
- తుపాకులగూడెం నుంచి నీళ్లు మళ్లించుకుంటే ఓకే
- ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో తేల్చిచెప్పిన తెలంగాణ
- గోదావరి-కావేరి లింకింగ్‌కు 5 రాష్ట్రాలూ అంగీకారం
హైదరాబాద్, వెలుగు: గోదావరి– కావేరి నదుల అనుసంధానం కోసం ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించడానికి ఒప్పుకోబోమని తెలంగాణ తేల్చిచెప్పింది. శుక్రవారం జలసౌధలో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) టాస్క్‌ఫోర్స్‌కమిటీ సమావేశం కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భోపాల్‌సింగ్, వివిధ రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
మీటింగ్ లో గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరి (148 టీఎంసీలు), బెడ్తి – వారాదా (18 టీఎంసీలు) రివర్లింకింగ్ప్రాజెక్టులపై చర్చించారు. ఈ రెండు ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఈ ఏడాది డిసెంబర్30వ తేదీకల్లా సిద్ధం చేసి అన్ని రాష్ట్రాలకు అందజేస్తామని వెదిరె శ్రీరామ్తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీకల్లా ఈ ప్రాజెక్టుల ఎంవోయూలపై ఆయా రాష్ట్రాల సీఎంలతో సంతకాలు చేయించేలా ప్రయత్నిస్తామన్నారు. గోదావరి – కావేరి రివర్లింకింగ్లో రాబోయే 20 ఏండ్లల్లో చత్తీస్గఢ్ఉపయోగించుకోని 148 టీఎంసీలను మాత్రమే తరలిస్తామని, చత్తీస్గఢ్ఆ నీటిని వినియోగించుకోవడం మొదలుపెట్టగానే ఆపేస్తామని తెలిపారు. మహానది – గోదావరి రివర్లింకింగ్లో 230 టీఎంసీలు తరలిస్తామని, రాబోయే 20 ఏండ్లలోపు ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. గోదావరి – కావేరి రివర్లింకింగ్కు అన్ని రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన నేపథ్యంలో ఈ నెల 22న నిర్వహించే ఎన్‌డబ్ల్యూడీఏ గవర్నింగ్‌బాడీ సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చి, దీనిపై చర్చిస్తామని శ్రీరామ్ తెలిపారు.
సమ్మక్క సాగర్ నుంచి ఓకే: తెలంగాణ
తెలంగాణ ఈఎన్సీ మురళీధర్మాట్లాడుతూ.. గోదావరి – కావేరి అనుసంధానం ప్రాజెక్టు కోసం ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ కట్టాలనే ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) బ్యారేజీ నుంచి రివర్లింకింగ్చేపడితే ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. గోదావరిలో నీటి లభ్యతపై స్టడీ చేసి ఆయా రాష్ట్రాలకు నీటి వాటాలను కేటాయించాలని.. దాని ప్రకారం హైడ్రాలజీ ఫ్రీజ్చేయాలని కోరారు. తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌ల ఆమోదానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నీటి లభ్యతపై స్టడీ చేయాలె: ఏపీ
గోదావరి – కావేరి అనుసంధానానికి భూసేకరణే ప్రధాన సమస్య అని ఏపీ ఇరిగేషన్ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కుమార్అన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా పోలవరం కుడి కాలువ నుంచి నాగార్జున సాగర్ (కృష్ణా).. అక్కడి నుంచి శ్రీశైలం (కృష్ణా) మీదుగా సోమశిల (పెన్నా).. అక్కడి నుంచి గ్రాండ్ఆనికట్(కావేరి)కి నీటిని తరలించే ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం గోదావరిలో మిగులు జలాలే లేవని, గతంలో ఇచ్చిన హైడ్రాలజీ రిపోర్టులోని వ్యత్యాసాలను సీడబ్ల్యూసీకి అప్పుడే నివేదించామని తెలిపారు. నీటి లభ్యతపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కోరారు. బెడ్తి – వారాదా లింక్ప్రాజెక్టులో తరలించే 50 శాతం నీటిని తమ రాష్ట్రానికి కేటాయిస్తే తుంగభద్ర హైలెవల్కెనాల్ద్వారా రాయలసీమకు నీటిని ఇచ్చే అవకాశం ఏర్పడుతుందన్నారు. రివర్లింకింగ్ లోని టెక్నికల్అంశాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
మరో మూడు రాష్ట్రాలూ రెడీ
గోదావరి – కావేరి అనుసంధానానికి తాము మద్దతిస్తామని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అధికారులు కూడా ప్రకటించారు. నీటి లోటు ఉన్న బేసిన్‌లోని అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఉంటుందనే దీనికి అంగీకారం తెలుపుతున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే, ఇంటర్స్టేట్ఎస్ఈ కోటేశ్వర్రావు, ఈఈ సుబ్రమణ్య ప్రసాద్, చత్తీస్గఢ్ఇరిగేషన్సీఈ కుబేర్‌సింగ్, కర్నాటక నుంచి రాకేశ్‌సింగ్, తమిళనాడు నుంచి సక్సేనా తదితరులు పాల్గొన్నారు.