- లోయర్‌మానేరు, కడెం ప్రాజెక్టులు కూడా..
- గైడ్‌లైన్స్ సిద్ధం చేసిన అధికారులు, నేడు ప్రభుత్వానికి సమర్పణ
- ఆమోదం పొందాక టెండర్లు పిలిచే చాన్స్
హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్టుల్లో పూడికతీతపై ఇరిగేషన్ శాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాజెక్టుల్లోనూ పూడిక సమస్య ఎక్కువై నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో.. ఇటీవల రివ్యూలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలెట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీనీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే తొలుత గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులను పైలెట్‌గా ఎంచుకుని పూడిక తీయాలని నిర్ణయించినట్టు తెలిసింది. మిడ్‌మానేరు, లోయర్‌మానేరు, కడెం ప్రాజెక్టులను పూడికతీత కోసం పైలెట్‌గా ఎంచుకున్నట్టు అధికారులు చెప్తున్నారు.
పూడికను తీసే డ్రెడ్జింగ్ సంస్థల గురించి ఇరిగేషన్ శాఖ అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. గైడ్‌లైన్స్‌ను కూడా అధికారులు ప్రిపేర్ చేసినట్టు సమాచారం. ఎంత మట్టి తీయాలి.. తీసిన మట్టిని ఏం చేయాలి.. ఎక్కడ స్టోర్ చేయాలి వంటి వివరాలను పొందుపరిచినట్టు సమాచారం. వీటికి ఎంత ఖర్చవుతుందనే వివరాలను అందులో పేర్కొన్నట్టు తెలిసింది. ఆ గైడ్‌లైన్స్ ఆధారంగా ముసాయిదా టెండర్ ప్రతులను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ గైడ్‌లైన్స్‌తో పాటు ముసాయిదా టెండర్లను అధికారులు సోమవారం ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం వాటికి ఆమోదం తెలిపితే, ఆపై టెండర్ ప్రక్రియను మొదలుపెడతారని ఓ ఉన్నతాధికారి చెప్పారు.
కృష్ణా ప్రాజెక్టులపైనా నజర్
గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులతో పాటు కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టుల్లోని పూడికను తీసేందుకు అధికారులు నిర్ణయించారు. ముందుగా ఆ మూడు ప్రాజెక్టులకు వచ్చే రెస్పాన్స్ ఆధారంగానే ముందుకు పోవాలని అధికారులు భావిస్తున్నారు. అంతా సవ్యంగా జరిగి ఆ మూడు ప్రాజెక్టుల పూడికతీత పనులు మొదలైన 15 రోజులకు జూరాల ప్రాజెక్టులోని పూడికపైనా దృష్టిసారించనున్నట్టు అధికారులు చెప్తున్నారు.
దాంతోపాటు గోదావరి బేసిన్‌లోని మరో ప్రాజెక్ట్ సింగూరులోనూ పూడికతీసేందుకు యోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన గైడ్‌లైన్స్‌కు అనుగుణంగానే పూడికతీత పనులను కొనసాగిస్తామని అధికారులు చెబుతున్నారు.