గూడులేని జనానికి గృహలక్ష్మి సాల్తదా?

తెలంగాణ ప్రభుత్వం ఊరిస్తూ .. ఊరడిస్తూ చెబుతున్న గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కేసీఆర్ ప్రభుత్వం​ ఇటీవల విడుదల చేసింది. జీవో ఎంఎస్‌25ని విడుదల చేసి, అందులోని అంశాలపై స్పష్టతనిచ్చింది. మహిళ పేరు మీదనే ఇల్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొంది. లబ్ధిదారులు తమకు ఇష్టమైన డిజైన్‌ ఎంపికకు వెసులుబాటు కల్పించింది. పథకం ద్వారా లబ్ధిపొందిన ఇంటిపై ప్రభుత్వంచే ఆమోదించబడిన గృహలక్ష్మి లోగోను ఏర్పాటు చేయనుండగా.. సంబంధిత కుటుంబం ఫుడ్‌ సెక్యూరిటీ కార్డును కలిగి ఉండాలని సూచించింది. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్‌ఎంసీలో కమిషనర్‌ ఆధ్వర్యంలో పథకం అమలు చేయనున్నట్టు వెల్లడించింది. 

రెండు గదులతో ఆర్‌సీసీ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనున్నట్లు మార్గదర్శకాల్లో ప్రభుత్వం తెలిపింది. సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక గృహలక్ష్మి పథకమని, సొంత జాగా ఉండి ఇంటి నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారులకు రూ.3లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు  ప్రభుత్వం నిబంధనల్లో వివరించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఇండ్లు, మొత్తం నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. 

మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ వట్టిదేనా?

 ప్రభుత్వం ఎన్ని ఇండ్లు కట్టించింది. ఆ విషయాలపై ప్రభుత్వం నుంచి వెలువడిన గణాంకాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని అమలు చేయడం  ప్రారంభించింది. ఈ పథకం అమలు సాధ్యం కావడం లేదని ఈ గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. గత ఎన్నికల కంటే ముందుగానే ఈ పథకాన్ని చేపట్టింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి అదనంగా మరో హౌసింగ్ పథకాన్ని ఎన్నికల హామీగా కేసీఆర్ ప్రకటించారు. 2018 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని నాలుగో ముఖ్యమైన హామీగా ప్రస్తావించారు.‘‘ప్రస్తుత పద్ధతిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తూనే, సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందిస్తాం’’ అని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ లెక్కన నాటి ఎన్నికల హామీ ప్రకారం పేదలకు ఆర్థిక సాయం కింద రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు ఇవ్వాలి. 

దాన్ని ఇపుడు రూ.3లక్షలకు కుదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో అడిగే చైతన్యం ప్రజల్లోనే రావాల్సి ఉన్నది. ప్రజలు తాము గెలిపించిన పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని నిలబెట్టుకుందా? లేదా? అనేది ప్రజలే  పరిశీలించుకోవాలి.  బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినదానికి అమలు చేస్తున్న  దానికి ఎక్కడా పొంతన లేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. అందుకే బీఆర్ఎస్ పార్టీ హడావుడిగా గృహలక్ష్మి పథకాన్ని తీసుకు వచ్చిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రూ.3 లక్షలతో పేదలు తమ ఇళ్లను ఏ విధంగా నిర్మించుకోగలుగుతారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.

మార్గదర్శకాలు ఇలా...

ప్రస్తుత ఏడాదికి 4 లక్షల ఇళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో అన్ని నియోజకవర్గాలకు కలిపి 3.57లక్షల ఇళ్లు కేటాయించారు. మరో 43 వేల ఇళ్లు స్టేట్ రిజర్వ్ కోటా కింద ఇస్తారు. ఇందుకు బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లను ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లకు ఆర్థిక సాయం అందించాలనేది ప్రభుత్వ ప్రణాళికగా కనిపిస్తోంది. ఇంటి నిర్మాణం విషయంలో రెండు గదులు, టాయిలెట్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి డిజైన్ లబ్ధిదారుడు తనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇంటిని మహిళ పేరుతో మంజూరు చేస్తారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ లేదా జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించి అర్హుల జాబితాను తయారు చేస్తారు. దాని ఆధారంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో దశల వారీగా ఇళ్లను మంజూరు ఇస్తారు. ఈ పథకం కింద నిర్మించిన ఇళ్లపై ప్రభుత్వం ఆమోదించిన లోగోనే వేస్తారు. 

దీనికి సంబంధించిన లోగోను ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేసరికి ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ డబ్బును మూడు దశల్లో అందిస్తుంది. ప్రతి దశలో అధికారులు ఇళ్ల ఫొటోలు తీసి గృహలక్ష్మి పోర్టల్‌లో అప్ లోడ్ చేస్తారు. పునాది స్థాయి వరకు నిర్మించాక రూ.లక్ష అందిస్తారు. రూఫ్(పైకప్పు) స్థాయికి వచ్చాక మరో రూ.లక్ష ఇస్తారు. నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన రూ.లక్షను ఇస్తారు. ఈ నిధులను నేరుగా లబ్ధిదారు పేరుతో తెరిచిన బ్యాంకు ఖాతాలో వేస్తారు. స్థానికంగా నివాసం ఉంటున్నట్లు ధ్రువీకరణపత్రం ఉండాలి. అప్పటికే రూఫ్ స్థాయికి చేరుకున్న ఇళ్లకు పథకం వర్తించదని ప్రభుత్వం ప్రకటించింది.

 ప్రస్తుతం పెరిగిన ఇసుక, సిమెంట్, స్టీలు ధరలను పరిశీలిస్తే, లబ్ధిదారులు అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుందని భవన నిర్మాణదారులు చెబుతున్నారు. గృహలక్ష్మి తెచ్చే రూ. 3 లక్షలతో ఏ పేదవాడూ ఇళ్లు నిర్మించుకోలేడు. గతంలో చెప్పిన దానికీ, ఇవాళ అమలు చేస్తున్నదానికి ఎలాంటి పొంతన లేకపోవడం శోచనీయం.

దివ్యాంగులను మరిచిన సర్కారు

మార్గదర్శకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్‌ను విస్మరించింది. దివ్యాంగులకు అన్ని పథకాల్లో 5 శాతం రిజర్వేషన్‌ కేటాయించాలని  మరచిపోయింది. ఫలితంగా గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు రిజర్వేషన్‌ అందని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 5,16,890 మంది దివ్యాంగులకు పింఛను అందుతోంది. కానీ, గతంలో సర్కారు నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రంలో 10.48 లక్షల మంది దివ్యాంగులున్నట్లు తేలడం గమనార్హం. అయితే ఈ వివరాలను సర్కారు అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు సుమారు లక్ష మందికి పైగా దివ్యాంగులు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

గృహలక్ష్మి పథకం అమలు మార్గదర్శకాల్లో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీలు, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్‌ను అమలుచేయాలని ప్రభుత్వం సూచించింది. కానీ, దివ్యాంగులకు కేటాయించాల్సిన 5 శాతం రిజర్వేషన్‌ను ప్రస్తావించలేదు. వాస్తవానికి ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని దివ్యాంగుల హక్కుల చట్టం 2016లోని 37(బి) సెక్షన్‌ సూచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్‌ను అమలు చేస్తుండగా.. గృహలక్ష్మిలో మాత్రం పొందుపర్చకపోవడంపై దివ్యాంగులు మండిపడుతున్నారు.

- మన్నారం నాగరాజు,
రాష్ట్ర అధ్యక్షుడు,తెలంగాణ లోక్​సత్తా పార్టీ