ఇండ్ల స్కీమ్ అమలుకు ఇందిరమ్మ కమిటీలు

ఇండ్ల స్కీమ్ అమలుకు ఇందిరమ్మ కమిటీలు
  • గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేయాలని సర్కారు ఉత్తర్వులు
  • ఒక్కో కమిటీలో ఏడుగురికి చోటు
  • చైర్మన్​గా గ్రామాల్లో సర్పంచ్ లేదా స్పెషల్ ఆఫీసర్.. పట్టణాల్లో వార్డు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్
  • ఇయ్యాల సాయంత్రంలోగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం కమిటీల ఏర్పాటుకు సంబంధించిన జీవో నంబర్ 33ను ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ సెక్రటరీ జ్యోతి బుద్ద ప్రకాశ్ జారీ చేశారు. శనివారం సాయంత్రంలోగా కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇందుకు కలెక్టర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆ తర్వాత కమిటీ మెంబర్లకు మండలం, మున్సిపాలిటీల్లో ఓరియెంటేషన్ పోగ్రాంలు నిర్వహించాలని సూచించారు.

 అలాగే, ఈ కమిటీల్లో ఎవరెవరు ఉండాలన్న అంశాన్ని కూడాఉత్తర్వుల్లో  ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ కమిటీలో.. సర్పంచ్ లేదా స్పెషల్ ఆఫీసర్ చైర్మన్ గా, మహిళా సంఘం నుంచి ఇద్దరు, గ్రామాభివృద్ధికి పాటు పడే ముగ్గురు వ్యక్తులు (ఈ ముగ్గురిలో ఒకరు బీసీ, ఎస్సీ లేదా ఎస్టీ నుంచి ఒకరు) మెంబర్లుగా, పంచాయతీ సెక్రటరీ కన్వీనర్ గా ఉండనున్నారు.

 మున్సిపాలిటీ కమిటీలో.. వార్డు కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్ గా, మహిళా సంఘం నుంచి ఇద్దరు, మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ అభివృద్ధికి పాటు పడే ముగ్గురు వ్యక్తులు (ఈ ముగ్గురిలో ఒకరు బీసీ, ఎస్సీ లేదా ఎస్టీ నుంచి ఒకరు) మెంబర్లుగా, వార్డు ఆఫీసర్ కన్వీనర్ గా ఉండనున్నారు. కాగా, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ నోడల్ ఏజెన్సీగా హౌసింగ్ కార్పొరేషన్ ను ప్రభుత్వం నియమించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో భవిష్యత్తులో అమలు చేయబోయే ఇతర స్కీమ్ ల లబ్ధిదారులను సైతం ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

కమిటీలు చేయాల్సిన పనులు ఇవే..

తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 3,500 ఇండ్ల చొప్పున ప్రభుత్వం శాంక్షన్ చేసింది. సీఎం విచక్షణ అధికారం కింద మరో 33,500 ఇండ్లను మంజూరు చేసే అవకాశం ఉంది. ఇలా మొత్తం 4,50,000 ఇండ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి రానున్నాయి. మహిళల పేరుతో సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. 

అయితే, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పై గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజలకు ఈ కమిటీలు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. లబ్ధిదారుల ఎంపిక, సోషల్ ఆడిట్ కు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయడం వంటి పనులు చేయాలి. అలాగే, అర్హులను పక్కన పెట్టి, అనర్హులను ఎంపిక చేస్తే ఆ విషయాన్ని ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ దృష్టికి ఈ కమిటీ తీసుకెళ్లాలి. ఈ కమిటీలో చైర్మన్, మెంబర్లు, కన్వీనర్ల పేర్లను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు కలెక్టర్లకు అందజేయాలని, జిల్లా ఇన్ చార్జ్ మంత్రిని సంప్రదించి కలెక్టర్లు కమిటీలు ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.