LKG, UKGలకు లక్షల్లో ఫీజులు.. అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట!

LKG, UKGలకు లక్షల్లో ఫీజులు.. అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట!
  • ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు
  • ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు, చట్టం తెచ్చే యోచన 
  • వచ్చే ఏడాది నుంచే అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు  
  • ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించిన విద్యా కమిషన్ 
  • స్కూల్ మేనేజ్మెంట్లు, స్టూడెంట్ యూనియన్లు,
  • పేరెంట్స్​తో సమావేశాలు.. ప్రాంతాలు, స్కూళ్ల వారీగా 
  • కేటగిరీలు.. క్లాసుల వారీగా ఫీజులు పెట్టాలని ఆలోచన
  • వచ్చే నెలలో ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు సర్కార్ చర్యలు ప్రారంభించింది. త్వరలోనే ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇందుకోసం ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా తీసుకురావాలని నిర్ణయించింది. ఈ బాధ్యతలను విద్యాకమిషన్​కు అప్పగించింది. దీంతో కమిషన్ ఇప్పటికే రంగంలోకి దిగి, అందరి అభిప్రాయాలను సేకరిస్తున్నది. స్కూల్ మేనేజ్మెంట్లు, పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్ల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నది. 

20 వేల నుంచి 5లక్షల దాకా ఫీజులు.. 

రాష్ట్రంలో 11,454 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఉండగా.. వాటిల్లో 34.83 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. బడ్జెట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్​గా పేర్కొంటూ అందినకాడికి దండుకుంటున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ బడుల్లో ఏడాదికి రూ.20 వేల నుంచి ఏకంగా రూ.5 లక్షల వరకు ఫీజులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఫీజులను నిర్ణయించినట్టుగానే ప్రైవేట్ బడుల్లోనూ ఫీజులు నిర్ణయించాలని పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్ల ప్రతినిధులు ఎన్నో ఏండ్లుగా ఆందోళన చేస్తున్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీ వేసింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చినా దాన్ని అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ బడుల్లో ఫీజులను నియంత్రించాలని నిర్ణయించింది. విద్యను వ్యాపారంగా కాకుండా, సర్వీస్ విధానంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. 

అభిప్రాయాల సేకరణ షురూ.. 

ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నిర్ధారణ కోసం విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని టీమ్​చర్యలు ప్రారంభించింది. ప్రైవేట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్ల మేనేజ్మెంట్ల ప్రతినిధులతో ఇటీవల సమావేశమైంది. మేనేజ్మెంట్ల యూనియన్లతోనూ భేటీ అయింది. ఆయా స్కూళ్లలో వసతులు ఎలా ఉన్నాయి? ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారు? మంచి టీచర్లు ఉన్నారా? వారికి ఎంత జీతం ఇస్తున్నారు? లాంటి వివరాలను సేకరించింది. దీనికితోడు బడుల్లో ల్యాబ్స్ ఉన్నాయా? స్టూడెంట్లకు అవసరమైన వసతులు ఉన్నాయా? అనే డేటా తీసుకున్నది. గతంలో విద్యాశాఖ ఇచ్చిన జీవో 1తో పాటు, ఇతర అంశాల అమలుపై ఆరా తీసింది. వివిధ స్కూళ్లకు సంబంధించి పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్ల ప్రతినిధుల అభిప్రాయాలను కూడా సేకరించింది. ఈ రిపోర్టును వచ్చే నెలలో ప్రభుత్వానికి అందజేయనుంది. 

కేటగిరీలుగా విభజన.. 

ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను ఎలా నిర్ధారించాలనే దానిపై చర్చ జరుగుతున్నది. స్కూళ్లు ఉన్న ప్రాంతాలను బట్టి కేటగిరీలుగా విభజించే యోచనలో విద్యా కమిషన్ ఉన్నట్టు తెలుస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్, జిల్లా కేంద్రాలు, పట్టణ, రూరల్ కేంద్రాలుగా స్కూల్స్​ను విభజించే అవకాశం ఉంది. దీనికి తోడు మేనేజ్మెంట్ల ఆధారంగా స్కూళ్లను కూడా నాలుగు కేటగిరీలుగా చేయాలని విద్యాకమిషన్ భావిస్తున్నది. చిన్న బడ్జెట్ స్కూళ్లు, పెద్ద ప్రైవేట్ స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లుగా విభజించే అవకాశం ఉంది. మరోవైపు క్లాసుల వారీగా ఫీజులను నిర్ణయించనుంది. నర్సరీ నుంచి టెన్త్ వరకు నాలుగైదు స్లాబులుగా ఫీజులను నిర్ణయించే అవకాశం ఉంది. 

రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు.. 

ఫీజుల నియంత్రణ కోసం ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందులో ఎవరెవరు ఉండాలనే దానిపైనా చర్చ జరుగుతున్నది. ఈ కమిషన్​కు చట్టబద్ధత కూడా కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం తీసుకురావాలని అనుకుంటున్నది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, ఆ తర్వాత జరిగే సమావేశాల్లో బిల్లు పెట్టాలని భావిస్తున్నది. అయితే విద్యా కమిషన్ నుంచి  ఫైనల్ రిపోర్టు అందిన తర్వాత ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన రిపోర్టులోని కొన్ని మంచి అంశాలనూ పరిగణనలోకి తీసుకోనున్నారు. ఫీజుల నియంత్రణకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు వేయనున్నారు. 

త్వరలో నివేదిక ఇస్తం.. 

ప్రైవేట్ బడుల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రైవేట్ మేనేజ్మెంట్లతో, పేరెంట్స్ తో మాట్లాడి అభిప్రాయాలు సేకరించాం. మరింత సమాచారం సేకరించి సర్కార్ కు నివేదిక అందిస్తాం. ప్రభుత్వం ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చట్టం తీసుకురానున్నది. వచ్చే ఏడాది నుంచే దీన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నది.  

ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు, విద్యా కమిషన్ సభ్యుడు