
అమ్రాబాద్, వెలుగు: ప్రభుత్వం చెంచుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, హౌసింగ్, తాగునీరు, రహదారి సౌకర్యం మెరుగుపరచేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం దోమలపెంట వన మయూరి గెస్ట్ హౌస్‌లో డీఎఫ్వో రోహిత్ గోపిడి ఆధ్వర్యంలో చెంచు పెంటల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అప్పాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, సంగిడి గుండాల, మేడిమల్కల చెంచుపెంటల్లో నివసించే ప్రజలకు కావాల్సిన సౌలతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెక్ డ్యామ్ ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, బావులను తవ్వించాలని, పాఠశాలల్లో నీటి వసతి, కరెంట్, విద్యార్థులు కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెంచుపెంటల్లో ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని రెడ్కో అధికారులకు సూచించారు.