
హైదరాబాద్: రామోజీరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశిలించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
రామోజీరావు(87) గుండె సంబంధిత సమస్యలతో జూన్ 5వ తేదీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ జూన్ 8వ తేదీ శనివారం ఉదయం 04 : 50 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు.
రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు.
రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుకు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించింది.