వెలుగు , నెట్వర్క్: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని లీడర్లు, అధికారులు అన్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు ఆదివారం జిల్లాలోని ప్రతి మండలానికి ఒక గ్రామం నుంచి లాంఛనంగా లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందించారు.
చొప్పదండి మండలం చిట్యాలపల్లి గ్రామంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం , కలెక్టర్ పమేలా సత్పతితో మంజూరు పత్రాలను అందజేశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పోసానిపేట గ్రామంలో ప్రభుత్వం ప్రారంభించిన పథకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. చివరి లబ్ధిదారుని వరకు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు.
కోనరావుపేటలో మండలంలోని కొలనూరు గొల్లపల్లి లో ఆర్డీవో రాజేశ్వర్ ఆధ్వర్యంలో లబ్దిదారులకు పత్రాలను అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. అర్హుల ప్రక్రియ మార్చి వరకు జరుగుతుందని, లబ్ధిదారులుఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దశాబ్ద కాలం నుంచి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వనిదేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
సారంగాపూర్ మండలం నాయకపుగూడెంలో ప్రజాపాలన సభలో అర్హులైన వారికి ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామంలో లబ్ధిదారులకు జిల్లా వ్యవసాయ అధికారి అబ్జల్ బేగం అర్హత పత్రాలు అందించారు. గ్రామం చిన్నదైనప్పటికీ ఇంతమంది లబ్ధిదారులుగా అర్హత సాధించడం అభినందనీయం అని కొనియాడారు. మల్యాల మండలంలోని సర్వాపూర్ గ్రామంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత చేతుల అర్హులైన లబ్ధిదారులకు ఆయా పథకాల పత్రాలు అందించారు. ఇందిరమ్మ ఇళ్ల కింద 111 మందికి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 33 మందికి, రైతు భరోసా కింద 659 మందికి, 127 మందికి రేషన్ కార్డుల పత్రాలు అందించినట్టు తెలిపారు.