మరో ఎత్తిపోతలకు ముందడుగు

మరో ఎత్తిపోతలకు ముందడుగు
  •     ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ పనుల్లో కదలిక 
  •     హుజూర్  నగర్ నియోజకవర్గానికి మరో భారీలిఫ్ట్ 
  •     53 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణే లక్ష్యంగా రూపుదిద్దుకుంటున్న ఎత్తిపోతల 
  •     ఏడాదిన్నర క్రితమే గెజిట్ వచ్చినా ముందుకుసాగని పనులు
  •     మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి చొరవతో మొదలైన ఎంబీసీ లిఫ్ట్ పనుల సర్వే

సూర్యాపేట/మేళ్లచెర్వు, వెలుగు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో మరో భారీ ఎత్తిపోతల పథకానికి ముందడుగు పడింది. ఇప్పటికే మండలంలో కొత్తగా రెండు ఎత్తిపోతల పథకాలు ఫైనల్ అయ్యాయి. దొండపాడు, పాతవెల్లటూరు, నక్కగూడెం వద్ద ఉన్న పాత లిఫ్ట్ లతోపాటు కొత్తగా దొండపాడు-2, బుగ్గమాదారం లిఫ్ట్ లను నిర్మించేందుకు అధికారులు సర్వే పనులు చేపట్టారు.

ఈ రెండు లిఫ్ట్ లకు ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అనుమతులు పూర్తయి నిధులు కూడా మంజూరు అయ్యాయి. కొత్తగా ఎంబీసీ(ముక్త్యాల బ్రాంచ్ కెనాల్) లిఫ్ట్ పనుల్లో కదలిక వచ్చింది. ఏడాదిన్నర కింద గెజిట్ వచ్చినా పనులు ముందుకుసాగలేదు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి చొరవతో ఎంబీసీ లిఫ్ట్ పనుల సర్వే మొదలైంది. 

53 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. 

చింతలపాలెం మండలంలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో నిర్మించిన ఎత్తిపోతలతో ఇప్పటివరకు ఆ మండల రైతులకే ప్రయోజనం చేకూరింది. నియోజకవర్గంలోని మేళ్లచెరువు, హుజూర్నగర్, మఠంపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలకు సాగర్ ఎడమ కాల్వ నీరు అందకపోవడంతో ఎంబీసీ ద్వారా సాగునీరందించాలని కాంగ్రెస్​ ప్రభుత్వం సంకల్పించింది. 

దీంతో పాత వెల్లటూరు వద్ద 70 ఎకరాల్లో పంప్ హౌజ్ నిర్మించనున్నారు. పైప్ లైన్ కోసం రైతుల నుంచి మరో వంద ఎకరాల భూమి సమీకరించాల్సి ఉంది. అనుకున్నట్టుగా పనులు పూర్తయితే ఈ 3 మండలాలోని 53 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానున్నది. 

భూ సేకరణపై దృష్టి..

ఎత్తిపోతల పంప్ హౌజ్ నిర్మాణం, పైప్ లైన్, భూసేకరణ ఇతరత్రా అవసరాల కోసం గతేడాది ఫిబ్రవరిలో నాటి ప్రభుత్వం రూ.1450 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. 20 కిలో మీటర్ల మేర కృష్ణా జలాలను తరలించేందుకు పైప్ లైన్  వేయడానికి రైతుల నుంచి భూమి సేకరించాల్సి ఉంది. ఇందుకోసం ఏడాది క్రితమే పైప్ లైన్ ఏర్పాటుకు వ్యవసాయ భూముల వెంట ఆఫీసర్లు పెగ్ మార్కింగ్ చేశారు. ఇదంతా పట్టాభూమి కావడంతో ఆనాడు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం ఆ పనులను తాత్కాలికంగా నిలిపివేసింది.

రెండు రోజుల క్రితం కలెక్టర్ తేజస్​ నందలాల్ పవార్ ఎంబీసీ ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని పరిశీలించడంతో పనుల్లో మళ్లీ కదలిక వచ్చినట్లయింది. లెఫ్ట్ కెనాల్ సాగు కింద 1.10 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ ఇప్పటికే  జరుగుతుండగా సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న 53 వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి.