పంచాయతీరాజ్ రిజర్వేషన్ల పెంపుతో.. బీసీలకు రాజ్యాంగ అధికారం

పంచాయతీరాజ్ రిజర్వేషన్ల పెంపుతో.. బీసీలకు రాజ్యాంగ అధికారం

పంచాయతీరాజ్ ఎన్నికలు జూన్​లో జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం  ప్రకటించడంతో  బీసీ రిజర్వేషన్లు సర్వత్రా చర్చనీయాంశమైంది. 2019లో  కేసీఆర్  ప్రభుత్వం  పంచాయతీరాజ్ లో  బీసీ  రిజర్వేషన్లను  తగ్గించడం వలన బీసీ సంఘాలు రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. 2024 ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్  బీసీ రిజర్వేషన్లు 42 శాతంకు పెంచి ఎన్నికలు జరుపుతామని బీసీ డిక్లరేషన్ ద్వారా ప్రకటించింది . కానీ, రాష్ట్రంలో  కొన్ని మీడియా సంస్థలు బీసీ రిజర్వేషన్ల పెంపునకు విరుద్ధంగా ఒక బలమైన భావనను ప్రచారం చేస్తున్నాయి. 

పత్రికల పట్ల ఉన్న విశ్వాసంతో  అది  నిజమైందేమో అని అందరూ నమ్మే  అవకాశం ఉన్నది. ప్రధానంగా రిజర్వేషన్లను 50 శాతానికి మించడానికి  వీలు లేదని ఆ పత్రికలలో కథనాలు వస్తున్నాయి. రెండోది  కుల జనగణన జరిపి బీసీల రిజర్వేషన్లు పెంచడానికి  సుప్రీం కోర్టు  గైడ్​లైన్స్​ఒప్పుకోవటం లేదని ఈ ప్రచారంలో భాగంగా రాస్తున్నాయి. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే భావన వాస్తవానికి విరుద్ధంగా ఉంది. కేంద్రంలో బీజేపీ  ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను 50 శాతం సీలింగ్​ బ్రేక్ చేస్తూ 10 శాతం కొత్తగా చేర్చడమైంది. దీంతో 50% సీలింగ్ అనేది నిజం కాదని తెలుస్తోంది. 

జాతీయస్థాయిలో 60శాతం రిజర్వేషన్లు

ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్ల ద్వారా రిజర్వేషన్  సీలింగ్​ను  బ్రేక్ చేయడం న్యాయ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దాంతో జాతీయస్థాయిలో రిజర్వేషన్లు 60 శాతంగా అమల్లోకి వచ్చినయ్.  బిహార్ ప్రభుత్వం 2023లో కులగణన జరిపి ఓబీసీ,  ఎంబీసీ,  ఎస్సీ,  ఎస్టీ  రిజర్వేషన్లను  50%  సీలింగ్​ను తొలగిస్తూ 65 శాతానికి పెంచారు. 10 శాతం ఈడబ్ల్యూఎస్​తో  కలిపి బిహార్లో  75% రిజర్వేషన్లు  అమలు చేస్తున్నారు.  దీని ద్వారా ఈ మధ్యనే  రెండు లక్షల పైగా టీచర్ ఉద్యోగాలను కూడా భర్తీ చేశారు.  దీనికి విరుద్ధంగా, ఎదిగిన సామాజిక వర్గ ప్రతినిధులు సుప్రీంకోర్టులో  కేసు వేసినప్పటికీ వారికి స్టే దొరకలేదు. అదేవిధంగా పలు రాష్ట్రాల్లో సీలింగ్​ను​ అధిగమిస్తూ రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి.  తమిళనాడులో  రిజర్వేషన్లను 69% వరకు  కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్నాయి.    

బీసీ రిజర్వేషన్లను తగ్గించిన బీఆర్ఎస్​

సుప్రీంకోర్టు గైడ్​లైన్స్ ముందుకు తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం సరైనది కాదు. సుప్రీంకోర్టు చేసిన అబ్జర్వేషన్స్ వేరే రాష్ర్టానికి సంబంధించిన విషయం. తెలంగాణ రాష్ట్రం పట్ల సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. అయినప్పటికీ,  బీఆర్ఎస్  ప్రభుత్వం కుట్రపూరితంగా 2018 డిసెంబర్ ఎన్నికలు వెలువడే ఒక రోజు ముందు 34% ఉన్న బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గిస్తూ  ప్రకటించింది. వెనుకబడిన తరగతులు ఎన్నికల ఫలితాలపై దృష్టి సారించి ఉంచడంతో  బీఆర్ఎస్ నాయకత్వంలోని  ప్రభుత్వ  ప్రకటన గమనించలేకపోయారు.  22 శాతంగా  ప్రకటించినప్పటికీ  రాష్ట్ర మొత్తం జనాభాను కలిపి చూస్తే బీఆర్ఎస్ ఇచ్చింది 18 శాతం మాత్రమే.  దాదాపు బీసీల రిజర్వేషన్లను సగం తగ్గించేశారు. ఇది బీసీల రాజ్యాధికార ఆకాంక్ష పట్ల  బీఆర్ఎస్  చేసిన  విద్రోహం. ఎన్నికల ఫలితాలు రాగానే సర్పంచ్,  ఎంపీటీసీ,  జడ్పీటీసీ, జిల్లా పరిషత్​ల్లో  బీసీలను రాజకీయంగా వెనుకకు నెట్టేయడం జరిగింది.  చివరికి 2024లో  కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ లో  బీసీల రిజర్వేషన్లను కులగణన చేసి 42 శాతానికి పెంచుతామనడంతో  బీఆర్ఎస్ ను  బీసీలు  తిరస్కరించారు.

బీసీల ఉన్నతిని అడ్డుకుంటున్న బీజేపీ

జాతీయస్థాయిలో ఈడబ్ల్యూఎస్​లో  ఆర్థికంగా వెనుకబడిన ఓబీసీ,  ఎస్సీ,  ఎస్టీలకు రిజర్వేషన్  అర్హత లేకుండా చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా?  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.వి. లలిత్​తో పాటు మరో న్యాయమూర్తి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలో ఉన్న పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ లో అర్హత కల్పించాలని మెజారిటీకి వ్యతిరేకంగా తీర్పులో చెప్పడం జరిగింది. కానీ, దానిపట్ల బీజేపీ ప్రభుత్వం ఏనాడు స్పందించలేదు. బీజేపీ ప్రతిసారి బీసీ రిజర్వేషన్లను బీసీల ఐడెంటిటీని అడ్డుకుంటూ వస్తున్న పార్టీ. హిందూత్వం ముసుగులో బీసీల ఉనికిని,  ఉన్నతిని బీజేపీ అడ్డుకుంటున్నది.

ప్రొఫెసర్  సింహాద్రి సోమనబోయిన, రాష్ట్ర అధ్యక్షుడు, సమాజ్ వాది పార్టీ