ఎన్ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు

 ఎన్ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు
  • మూడేండ్ల పాటు నిర్వహణ బాధ్యత
  • పనితీరు బాగుంటే మరో రెండేళ్ల పెంపు
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు
  • ఈ నెల  29తో ముగియనున్న ప్రస్తుత సంస్థ టెన్యూర్
  • ఈ నెల 25న సెక్రటేరియట్ లో జాయింట్ మీటింగ్

హైదరాబాద్: ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇవాళ ఉత్తర్వలు జారీ చేసింది. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల లావాదేవీల అంశాన్ని మూడేండ్ల పాటు నిర్వహించాలని సూచించింది. పనితీరు బాగుంటే మరో రెండేండ్లు పెంచుతామని ఉత్తర్వుల్లో వివరించింది.

బీఆర్ఎస్ ప్రబుత్వం 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. నిర్వహణ బాధ్యతను టెర్రా సీఐఎస్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించింది. వ్యవసాయ భూముల అమ్మకం, కొనుగోళ్లు అన్నీ ధరని పోర్టల్ ద్వారానే కొనసాగుతున్నాయి. ఈ  పోర్టల్ లో ప్రస్తుతం 35 రకాల మాడ్యుల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి సమస్యకు ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజులను ధరణి పోర్టల్ ఆన్​లైన్​లోనే వసూలవుతున్నాయి. భూ సమస్యల పరిష్కారానికి ఒక్కో అప్లికేషన్​కు వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇప్పటి దాకా మొత్తం సుమారు 40 లక్షల ట్రాన్సాక్షన్స్ అయినట్లు సమాచారం.  

సమస్యలతో సతమతం

ప్రాథమిక సమాచారం నమోదులో జరిగిన అలసత్వం కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడో కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న భూములకు, గతంలో అమ్మినవాళ్ల పేర్లు రావడం, కొన్నిచోట్ల పట్టా భూములు ప్రభుత్వ, అసైన్డ్​ భూములుగా నమోదవడం గమనార్హం. విస్తీర్ణంలో హెచ్చు, తగ్గులు.. పట్టాభూమి అయినప్పటికీ నిషేధిత జాబితాలో ఉండటం కూడా సమస్యాత్మకంగా మారింది. పేర్లు తప్పుగా నమోదు కావడం, కొందరు భూము లు అసలు ధరణిలోనే నమోదు గాకపోవడం గమనార్హం.

ALSO READ | కేటీఆర్ ఒక జోకర్.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్

ఈ నేపథ్యంలో గ్రామాల్లో భూ వివాదాలు పెరిగిపోయాయి. వాటిని పరిష్కరించేందుకు ధరణి  పోర్టల్ ను సమూలంగా ప్రక్షాళన చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి రాగానే ధరణి ప్రక్షాళన కోసం సబ్ కమిటీ వేసి విచారణ చేపట్టింది.  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎం.కోదండరెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీటర్‌ అడ్వొకేట్‌ సునీల్, మాజీడిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ సహా సీసీఎల్‌ఏ మెంబర్‌ కన్వీనర్‌ ధరణీ కమిటీలో సభ్యలు. ధరణీ సమస్యలు, పరిష్కారాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. 

25న జాయింట్ మీటింగ్

ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను ఎన్ఐసీకి అప్పగిస్తున్న నేపథ్యంలో ఈ నెల 25న సెక్రటేరియట్ లో జాయింట్ మీటింగ్ నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ సమావేశానికి ప్రస్తుతం పోర్టల్  నిర్వహిస్తున్న టెర్రా సీఐఎస్ టెక్నాలజీస్ కంపెనీ ప్రతినిధులతో  పాటు, నూతనంగా బాధ్యతలు  నిర్వర్తించనున్న ఎన్ఐసీ అధికారులు, సాంకేతిక నిపుణులు, తెలంగాణ టెక్నాలజీ సర్విసెస్ అధికారులు హాజరు కావాలని పేర్కొన్నది. ఆ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ లోని రూం నంబర్ 22లో ఈ జాయింట్ మీటింగ్ ఉంటుందని వివరించింది.