ధరణిలో ఇక ప్రతి అప్లికేషన్ తహసీల్దార్ వద్దకే

ధరణిలో ఇక ప్రతి అప్లికేషన్ తహసీల్దార్ వద్దకే
  •    అక్కడి నుంచే ఆర్డీఓలు, కలెక్టర్ల లాగిన్​లోకి
  •     అప్లికేషన్ మాడ్యూల్​లో మార్పులు చేసిన సర్కార్
  •     దరఖాస్తుతోపాటే ఫార్వార్డ్ కానున్న తహసీల్దార్ల రిపోర్టులు
  •     అప్లికేషన్ల పరిష్కారంలో కీలక ముందడుగు
  •     అక్కడి నుంచే ఆర్డీవోలు,కలెక్టర్ల లాగిన్​లోకి

కరీంనగర్​, వెలుగు: వివిధ భూసమస్యలపై ధరణి ద్వారా పెట్టుకునే ప్రతి దరఖాస్తు ఇక మీదట సంబంధిత మండల తహసీల్దార్లకే చేరనుంది. అక్కడి నుంచే ఆర్డీఓలు, అడిషనల్ కలెక్టర్లు(రెవెన్యూ), జిల్లా కలెక్టర్ల లాగిన్ లోకి దరఖాస్తులు ఫార్వర్డ్ కానున్నాయి. ఈ విధానం గురువారం నుంచే అమల్లోకి వచ్చింది. 

ఇప్పటి వరకు ధరణిలో ఎవరైనా భూసమస్యలపై అప్లికేషన్ పెడితే ఎవరి లాగిన్ కిలో వెళ్తున్నాయో.. ఎవరి దగ్గర అప్లికేషన్ ఆగిందో అర్థమయ్యేది కాదు. గతంలో కొన్ని మాడ్యుల్స్ లో పెట్టుకున్న అప్లికేషన్లు ఎటుపోయాయో ఇప్పటికీ దరఖాస్తుదారులకు తెలియని పరిస్థితి ఉంది. అందుకే అప్లికేషన్ విధానాన్ని  స్ట్రీమ్ లైన్ చేసేందుకు కింది స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి ఆఫీసర్ కు వెళ్లేలా మాడ్యుల్ లో మార్పులు చేశారు.

దరఖాస్తుతో పాటే తహసీల్దార్ల రిపోర్టులు ఫార్వార్డ్

గతంలో ధరణి పోర్టల్ లోని 33 రకాల మాడ్యుల్స్ ద్వారా చేసే దరఖాస్తులన్నీ నేరుగా కలెక్టర్ల లాగిన్ లోకి వెళ్లేవి. కలెక్టర్ దరఖాస్తును పరిశీలించి అప్రూవ్ చేయడమో.. రిజెక్ట్ చేయడమో చేసేవారు. అప్రూవ్ చేసిన అప్లికేషన్లకు సంబంధించిన ఫీల్డ్ రిపోర్టుల కోసం మళ్లీ తహసీల్దార్లకు ఫార్వర్డ్ చేసేవారు. తహసీల్దార్లు అప్లికేషన్లను వెరిఫై చేసి, రిపోర్టులు సిద్ధం చేసి మళ్లీ కలెక్టర్లకు పంపితే వారు పరిశీలించి.. ఫైనల్ గా సమస్యను పరిష్కరించేవారు. 

తమ స్థాయిలో కరెక్షన్ కానట్లయితే సీసీఎల్ఏకు పంపేవారు. ఇది ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్. దీంతో పెండింగ్​అప్లికేషన్ల పరిష్కారానికి నెలలు, ఏండ్లు పడ్తున్నది. కానీ ఇకపై మండలం నుంచి వెళ్లే ప్రతి అప్లికేషన్ తహసీల్దార్ దృష్టిలో ఉంటుంది. వచ్చిన అప్లికేషన్ తోపాటే రిపోర్టులను రెడీచేసి ఆర్డీఓల లాగిన్ కు ఫార్వర్డ్ చేయడం, అక్కడి నుంచి అడిషనల్ కలెక్టర్లకు, జిల్లా కలెక్టర్లకు వెళ్లనుండడంతో సమస్య త్వరగా పరిష్కారమయ్యే అవకాశముంది. అయితే ఈ కొత్త విధానంతో కలెక్టర్ల మీద భారం తగ్గిపోనుండగా... తహసీల్దార్ స్థాయిలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగనుంది.