- భవిష్యత్తును సుస్థిరం చేస్తం
- ప్రత్యామ్నాయ ప్రాజెక్టులు తెస్తం
- లిథియం బ్యాటరీ, గ్రీన్ ఎనర్జీ, సోలార్, హైడ్రోజన్ పవర్ ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తం
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ
- రెగ్యులర్ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు వర్తింపు
- పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్
హైదరాబాద్: సింగరేణి విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ప్రజాభవన్ లో ఆయన సింగరేణి కార్మికులకు 796 కోట్ల రూపాయల బోనస్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. సింగరేణిని భవిష్యత్తును సుస్థితరం చేసేందుకు, మునుముందు మరింత లాభాల్లో నడిపించేందకు గానూ ఆల్టర్నేటివ్ పవర్ ప్రాజెక్ట్‌ల వైపు సంస్థను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. లక్ష మంది బతికే సింగరేణిని భవిష్యత్ తరాలకు అందించకపోతే వాళ్ల జీవితాలు, భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని, అందుకే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్థను ఎక్స్‌ప్యాండ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు.
సింగరేణిని.. లిథియం బ్యాటరీ, గ్రీన్ ఎనర్జీ, సోలార్, హైడ్రోజన్ పవర్ ప్రాజెక్ట్‌లకు ఎక్స్‌ప్యాండ్ చేసే ఆలోచలోప్రభుత్వం ఉందని, నిరుపయోగంగా ఉన్న సింగరేణి స్థలాలను అతి త్వరలో భారీ పెట్టుబడిగా మార్చి దాని నుంచే రెవెన్యూ సంపాదించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల తాను విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో కూడా అక్కడి కంపెనీలతో ఈ విషయంపై చర్చించానని, అతి త్వరలో ఆ వైపుగా ప్రభుత్వం అడుగులు వేయబోతోందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం సంస్థకు 2412 కోట్ల లాభం వచ్చిందని, అందులో 33% అంటే 796 కోట్లను కార్మికులకు బోనస్ గా అందిస్తున్నామని చెప్పారు. గతంతో పోల్చుకుంటే ఒక్కో కార్మికుడికి రూ. 20 వేల బోనస్ ఎక్కువని అన్నారు. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు బోనస్ వస్తుందన్నారు. సింగరేణిలో శాశ్వత ఉద్యోగులు 41,837 మందితో పాటు సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా బోనస్ ఇస్తున్నట్టు డిప్యూటీ సీఎం చెప్పారు.
ALSO READ | పవన్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి.. కేఏ పాల్కు ఎందుకింత కోపమొచ్చిందంటే..
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సింగరేణిలో 1800 ఉద్యోగ నియామాకాలు చేపట్టామని చెప్పారు. సింగరేణిలో ఉద్యోగాల భర్తీ, కారుణ్య నియామకాల్లో కీలక మార్పులు చేపట్టామని వివరించారు. సింగరేణి కార్మికుల కోసం కోటి రూపాలయ భీమా పథకం ప్రారంభించామని చెప్పారు. చెన్నూరు, రామగుండంలో స్కిల్ డెవ్ లప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. సింగరేణి ప్రాంతంలోని వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సింగరేణి వర్టికల్ గా ఎక్స్ పాన్షన్ జరగాలని అనుకుంటున్నామన్నారు. సింగరేణి ప్రాజెక్టు సోలార్ లో సక్సెస్ అయ్యిందని, త్వరలోనే హైడ్రా పవర్ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నామని చెప్పారు.
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల పట్ల మంచి నిర్ణయం తీసుకుందన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల జీతాలను పెంచే విషయాన్ని పరిశీలించాలని కోరారు. సింగరేణి ఉద్యోగులకు పెన్షన్‌ను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, రిటైర్ట్ ఉద్యోగులకు మెడికల్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.