సినిమా టికెట్ల ధర పెంపుపై ప్రభుత్వం ఉత్తర్వులు

తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అధికారుల కమిటీ సిఫారసులతో టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. AC థియేటర్లలో కనిష్టంగా 50 రూపాయల నుంచి 150 రూపాయల వరకు టికెట్ ధర ఉండొచ్చని ప్రభుత్వం తెలిపింది. మల్టిప్లెక్స్ లలో కనిష్టంగా 100 రూపాయల నుంచి 250 వరకు ఉండొచ్చని స్పష్టం చేసింది. అలాగే మల్టీ ప్లెక్స్ లలోని రెక్లైనర్ సీట్లకు 300 రూపాయలు ధర నిర్ణయించింది. టికెట్ ధరలపై GST అదనమని ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకునేందుకు హైకోర్టు ఈ నెల 1నే అనుమతిచ్చింది. కరోనా సంక్షోభం సహా ఇతర నష్టాల నుంచి కాస్త గట్టెక్కేందుకు టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరాయి  థియేటర్ల యాజమాన్యాలు. టికెట్ పై 50 రూపాయల వరకు పెంచుతామని తెలిపాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో... హైకోర్టును ఆశ్రయించాయి థియేటర్ల యాజమాన్యాలు. దీంతో ఒక్కో టికెట్ పై 50 రూపాయలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఈ నెల 1న ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఇవాళ అధికారికంగా ప్రభుత్వమే టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతిచ్చింది.  అయితే అటు ఏపీలో మాత్రం టికెట్ రేట్లు తగ్గించింది అక్కడి ప్రభుత్వం. దీనిపై రెండు మూడ్రోజులుగా వివాదం కూడా నడుస్తోంది. ప్రబుత్వం చెప్పిన రేట్ల కంటే ఎక్కువుగా టికెట్లు అమ్మితే థియేటర్లు కూడా సీజ్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అక్కడి అధికారులు ఎప్పటికప్పుడు థియేటర్లలో చెకింగ్ చేస్తున్నారు. అధిక ధరలకు టికెట్లు అమ్మినట్లు తెలిస్తే.. సీజ్ చేస్తున్నారు అధికారులు. జనం పై టికెట్ భారం పడకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.