యాదగిరిగుట్ట గోపురానికి బంగారు తాపడం..80కిలోల దాకా వినియోగించే చాన్స్

యాదగిరిగుట్ట గోపురానికి బంగారు తాపడం..80కిలోల దాకా వినియోగించే చాన్స్
  • దాతల విరాళాలతోపాటు దేవస్థానం నిధుల కేటాయింపు
  • బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యాదగిరిగుట్ట, భద్రాద్రి రామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధి, విస్తరణ దిశగా ప్రభుత్వం ముందుడుగు వేసింది. ఇందులో భాగంగా యాదాద్రి విమాన గోపురానికి బంగారు తాపడం పనులకు సీఎం రేవంత్​రెడ్డి గ్రీన్​సిగ్నల్  ఇచ్చారు. రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తి చేయాలని శుక్రవారం రాత్రి ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే భద్రాద్రి రామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు నిధులు కేటాయించడంతోపాటు భూసేకరణకు అనుమతులు మంజూరు చేస్తూ మరోసారి ఉత్తర్వులిచ్చారు. రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తి చేయాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. అయితే, సుమారు 60 నుంచి 80 కిలోల బంగారం.. తాపడం పనులకు అవసరమవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం. ఇందుకోసం అవసరమైన నిధులు, బంగారాన్ని  దాతల ద్వారా సేకరించారు.  ఇప్పటికే రూ.20 కోట్ల నిధులు, 10  కేజీల బంగారం  విరాళాల రూపంలో దేవాలయానికి సమకూరినట్లు తెలిసింది.  దీనికితోడు దేవస్థానం హుండీలో భక్తులు వేసిన బంగారం, వెండిని మింట్​కు పంపించి ప్యూర్​ గోల్డ్​గా మార్చనున్నారు. విమాన గోపురానికి సుమారు 10 వేలకు పైగా చదరపు అడుగుల మేర బంగారం తాపడం చేయాలని  ప్రాథమికంగా అంచనా వేశారు. 

ఈ తాపడం పనులు చేయడానికి మేకింగ్ చార్జీలు సుమారు రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్లు అవుతుందని  భావిస్తున్నారు. ప్రభుత్వం ఎం/ఎస్​స్మార్ట్ క్రియేషన్స్  కంపెనీకి బంగారు తాపడం పనుల బాధ్యతను అప్పగించింది. ఈ పనులను బ్రహ్మోత్సవాల నాటికి ముందే 2025 మార్చిలోపే పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సురేఖ ఆదేశాలిచ్చారు. కాగా.. ఇప్పటికే రాష్ట్రంలో 13 ఆలయాల్లో అభివృద్ధికి ప్రభుత్వం రూ.55.75 కోట్లు మంజూరు చేసింది.  ఆ పనులు చేపట్టేందుకు ఈ ప్రొక్యూర్​మెంట్​ ద్వారా  టెండర్లు కోరింది. కాగా.. రాజగోపురం బంగారం పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ  ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్ పర్సన్​గా ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్​ను ప్రభుత్వం నియమించింది.

Also Read:-కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు, లొకేషన్లు మారినయ్

భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.60.20 కోట్లు 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి సీతారామ చంద్రస్వామి దేవాలయ అభివృద్ధి, విస్తరణ పనుల నిమిత్తం భూసేకరణకు అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. రామాలయం అభివృద్ధికి అవసరమైన భూమిని సేకరించేందుకు ఇప్పటికే రూ.60.20 కోట్లను కేటాయించింది. దేవస్థానం అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఆలయం చుట్టూ ఉన్న కొంత భూమి అవసరం ఉంటుందని నిర్ధారించారు. దాదాపు 43 ఇండ్లు భూసేకరణ కింద తీసుకోవాల్సి ఉంటుంది.  ప్రాకారాల నిర్మాణానికి దాదాపు ఎకరం భూమి అవసరం ఉంటుందని అంచనా వేశారు.  అయితే, ఇండ్లను తీసుకునేందుకు పలు దఫాలుగా యజమానులతో ఎండోమెంట్​ కమిషనర్​, దేవస్థానం ఈవో, అడిషనల్​ కలెక్టర్, ఆర్డీవోలు చర్చలు జరిపారు. ఇంటి యజమానులతో విడివిడిగా ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడటంతోపాటు అందరూ యజమానులతో కలిపి పలుమార్లు చర్చించగా.. వారు పలు డిమాండ్లను ఎండోమెంట్  అధికారుల ముందు పెట్టారు. ఎట్టకేలకు ఇంటి యజమానులను ఒప్పించి భూసేకరణకు లైన్​క్లియర్​  చేశారు. తొలుత ప్రాకారాలు, మాఢవీధులు నిర్మించనున్నారు. తర్వాత దేవాదాయ శాఖ అనుమతించిన పనులు చేపట్టనున్నారు.