- వైస్ చైర్మన్గా ఇటిక్యాల పురుషోత్తం
- ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
- ఆర్జీయూకేటీ ఇన్చార్జ్ వీసీగాగోవర్ధన్..మహిళా వర్సిటీకి సూర్య ధనుంజయ్
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) చైర్మన్గా ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి నియమితులయ్యారు. కౌన్సిల్ వైస్ చైర్మన్– 1గా రిటైర్డ్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తంను నియమించారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవోలు 33, 34 రిలీజ్ చేశారు. వీరు మూడేండ్లు బాధ్యతల్లో కొనసాగనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరి నియామకాలు తక్షణం అమల్లోకి వస్తాయని జీవోలో తెలిపారు. ప్రస్తుతం కౌన్సిల్ చైర్మన్గా కొనసాగుతున్న ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ ప్రభుత్వం మారగానే వారి పదవులకు రాజీనామా చేయగా, వాటికి ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. కౌన్సిల్లో వారు సుమారు ఏడేండ్లుగా (2017 ఆగస్టు నుంచి) కొనసాగుతున్నారు.
వెంకటరమణ బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జ్ వీసీగా రెండేండ్ల నుంచి కొనసాగుతుండగా.. ఆ బాధ్యత నుంచి ఆయన్ను తప్పించారు. బాలకిష్టారెడ్డి గురువారం మధ్యాహ్నం చైర్మన్గా బాధ్యతలు తీసుకోనున్నారు. పురుషోత్తం నేడో, రేపో వైస్ చైర్మన్గా జాయిన్ కానున్నారు. మరోపక్క కౌన్సిల్ వైస్ చైర్మన్–2 గా మహమూద్ కొనసాగుతుండగా, ఆయన్నూ సర్కారు రాజీనామా చేయిస్తుందనే చర్చ మొదలైంది.
రెండు వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలు..
ఆర్జీయూకేటీ (బాసర ట్రిపుల్ ఐటీ) ఇన్చార్జ్ వీసీగా ప్రొఫెసర్ గోవర్ధన్ నియమితులయ్యారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ ఇన్చార్జ్ వీసీగా ప్రొఫెసర్ ధనావత్ సూర్య ధనుంజయ్ ని ప్రభుత్వం నియమించింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు వారు ఆయా బాధ్యతల్లో కొనసాగుతారని సర్కారు ప్రకటించింది. మరోపక్క విద్యాశాఖ పరిధిలోని మరో పది వర్సిటీలకూ వీసీలను నియమించేందుకు ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే 8 వర్సిటీల సెర్చ్ కమిటీ సమావేశాలు జరగ్గా.. 2 వర్సిటీల సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వర్సిటీలకు కొత్త వీసీలను ప్రకటించనున్నట్టు వారు చెప్తున్నారు.
ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి
ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డిది నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం పర్వతాయపల్లి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయన ప్రస్తుతం మహింద్రా వర్సిటీలో లా డీన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన గతంలో నల్సార్ లా వర్సిటీలో వైస్ చాన్స్ లర్గా, రిజిస్ట్రార్ గా బాధ్యతలు నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం, ఢిల్లీ జేఎన్యూలో ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. టీచింగ్, రీసెర్చ్ లో 20 ఏండ్ల అనుభవం ఉంది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నారు.
ప్రొఫెసర్ పురుషోత్తం
ప్రొఫెసర్ పురుషోత్తంది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామం. ఎస్సీ సామాజిక సామాజిక వర్గానికి చెందిన ఆయన ఇటీవలే ప్రొఫెసర్ గా ఓయూలో రిటైర్డ్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఆయన.. ప్రస్తుతం టీజేఏసీ చైర్మన్గా కొనసాగుతున్నారు. నారాయణ గూడలోని డిగ్రీ భవన్స్ న్యూసైన్స్ కాలేజీలో డిగ్రీ, నిజాం కాలేజీలో పీజీ (ఎకనామిక్స్) పూర్తిచేశారు. కొంతకాలం ఆర్టీసీలో పని చేసి.. ఆ తర్వాత ఓయూలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పనిచేశారు. నిజాం కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గానూ విధులు నిర్వహించారు.