
- ఫస్ట్ క్వార్టర్ లో రూ.15 వేల కోట్ల లోన్ కోసం ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి మంగళవారం రూ.2 వేల కోట్లను ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకుంది. మొదటి క్వార్టర్ (ఏప్రిల్–-జూన్) లో దాదాపు రూ.14 వేల కోట్ల అప్పు తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇండికేటివ్ క్యాలెండర్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2025–26 బడ్జెట్‌లో రాష్ట్రం మొత్తం రూ.69,639 కోట్ల అప్పు తీసుకోనున్నట్లు అంచనా వేశారు.
ఈ లెక్కన సగటున ప్రతి నెలా రూ.5,800 కోట్లు అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు అనుమతి ఇస్తుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. తక్కువ మొత్తనికే అనుమతి వస్తే ప్రతినెలా నాలుగు నుంచి 5 వేల కోట్ల రూపాయాల మేర తీసుకోవాల్సి వస్తుంది. రాష్ట్రానికి ప్రతి నెలా రూ.25– 30 వేల కోట్లు అవసరం కాగా, కేవలం రూ.18 నుంచి 20 వేల కోట్ల ఆదాయం వస్తున్నది.
ఈ లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వానికి అప్పు చేయకతప్పడం లేదు. ఆదాయానికి ఖర్చుకు మధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్ను, ఓవర్ డ్రాప్ట్‌ను వాడుకుంటోంది. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రూ.36,200 కోట్లు, జనవరి నుంచి మార్చి వరకు రూ.30 వేల కోట్లు ఓవర్‌డ్రాఫ్ట్, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌ల ద్వారా సమీకరించింది.