బీసీ రిజర్వేషన్లపై సమగ్ర రిపోర్ట్​ అందిస్తాం

 బీసీ రిజర్వేషన్లపై సమగ్ర రిపోర్ట్​ అందిస్తాం
  • డెడికేటెడ్​  కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్ రావు
  • ఉమ్మడి వరంగల్ బహిరంగ విచారణలో 105 అభ్యర్థనల స్వీకరణ

హనుమకొండ సిటీ, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై వివిధ సంఘాలు, రాజకీయ ప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వానికి సమగ్ర రిపోర్ట్​ అందిస్తామని బీసీ డెడికేటెడ్​ కమిషన్​ చైర్మన్​ బూసాని వెంకటేశ్వరరావు తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్​ కాన్ఫరెన్స్​ హాలులో బీసీ రిజర్వేషన్ల గుర్తింపు అంశంపై గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు  చెందిన కుల సంఘాలు, బీసీ సంఘాల ప్రతినిధులతో బహిరంగ విచారణ చేపట్టారు. కమిషన్​ చైర్మన్​  బూసాని వెంకటేశ్వరరావు, కార్యదర్శి  బి.సైదులు వివిధ ప్రతినిధులు అందజేసిన 105 అభ్యర్థనలను స్వీకరించారు. 

అనంతరం కమిషన్​ చైర్మన్​ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వివిధ కుల సంఘాల ప్రతినిధులు తమ కులాలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని కోరారన్నారు. రిజర్వేషన్లు పెరిగితే రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం కూడా పెరుగుతుందని విన్నవించారన్నారు.  కాగా విద్య, ఉద్యోగ రాజకీయ అవకాశాల్లో తమకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదని, రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ కోరారు. జనాభా దామాషా ప్రకారం బీసీ కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని  బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి  జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బీసీ సంఘం నాయకుడు తిరునహరి శేషు కోరారు. 

వడ్డెర సంఘం నాయకుడు సమ్మయ్య మాట్లాడుతూ బీసీల్లో కొన్ని కులాలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయిందని, రిజర్వేషన్లు పెంచేందుకు చొరవ చూపాలని కోరారు. దీంతో అభ్యర్థనలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిషన్​ చైర్మన్ స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో హనుమకొండ  అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ హనుమకొండ డిప్యూటీ డైరెక్టర్ జి.రాంరెడ్డి, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల బీసీ సంక్షేమాధికారులు పుష్పలత, నరసింహాస్వామి, రవిందర్ రెడ్డి, శైలజ, రవిందర్ పాల్గొన్నారు.