- కేంద్ర సంస్థలు వాడుకోని భూముల స్వాధీనంపై రాష్ట్ర సర్కార్ కసరత్తు
- 8 సీపీఎస్యూల పరిధిలో నిరుపయోగంగా 6,635 ఎకరాలు
- మూతపడిన మరో మూడు
- సీపీఎస్యూల పరిధిలో 3,304 ఎకరాలు
- కబ్జాలకు గురైన మరో 2,500 ఎకరాలప్రభుత్వ భూములపైనా ఫోకస్
- ఆ కేసులను త్వరగా పరిష్కరించాలనిఅధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు : కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించిన భూముల్లో వాడుకోకుండా నిరుపయోగంగా ఉన్న వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడంపై రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తున్నది. ఇలాంటి భూములు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల దాకా ఉన్నట్టు ఇప్పటికే గుర్తించింది. వాటిని స్వాధీనం చేసుకునే మార్గాలను అన్వేషిస్తున్నది. మరోవైపు కబ్జాలకు గురైన భూములపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. ల్యాండ్ గ్రాబింగ్ కేసుల్లో మరో 2,500 ఎకరాల సర్కార్ భూములు చిక్కుకున్నట్టు తేల్చింది. ఆయా కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆక్రమణలకు గురైన సర్కార్ భూముల్లో అధిక శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోనే ఉన్నాయని, విలువైన ఆ భూములను స్వాధీనం చేసుకుని సంరక్షించాలని ఆదేశాలిచ్చింది. తెలంగాణలో వివిధ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల్లో దాదాపు 10 వేల ఎకరాలు నిరుపయోగంగా ఉన్నట్టు ఆఫీసర్లు తేల్చారు. కేంద్ర అధీనంలోని మొత్తం 11 సీపీఎస్ యూల (సెంట్రల్పబ్లిక్సెక్టార్అండర్టేకింగ్స్) కింద ఉన్న భూముల వివరాలను సేకరించారు. ఇందులో 8 సీపీఎస్యూల కింద మొత్తం 8,948 ఎకరాల భూములు ఉండగా.. అందులో 2,313 ఎకరాలు మాత్రమే ఉపయోగంలో ఉంది. నిరుపయోగంగా ఉన్న 6,635 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ఇందులో మిథాని, ధాతు నిగం లిమిటెడ్, డీఆర్డీవో, బీడీఎల్ సంస్థల కింద 1,312 ఎకరాలు .. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 2 వేల ఎకరాలు, లింగంపల్లిలోని భెల్ కంపెనీలో 2,125 ఎకరాలు, చర్లపల్లిలోని ఈసీఐఎల్ లో 930 ఎకరాలు, హెచ్ఏఎల్ లో 214 ఎకరాలు, చాంద్రాయణగుట్ట డీఆర్డీవో అండ్ డీఆర్డీఎల్ లో 55 ఎకరాలు వాడకంలో లేనట్టు ఆఫీసర్లు గుర్తించారు. ఇక ప్రస్తుతం మూడు సీపీఎస్యూలు మొత్తానికే పని చేయడం లేదు. ఆయా భూములను అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ ధరకే కేటాయించాయి. ఇప్పుడా సంస్థలు మూతపడినందున ఆ భూములన్నింటినీ తిరిగి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కార్ కోరుతున్నది. వీటిల్లో ఆదిలాబాద్ శివారులోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిధిలో 2,290 ఎకరాలు, హైదరాబాద్ లోని ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) పరిధిలో 891 ఎకరాలు, కుత్బుల్లాపూర్ లోని హిందుస్థాన్ మిషన్ టూల్స్(హెచ్ఎంటీ) కింద 123 ఎకరాలు ఉంది.
కబ్జా కేసుల్లోఉన్న భూముల విలువ రూ.3 వేల కోట్లపైనే..
ల్యాండ్గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద నమోదైన కేసులను పరిష్కరించడం ద్వారా రూ.3 వేల కోట్లు విలువ చేసే భూములు ప్రభుత్వ భూనిధిలోకి చేరనున్నాయి. వాస్తవానికి అవన్నీ ప్రభుత్వ భూములే అయినప్పటికీ కొన్నేండ్లుగా అక్రమార్కుల కబ్జాల్లో ఉన్నాయి. తెలంగాణ ల్యాండ్గ్రాబింగ్ ప్రొహిబిషన్చట్టం కింద నమోదైన కేసులకు సంబంధించి దాదాపు 2,500 ఎకరాలు ఉన్నట్టు ఆఫీసర్ల సర్వేలో తేలింది. వీటిపై 130 కేసులు నమోదయ్యాయి. వివిధ కోర్టుల్లో నలుగుతున్న ఆయా కేసులను త్వరగా పరిష్కరించాలని, ప్రముఖ లాయర్లను పెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చేలా చూడాలని ఇటీవల అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ భూముల్లో ఎక్కువ శాతం రంగారెడ్డి, మేడ్చల్మల్కాజ్గిరి, హైదరాబాద్జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఈ భూముల విలువే రూ.800 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల మధ్య ఉంటుందని.. ఇక జిల్లాల్లోని మిగతా భూములను కలిపితే రూ.3 వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వ సొంతమవుతాయని అధికారులు చెబుతున్నారు. కాగా, సీఎం ఆదేశాలతో కోర్టుల్లో నలుగుతున్న ప్రభుత్వ భూముల కేసులను గెలిచేందుకు రెవెన్యూ శాఖ ఆధారాలతో సహా సిద్ధమవుతున్నది.