- మెదక్‌కు మంజూరు చేసిన ప్రభుత్వం
- మహిళా సంఘాలకు తీరనున్న ఇబ్బందులు
మెదక్, వెలుగు: ప్రభుత్వం రాష్ట్రంలోని 22 జిల్లాలకు మహిళా శక్తి భవనాలు మంజూరు చేసింది. ఇందులో మెదక్ జిల్లాకు చోటు దక్కింది. మహిళా శక్తి భవనం కోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బందులు దూరం కానున్నాయి. జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 13,064 సెల్ఫ్హెల్ప్గ్రూపులు ఉన్నాయి. వాటిల్లో 1,37,757 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 517 విలేజ్ఆర్గనైనేషన్, 21 మండల సమాఖ్యలు, ఒక జిల్లా సమాఖ్య ఉన్నాయి.
ఎస్‌హెచ్‌జీల ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పన, ఆర్థిక స్వావలంభన కోసం ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, స్ర్తీనిధి ద్వారా పెద్ద మొత్తంలో రుణ సాయం అందజేస్తోంది. ప్రతి ఏటా వానకాలం, యాసంగి సీజన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ప్రభుత్వ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్‌కు ఉచితంగా అందజేసే స్కూల్యునిఫామ్స్కుట్టే బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటిన్ల నిర్వహణ బాధ్యతలు కూడా ఎస్‌హెచ్ జీలకు అప్పగించింది. విలేజ్ఆర్గనైజేషన్లు, మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలకు తరచూ సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి.
అయితే జిల్లా కేంద్రాల్లో ఇందుకు అనుగుణంగా భవన వసతి లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో కేవలం10 జిల్లా కేంద్రాల్లో మాత్రమే జిల్లా మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం మిగతా 22 జిల్లాలకు మహిళా శక్తి భవనాలు మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల19న హన్మకొండలో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
అన్ని హంగులతో..
జిల్లా మహిళా సమాఖ్య బిల్డింగ్‌ను అన్ని హంగులతో నిర్మించనున్నారు. జిల్లా సమాఖ్య ఆఫీస్నిర్వహణ, ట్రైనింగ్ సెంటర్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్మహిళలు తయారు చేసే వివిధ ఉత్పత్తుల మార్కెటింగ్, వర్క్షెడ్ల నిర్మాణం చేపడుతారు. దీంతో ఇంతకాలం సరైన వసతి సదుపాయాలు లేక మహిళా సంఘాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దూరం కానున్నాయి.
హర్షణీయం: కెనడీ, డీపీఎం
ప్రభుత్వం జిల్లాకు మహిళా శక్తి భవనం మంజూరు చేయడం హర్షణీయం. రూ.5 కోట్లతో అన్ని హంగులతో భవన నిర్మాణం జరుగనుంది. దీంతో జిల్లా సమాఖ్య ఆఫీస్‌తో పాటు, వీవోలు, ఎంఎస్‌లు, జడ్ఎస్ల మీటింగ్‌లు, ట్రైనింగ్ప్రోగ్రాంల నిర్వహణకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.