
- ఎండీగా ఐఏఎస్ చంద్రశేఖర్ రెడ్డికి బాధ్యతలు
- అంగన్ వాడీలకు ఫుడ్ సరఫరా చేస్తున్న టీజీ ఫుడ్స్
- మంత్రి సీతక్క తనిఖీతో బయటపడ్డ లోపాలు
- త్వరలో అంగన్వాడీల్లో బ్రేక్ ఫాస్ట్ స్టార్ట్ చేయనున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీలకు సప్లై చేసే బాలామృతం క్వాలిటీగా ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో టీజీ ఫుడ్స్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలో టీజీ ఫుడ్స్ ఎండీ బాధ్యతలను ఐఏఎస్‌కు అప్పగించిందిఇ. ఇప్పటివరకు టీజీఫుడ్స్ ఎండీగా గ్రూప్–1 అధికారి శ్రీనివాస్ రెడ్డి ఉండగా ఆయన ప్లేస్‌లో ఐఏఎస్ చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తార్నాకలోని టీజీ ఫుడ్స్ ఆఫీస్‌ను కొన్ని నెలల కింద మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా పలు లోపాలు ఆమె దృష్టికి వచ్చాయి. అదేవిధంగా, అక్కడి ఉద్యోగులు ఉన్నతాధికారులపై ఫిర్యాదులు చేశారు.
సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, టెండర్లు పిలవకుండా నామినేషన్లపై పనులు అప్పగిస్తున్నారని, రికార్డులు మెయింటెన్ చేయకుండా రాతపూర్వక నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రికి వివరించారు. నాణ్యత లేని సరుకులు సప్లై చేసిన కాంట్రాక్టర్లకు.. నోటీసులివ్వాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం తయారీ విషయంలో టీజీ ఫుడ్స్పై ఎంతో బాధ్యత ఉందన్నారు. బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని, కాంట్రాక్టర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని తనిఖీ సమయంలోనే మంత్రి హెచ్చరించారు.
అంగన్ వాడీల్లో బ్రేక్ ఫాస్ట్..
అంగన్ వాడీ పిల్లలకు టీజీ ఫుడ్స్.. బాలామృతంతో పాటు స్నాక్స్ సరఫరా చేస్తున్నది. 7 నెలల నుంచి మూడేండ్లలోపు ఉన్న 9,82,958 మంది పిల్లలకు వంద గ్రాముల బాలామృతం, 3 నుంచి ఆరేండ్ల మధ్య ఉన్న 5,65,752 మంది పిల్లలకు స్నాక్స్ ను టీజీ ఫుడ్స్ సప్లై చేస్తున్నది. త్వరలో అంగన్వాడీల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేయాలని నిర్ణయించింది. దీని కోసం నిధులు ఇవ్వాలని మంత్రి సీతక్క ఇటీవల కేంద్ర మహిళా, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవిని కలిసి కోరారు. ఈ స్కీమ్ పకడ్బందీగా అమలు చేయాలని తాజాగా ఐఏఎస్ అధికారిని ఎండీగా ప్రభుత్వం నియమించింది.
సరుకుల నాణ్యతపై తనిఖీలు చేపట్టండి
అంగన్వాడీలకు సరఫరా అవుతున్న సరుకుల నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు అందే సరుకుల నాణ్యతపై రాజీ పడొద్దని గురువారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో స్పష్టం చేశారు. సరైన సరుకులు సరఫరా చేయకపోతే సప్లయర్‌ను బ్లాక్ లిస్ట్ చేస్తామని హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టాలని జిల్లా అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.