బీసీ కులాల్లో అసమానతలు.. ప్రభుత్వ సాయంలో వివక్ష

హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో కలిసిన తరువాత నేటికి సైతం  మానవ సమాజంలో  మనుషులందరూ సమానమనే  భావన నిజంకాలేదు. సరికదా రాజ్యాంగం ద్వారా సైతం ఆచరణలోకి రాలేకపోయింది.  సమాజంలో వర్ణవ్యవస్థ, కులవ్యవస్థలు మనుషుల్లో హెచ్చు, తగ్గుల్ని సృష్టించాయి 970 లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే  ఉద్దేశంతో ఏర్పాటుచేయబడిన అనంతరామన్ కమిటీ నివేదిక మరింత తీవ్ర అసమానతలను పెంచింది. 

తొమ్మిదో షెడ్యూల్లోని ఆర్టికల్ 15 (4), 16 (4) ప్రకారం వెనకబడిన తరగతులలోని కులాలకు సమన్యాయం చేయడానికి ఆనాటి తెలంగాణ ప్రాంతంలో 60 కులాలు, ఆంధ్ర ప్రాంతంలో 86 కులాలు ఉండగా మంత్రివర్గ ఉప సంఘం 112 బీసీ కులాలు ఉన్నట్టుగా నిర్ధారించింది.  జి.ఓ. ఎం.ఎస్ నెంబర్ 870, తేదీ 12 ఏప్రిల్, 1968 లో ఏర్పాటు చేసిన బీసీ  కమిషన్ 20 జూన్, 1970 న రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. 

సమన్యాయం చేయడానికి బీసీ కులాలను నాలుగు గ్రూపులుగా విభజించి జనాభా దామాషాలో 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. గ్రూప్ ‘ఎ’ లో ఆదిమ తెగలు, విముక్త జాతులు, సంచార, అర్ధ సంచార జాతులను, గ్రూపు ‘బి’ లో వృత్తి కులాలను, గ్రూప్ ‘సి’ లో మతాంతికరణ చెందిన హరిజనులను, గ్రూప్ ‘డి’ లో ఇతర కులాలను ఉంచడం జరిగింది.

లక్ష సాయంలో వివక్ష

గ్రూపుల విభజన ప్రకారం వృత్తి కులాలన్నీ గ్రూపు ‘బి’ లో ఉండాలి.  నేడు తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్  వృత్తికులాల వారికి ఒక లక్షరూపాయలను ఆర్థికసహాయంగా ఇస్తామని అధికారికంగా విధివిధానాలు ప్రకటిస్తూ అర్హులైన వృత్తికులాలను ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. దీని ద్వారా వృత్తికులాలను నిర్దారించినట్లుగా తెలుస్తుంది.  

ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం ‘ఏ’ గ్రూప్ కి చెందిన నాయి బ్రాహ్మణ, రజక, పూసల, మేదరి, వడ్డెర, మిగిలిన ఇతర అన్ని బీసీ ‘ఏ’ కులాలను, ఒక్క బెస్తలు తప్ప, ‘బి’ గ్రూప్ కి చెందిన కుమ్మరి, అవుసలి,  కంసాలి, కంచరి, వడ్ల, కృష్ణ బలిజ కులాలను, ‘డి’ గ్రూపు లోని  ఉప్పర, ఆరెకటిక, మేర కులాలను అర్హులుగా ప్రకటించారు. 

గొల్ల కురుమలకు ఒక యూనిట్ కింద లక్షా 75 వేల విలువ  చేసే గొర్రెలను అందించడం, గౌడ లకు లిక్కర్ షాపులలో 15 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఫెడరేషన్ ద్వారా వారికి సహాయం చేయడం, పద్మశాలీలకు ఇతర విధాలుగా ఆర్థిక చేయూత అందించడం వలన వారిని లక్ష రూపాయల ఆర్థిక  సహాయంలో చేర్చకపోయి ఉండవచ్చు. కానీ ఎలాంటి ఆర్థిక సాయం, రిజర్వేషన్ అమలుకు నోచుకోని ముదిరాజ్ కులానికి తీవ్ర అన్యాయం చేయడాన్ని గమనించవచ్చు. ప్రభుత్వము ప్రకటించిన లబ్ది చేకూర్చే కులాలలో  బెస్త,  ముదిరాజులు లేరు.

