సొంత రాష్ట్రంలో నష్టపోతున్నది ఉద్యోగులే

సకల జనుల సమ్మె చేసి కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నది ఉద్యోగ వర్గాలే! ఇప్పటి వరకూ భారీగా నష్టపోయింది, ఇంకా నష్టపోతున్నది ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లే. వీరంతా ఉమ్మడి రాష్ట్రంలో కన్నా అధ్వాన్న పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ సర్కారు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకపోగా కొత్తవి సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు ఎక్కడ ఎప్పుడు జరిగినా ‘ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం! సమస్యలు పరిష్కరించుకుందాం’ అని సీఎం ప్రతిసారి చెప్పడమే గానీ ఆచరణలో జరిగిందే లేదు. దీంతో ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది.

మొదటి నెలలో జీతాలొస్తే అదే సంతోషం

గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలోని ఉద్యోగులు, టీచర్లు జీతాలను, రిటైర్ అయిన వారు పెన్షన్​ను ప్రతి నెలా ఒకటో తేదీనే అందుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న 90వ దశకంలో కూడా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించారు. కానీ, బంగారు తెలంగాణలో మాత్రం ఒకటో తేదీన జీతాలు రావడం లేదు. పేరుకే ధనిక, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం. జీతాలు మొదటి వారంలో వస్తే సంతోషపడే స్థితికి తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా జీవో జారీ చేస్తే తప్పకుండా అధికారిక వెబ్​ సైట్ లో పెట్టేవారు. స్వరాష్ట్రంలో అంతా గోప్యమే. తొంభై శాతానికి పైగా జీవోలు వెబ్​సైట్ లో కనిపించవు. ఈ అతి గోప్యం ఎందుకో? ఎవరి కోసమో? ఇక ఫ్రీజింగ్​ను అధికారికంగా ప్రకటించరు. అంతా అనధికారమే. సరెండర్ లీవ్ ఎన్​క్యాష్​మెంట్, మెడికల్ రీయింబర్స్​ మెంట్ బిల్స్, పిల్లల ఫీజు రాయితీ, జీపీఎఫ్ అడ్వాన్సులు, పాక్షిక/ఫైనల్ విత్​డ్రాయల్ బిల్లులు ఎప్పుడు పా సవుతాయో.. చేతికి డబ్బు ఎన్నాళ్లకు వస్తుందో తెలియదు.

ఐఆర్, పీఆర్సీ పెండింగే

2018 జూన్ 2న ఐఆర్, అదే ఏడాది ఆగస్టు 15న పీఆర్సీ అమలు చేస్తామని ఉద్యోగులు, టీచర్ల ప్రతినిధుల సమక్షంలో స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెండున్నరేండ్లు గడిచినా నేటికీ ఐఆర్ లేదు. పీఆర్సీ ఇవ్వలేదు. పక్కన ఉన్న ఏపీలో లోటు బడ్జెట్ ఉన్నా 2019 జులై నుంచి 27 శాతం ఐఆర్ ఇస్తున్నారు. అంటే తెలంగాణలో ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు ఏపీ ఉద్యోగుల కంటే 27 శాతం తక్కువ వేతనాలు పొందుతున్నారు. 2018 మేలో స్వయంగా సీఎం ఇచ్చిన 18 హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రెండేండ్లు గడిచినా అమలు చేయలేదు. ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన కరువు భత్యం వాయిదాలను పెండింగులో పెడుతున్నారు. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్ల సమస్యలపై చర్చించే వేదిక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్(జేఎస్సీ)ని ఏడేండ్ల నుంచి రీఆర్గనైజ్ చేయలేదు.

హెల్త్​ కార్డులు పనిచేయట్లేదు

నగదు రహిత వైద్యం అందించేందుకు జారీ చేసిన హెల్త్ కార్డ్స్ ఎందుకూ పనికి రాకుండాపోయాయి. హెల్త్ కార్డ్స్ పై వైద్యం చేయడానికి ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్  నిరాకరిస్తున్నాయి. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు ప్రతి నెలా తమ వాటాగా రూ.500 నుంచి వెయ్యి వరకూ చందా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2004 సెప్టెంబర్ తర్వాత ప్రభుత్వ కొలువులో చేరిన ఉద్యోగులకు సీపీఎస్ విధానం గుదిబండగా తయారైంది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని మొరబెట్టుకున్నా సీఎం కనికరం చూపడం లేదు. ఉద్యోగి రిటైర్ అయ్యే రోజే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందిస్తామని స్వయంగా సీఎం ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. సర్వీస్ లో ఉండి మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి పది రోజుల్లో కారుణ్య నియామకం చేయాలని సీఎం చెప్పి ఏండ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు.

పెరుగుతున్న పనిభారం

రాష్ట్రాన్ని ఏడు జోన్లను చేసి మూడేండ్లవుతున్నా ఇప్పటివరకు రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించలేదు. దీంతో కొత్త జోన్లు నేటికీ ఉనికిలోకి రాలేదు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఐదేండ్లు అవుతున్నా.. కొత్త పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో ఉద్యోగులపై పనిభారం పెరిగిపోయింది. కొత్త జిల్లాల సంఖ్యకు అనుగుణంగా కొత్త పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. 70 ఏండ్లు నిండిన పెన్షనర్లకు పదిహేను శాతం క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గతంలో పెరిగేది. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీఆర్సీ కమిషన్ సిఫారసు చేసినా అమలు చేయడం లేదు. పెన్షనర్లకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వాలని ఏండ్లుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదు.

మాటల్లో ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ సర్కారు అని చెప్తున్నా.. ఆచరణలో దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. స్వయంగా సీఎం ఇచ్చిన హామీలను గుర్తు చేయడానికి.. సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఐదేండ్లుగా ఉపాధ్యాయ ప్రతినిధులకు సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. సీఎం వైఖరితో ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి.

ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు లేవు

ఉమ్మడి రాష్ట్రంలో ఏటా బదిలీలు జరిగేవి. సొంత రాష్ట్రంలో ఆరేండ్లుగా ఉద్యోగులకు, ఐదేండ్లుగా టీచర్లకు బదిలీలే చేయలేదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైన వారు, కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్న ఉద్యోగులు, టీచర్లు అనుభవిస్తున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆరేండ్లుగా రాష్ట్రంలో టీచర్లకు ప్రమోషన్లే ఇవ్వలేదు. అన్ని అర్హతలున్నా ప్రమోషన్ కి నోచుకోక వందలాది మంది టీచర్లు ప్రతి నెలా రిటైర్ అవుతున్నారు. విద్యా శాఖలో పదోన్నతుల విషయాన్ని టీచర్ల సమస్యగానే ప్రభుత్వం చూస్తోంది. కానీ స్కూళ్లలో పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు సైతం నష్టం జరుగుతోంది. రెండు వేల హైస్కూల్స్​లో హెడ్​మాస్టర్​ పోస్టులు, 98 శాతం మండలాల్లో ఎంఈవో పోస్టులు ఏండ్ల తరబడి భర్తీ చేయడం లేదు. వందలాది స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లు సైతం లేరు. దీంతో పాఠశాల విద్య గాడి తప్పింది.

– మానేటి ప్రతాపరెడ్డి, గౌరవాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్