హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ ఆవరణలో.. 2024, డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ వేడుకకు.. ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను స్వయంగా ఆహ్వానించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వేడుకకు తప్పకుండా రావాలని.. పార్టీలకు అతీతంగా తెలంగాణ తల్లిని గౌరవించుకోవాలంటూ ఆహ్వానించారాయన.
కేసీఆర్ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందాన్ని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు వంశీధర్ రావు తదితరులు.. సాదర స్వాగతం పలికారు. తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్కు లంచ్ ఆతిథ్యమిచ్చి కేసీఆర్ గౌరవించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర వేణుగోపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులున్నారు.
సెక్రటేరియెట్లో ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం రూపొందిస్తున్నది. 17 అడుగుల ఈ కాంస్య విగ్రహాన్ని ఇప్పటికే సెక్రటేరియెట్ ప్రాంగణానికి తరలించారు. విగ్రహం ఎత్తు 17 అడుగులు కాగా.. కింద గద్దె మరో 3 అడుగులతో రూపొందించారు. తెలంగాణ తల్లి నూతన శిల్పం తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఉంటుందని శిల్పి రమణా రెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు.
‘‘తాజా తెలంగాణ తల్లి విగ్రహం సంప్రదాయపు స్త్రీ మూర్తిగా, సబ్బండవర్గాల ఆకాంక్షల స్ఫూర్తిగా ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాస్తవ ప్రజానీక సంస్కృతికి భిన్నంగా, రాచరికపు హావభావాలతో ధనిక స్త్రీగా చిత్రీకరించారు. ఈ కారణంగా చాలామంది ప్రజలమన్ననలు పొందలేకపోయింది” అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేకతలివే:
* బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చ రంగు చీర ధరించి ఉంది
* మెడలో గుండ్లు , యెనల దండ, కంటె.. చెవులకు కమ్మలు.. కాళ్లకు మట్టెలు, పట్టగొలుసులు
*ఎడమ చేతిలో వరి, మక్క, జొన్న, సజ్జ కంకులు పట్టుకొని పల్లె వాకిట నిలిచిన తల్లిలా తెలంగాణ తల్లి రూపం
* ఉద్యమ ఆకాంక్షలను చాటేలా రూపొందించిన గద్దె
* గద్దెకు అడుగుభాగాన ఉద్యమ పిడికిళ్లు, మధ్యలో సబ్బండ వర్గాల చేతులు ఆ గద్దెను ఎత్తిపట్టుకున్నట్టు తీర్చిదిద్దారు.