
- వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా నిధులు
- పంచాయతీ రాజ్ కు భారీగా కేటాయింపులు
- పావు వంత నిధులను కేటాయించిన సర్కారు
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యం
- ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ అభివృద్ధిపైనా దృష్టి
- పర్యాటకానికి ప్రాధాన్యం.. పరిశ్రమలకు పెద్దపీట
- 6 గ్యారెంటీలకు రూ. 56,084 కోట్లు
- ఇందిరమ్మ ఇండ్లకు 12,571 కోట్లు
- 3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి
- శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు
- గాంధీ, అంబేడ్కర్, శ్రీశ్రీల మాటలను కోట్ చేస్తూ సాగిన ప్రసంగం
హైదరాబాద్: ఆరు గ్యారెంటీలకు ప్రాధన్యం ఇస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా రాష్ట్ర బడ్జెట్ ఆవిష్కృతమైంది. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం 3,04,965 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ఇవాళ డిప్యూటీ సీఎం శాసన సభ ముందుంచారు. ఆరుగ్యారెంటీల్లోని తొమ్మిది ఉప అంశాలకు సంబంధించి రూ. 56,084 కోట్లు కేటాయించారు. అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లకోసం 12,571 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయానికి పెద్ద పీట వేయడం విశేషం. వ్యవసాయ రంగానికి 24,239 కోట్లు కేటాయించారు. రైతు భరోసా కోసం 18 వేల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పశుసంవర్థక శాఖకు కూడా 1,674 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అలాగే పంచాయతీరాజ్ శాఖకు అత్యధికంగా 31,605 కోట్లను కేటాయించింది. మొత్తంగా పల్లెలకు 75 వేల 718 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించడం విశేషం. మొత్తం బడ్జెట్ లో దాదాపుగా పావు వంతు మొత్తాన్ని సర్కారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే కేటాయించింది. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, చేనేత కారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది.
హైదరాబాద్, ఫ్యూచర్ సిటీలపైనా దృష్టి
హైదరాబాద్ అభివృద్ధి కోసం ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం, రోడ్ల విస్తరణకు టాప్ ప్రయార్టీ ఇస్తోంది. సిటీకి 2050 లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు తెలిపింది. ఫ్యూచర్ సిటీపై ప్రత్యేక శ్రద్ధం పెట్టిన ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. యావత్ ప్రపంచాన్ని ఆకర్షించడమే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందుకోసం ఫ్యూచర్ సిటీ అథారిటీ కి 100 కోట్లు కేటాయిస్తున్నట్టు వివరించింది. పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తూ గోదావరి, కృష్ణ నదులపై లాంచీలు, జెట్టీలు ప్రవేశపెడతామని తెలిపారు. వీటితో పాటు పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని వివరించారు.
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు డిప్యూటీ సీఎం చెప్పారు. యూనివర్సిటీల అభివృద్ధికి రూ. 500 కోట్లు, ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు 2,900 కోట్లు కేటాయిస్తున్నట్టు వివరించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద గతంలో 5 లక్షల వరకు బీమా కల్పించే వారని దానిని రూ. 10 లక్షలకు పెంచినట్టు డిప్యూటీ సీఎం వివరించారు.