తెలంగాణ బీసీలకే అన్యాయం

గ్రూపులలోని కులాల జనాభాను కూడా ఇష్టానుసారంగా పేర్కొనడం జరిగినది. అనంతరామన్  బీసీ కులాలను నాలుగు గ్రూపులుగా  ఏర్పాటు చేయుటకు తీసుకున్న అంశాలు సరి అయినవే అయినా గ్రూప్ లలోని కులాలు  ఉద్దేశించిన అంశాల ఆధారంగా కాకుండా  చిందరవందరగా గ్రూప్ లలో పొందుపరచడం జరిగింది. దీనికీ కారణం  ఆనాడు అనగా 1972 లో ఉన్న రాజకీయ పరిస్థితులు ముఖ్యంగా విద్యావంతులుగా ఉన్న కొందరు, రాజకీయ నాయకులు  గ్రూప్ ల లోని కులాలను మార్చి, గ్రూప్ ల వారి రిజర్వేషన్ల శాతంలో అసంబద్దత కలుగ చేశారు అనే  భావన కలుగుతుంది. 

ఇదే నేటి బీసీ కులాల జనాభాలో విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో పూర్తిగా అసమానతలను పెంచింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నివేదిక అమల్లోకి వచ్చిన 1972వ సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనంతరామన్ కమిటీ రిపోర్టు లోని కులాలను ఇప్పటివరకు 70 సార్లు జీ.ఓ ల ద్వారా, ఉత్తర్వుల ద్వారా గ్రూపుల పట్టికలో మార్పులు, చేర్పులు చేయబడ్డాయి. 

కేంద్ర ప్రభుత్వం 54 శాతం ఉన్న బీసీ జనాభాలో సగం అనగా 27% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉండగా అత్యంత వెనకబడిన  ప్రాంతమైన ఆనాటి హైదరాబాద్ స్టేట్ నేటి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కేవలం 24% రిజర్వేషన్లు మాత్రమే అమలు చేస్తుండడం  గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వం పోరాడి సాధించుకున్న తెలంగాణలో తీవ్రంగా అణిచి వేయబడిన కులాలను గుర్తించి వారికి న్యాయం చేయాలి.

గ్రూపులలో అసంబద్ధత

ఇపుడు వృత్తి కులాల వారు అన్ని గ్రూపులలో ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ లో లంబాడీలు, కైకడి, బోయ మొదలగు కులాలు ఎస్టీలుగా గుర్తింపబడ్డప్పటికీ, వారిని కమిటీ రిపోర్ట్ లో బీసీ ‘ఏ’ గ్రూప్ లో  ఉంచారు.  తర్వాత కాలంలో ఒక్క లంబాడాలను ఎస్టీలో చేర్చారు. నిజానికి నిజాం కాలంలో విద్యకు నోచుకోక నిరంకుశ పాలనలో మగ్గిన హైదరాబాద్ స్టేట్ భారతదేశంలోని అన్ని ప్రాంతాల కంటే కూడా విద్య, సామాజికపరంగా చాలా వెనకబడ్డ ప్రాంతం. అందుకే అనేక కులాలను చాలావరకు ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో చేర్చి ఉండాల్సింది.

 కానీ అలా జరగలేదు. ఆదిమ తెగ అయిన ముదిరాజులను ఎస్టీలో ఉంచడానికి బదులు మొదట బీసీ ఏ గా గుర్తించి తర్వాత విద్య పరంగా, సామాజికంగా, ఆర్థికంగానూ ఎదిగిన బీసీ కులాలు ఉన్న బీసీ డీ లో చేర్చారు. దాంతో వీరు గత 50 సంవత్సరాలుగా రిజర్వేషన్లు పొందలేక తీవ్రంగా అణచివేయబడి ఉన్నారు. వీరు నేటివరకు ప్రభుత్వ ఆర్థిక సహకారం పొందలేక పోతున్నారు అనేది ముమ్మాటికీ వాస్తవం.

- అల్లాదుర్గం సురేష్, సోషల్​ ఎనలిస్ట్​