22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలు... ఒక్కొక్క బిల్డింగ్​కు రూ.5 కోట్లు

  • 22 సమాఖ్య భవనాలకు మొత్తం రూ.110 కోట్లు అంచనా
  • పరిపాలనా అనుమతులు జారీ 
  • హనుమకొండ విజయోత్సవ సభలో భవన నిర్మాణాలకు శంకుస్థాపన

హైదరాబాద్, వెలుగు: మహిళా సంఘాల బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతున్నది. ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యుల సమావేశాలు, శిక్షణ కోసం జిల్లా కేంద్రాల్లో జిల్లా సమాఖ్యలకు భవనాలు నిర్మించాలని సంకల్పించింది. రాష్ట్రంలో 22 జిల్లాల్లోని జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు (జిల్లా సమాఖ్య భవనాలు) నిర్మించాలని నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు పాత 10 జిల్లా కేంద్రాల్లో స‌‌మాఖ్యలకు సొంత భ‌‌వనాలున్నాయి.

22 జిల్లాల్లో భవనాల లేకపోవడంతో మంత్రి సీతక్క మిగిలిన జిల్లాల్లో కూడా జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం కోసం  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా.. ఆర్థికశాఖ, సీఎంవో నుంచి అనుమ‌‌తులు లభించాయి. దీంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్​కుమార్ 22 జిల్లా కేంద్రాల్లో ఇందిరా మ‌‌హిళా శ‌‌క్తి భ‌‌వ‌‌నాల నిర్మాణానికి ప‌‌రిపాల‌‌నా అనుమ‌‌తులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 22 భవనాలకు మొత్తం రూ.110 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ నెల 19న హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగే ప్రజాపాలన విజయోత్సవ స‌‌భ‌‌లో మహిళా శక్తి భవన నిర్మాణాల‌‌కు శంకుస్థాప‌‌న‌‌ చేయనున్నారు.

సంఘాలకు శిక్షణ, సమావేశాలు

జిల్లా సమాఖ్యలు ప్రతి నెలా కనీసం రెండు సార్లు సమావేశాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. భవనాలు లేకపోవడంతో వారు సమావేశాలు నిర్వహణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శిక్షణా కార్యక్రమాల కోసం ఫంక్షన్ హాల్స్, ప్రైవేట్ హాల్స్ పై ఆధారపడుతున్నారు. దీంతో మహిళలకు సమస్యలు ఎదురవుతున్నాయని భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందిరా మహిళా శక్తి భవనాలు అందుబాటులోకి వస్తే సమావేశాలు, శిక్షణలు, సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్, కామన్ వర్క్ షెడ్, ఉత్పత్తుల ప్రదర్శన, సరస్ మేళాలు, ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.

గ్రామాలు, పట్టణాల్లో స్వయం సహాయక సంఘాల్లో 63 లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారు. పొదుపు, బ్యాంకు లింకేజీ నుంచి జీవనోపాధి కార్యక్రమాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాల్లో జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణానికి ముందుకొచ్చింది. ఇప్పటికే స్థల సేకరణ ప్రక్రియ కూడా పూర్తి చేసింది. ఎకరం స్థలం అందుబాటులేని జిల్లాల్లో ఉన్న స్థలంలోనే భవనం నిర్మించేలా ఏర్పాట్లు చేస్తున్నది. బిల్డింగ్ ప్లానింగ్ పీఆర్ ఇంజినీరింగ్​శాఖ బిల్డింగ్​ప్లానింగ్ రూపొందిస్తున్నది.