హైదరాబాద్: సెప్టెంబర్ 17న జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం విధించినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉన్న కారణంగా హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో రాజకీయ పార్టీల ర్యాలీలకు, నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని మంత్రి చెప్పారు. సెప్టెంబర్ 17 ఉదయం 6 నుంచి 18 సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు కూడా హైదరాబాద్ లో నిషేదిస్తున్నట్లు గురువారం నోటీసు జారీ చేశారు.
హిందూ, ముస్లింల పండుగలు ఏకకాలంలో జరుపుకుంటున్నందున ఎలాంటి రాజకీయాలు విద్వేశాలు రెచ్చగొడ్డవద్దని పొన్నం ప్రభాకర్ అన్నారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగలు సంతోషంగా, సామరస్యపూర్వకంగా జరుపుకునేందుకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.