదయోగ్యం కాదని తెలంగాణ అధికారులు తేల్చి చెప్పారు.

డీపీఆర్ ఇవ్వాలని ఏపీకి బోర్డు ఆదేశం

జీబీ లింక్  ప్రాజెక్టుకు డిటెయిల్డ్​ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ఇంతవరకు ఏపీ సమర్పించకపోవడంతో.. వెంటనే ఇవ్వాలని ఏపీని బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన్ ఆదేశించారు. దానిపై బోర్డు పూర్తి అధ్యయనం చేసిన తర్వాతే ముందుకెళ్లాలని సూచించారు. కాగా, ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉందని ఏపీ తెలిపింది.   ఏపీ తీరుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. చేసేవన్నీ చేస్తూనే ఏమీ చేయనట్టుగా ఏపీ వ్యవహరిస్తున్నదని ఆక్షేపించింది. ఇటీవల కేబినెట్ లోనూ ప్రాజెక్ట్ కి క్లియర్ చేశారని, 2 నెలల్లో టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించింది.  ప్రాజెక్టుకు నిధుల కోసం ‘అమరావతి జలహారతి కార్పొరేషన్’ పేరుతో ఏపీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదని పేర్కొన్నది. ఈ ప్రాజెక్టును ఆదిలోనే అడ్డుకోవాలని, ఏపీ ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే తెలంగాణ నీటి ప్రయోజనాలకు భంగం కలుగుతుందని,  ఏపీ జల దోపిడీ మరింత పెరుగుతుందని తెలంగాణ వివరించింది. 

జీబీ లింక్ తో తెలంగాణ మునుగుతది..

ఏపీ ఇప్పటికే  చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు తో తెలంగాణలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయని, దీనికి ఇప్పుడు జీబీ లింక్ తోడైతే గేట్ ఆపరేషన్ షెడ్యూల్స్ లో మార్పులు జరిగి ముంపు మరింత పెరుగుతుందని తెలంగాణ ఆందోళన వ్యక్తంచేసింది. 2016 లోనే పల్నాడు డ్రాట్ ప్రాజెక్ట్ ను ఏపీ ప్రతిపాదిస్తే.. తెలంగాణ వ్యతిరేకించడంతో 2018 లో ఆ ప్రాజెక్టును వెనక్కి తీసుకుందని గుర్తు చేసింది. ఇప్పుడు మళ్లీ జీబీ లింక్ పేరుతో ప్రాజెక్టు చేపట్టిందని పేర్కొంది. జీడబ్ల్యూడీటీ అవార్డు ప్రకారం.. పోలవరం రెండు ప్రధాన కాల్వల ద్వారా రోజుకు ఒక్కో టీఎంసీ (10,000 క్యూసెక్కుల) నీటినే తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కానీ, ఏపీ దానిని రోజుకు 17,500 క్యూసెక్కుల కెపాసిటీకి పెంచుతున్నదని బోర్డు దృష్టికి తెచ్చింది. టన్నెల్స్ ద్వారా మరో టీఎంసీ కలిపి రోజూ 3 టీఎంసీలను తరలించే కుట్ర చేస్తున్నదని, ఇప్పుడు జీబీ లింక్ తో అదనంగా మాతో రెండు టీఎంసీలనూ ఔట్​సైడ్​ బేసిన్ కి తరలించే కుట్రకి పాల్పడుతున్నదని ఆక్షేపించింది. అందుకు అనుగుణంగా కాల్వల సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచేందుకు కుట్రలు చేస్తున్నదని మండిపడింది. 

అళగేషన్ పై ఫిర్యాదు.. 

బోర్డు మెంబర్ సెక్రటరీ అళగేషన్ పై బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన్ కు తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. ఉద్యోగులను వేధిస్తున్నారని చెప్పారు. ఆయన వ్యవహారశైలి, ఉద్యోగులపై వేధింపుల విషయంలో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ కూడా ఫిర్యాదు చేయడంతో ఆయనపై విచారణకు కమిటీని వేశారు. విచారణకు రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సీఈలు, కేఆర్ఎంబీ నుంచి ఒక సభ్యుడితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

ప్రాజెక్టులు ఇచ్చేది లేదు..

గెజిట్ ప్రకారం రెండు రాష్ట్రాలు అన్ని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించాలని చైర్మన్ ఏకే ప్రధాన్ సూచించారు. అందుకు తెలంగాణ ససేమిరా అంది. ఉమ్మడి ప్రాజెక్టు అయిన ఒక్క పెద్దవాగు తప్ప.. ఏ ప్రాజెక్టును కూడా బోర్డుకు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తెలంగాణ ఇస్తే.. తాము ఇచ్చేందుకు సిద్ధమని ఏపీ పేర్కొన్నది. ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు శాశ్వత ఆధునికీకరణకు 92.5 కోట్లు అవసరమని, ప్రస్తుత మరమ్మతులకు రూ.15 కోట్లు కేటాయించాలని బోర్డును కోరింది. తెలంగాణ పరిధిలో 11 ప్రాజెక్టుల డీపీఆర్ లు, ఏపీలో నాలుగు ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇవ్వాలని బోర్డు కోరగా.. మొత్తం ఇచ్చామని తెలంగాణ చెప్పింది. డీపీఆర్​లు రూపొందిస్తున్నామని ఏపీ అన్నది. కాగా.. పెద్దవాగు ప్రాజెక్టులో కరకట్ట కొట్టుకుపోగా.. ఐదు గేట్లను ఏర్పాటు చేసేందుకు ఏపీ సుముఖత వ్యక్తం చేసింది. 

పోలవరం డెడ్ స్టోరేజీ నుంచీ దోపిడీ..

పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచీ నీటి దోపిడీకి ఏపీ కుట్ర చేస్తున్నదని తెలంగాణ ఆరోపించింది. వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలకు తాగునీటి సరఫరా కోసం ప్రాజెక్టు డెడ్​స్టోరేజీ నుంచి 18 టీఎంసీల జలాలను తరలించేందుకు రూ.910  కోట్లతో అక్రమ లిఫ్ట్ స్కీమ్​కు 2021 లో ప్రతిపాదనలు సిద్ధం చేసిందని పేర్కొంది. కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీలు.. ప్రాజెక్ట్ ని ఆపాలంటూ ఆదేశాలిచ్చాయని గుర్తు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ ను చేపట్టకుండా చూడాలని బోర్డును కోరింది.