సీసీ కెమెరాల మధ్య ఇంటర్​ ప్రాక్టికల్స్

 సీసీ కెమెరాల మధ్య  ఇంటర్​ ప్రాక్టికల్స్
  • పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
  • ఈ నెల 3 నుంచి పరీక్షలు ప్రారంభం

వనపర్తి, వెలుగు: ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో ప్రాక్టికల్​ పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రాక్టికల్​ ఎగ్జామ్స్​ నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత కొన్నేండ్లుగా ల్యాబ్​లలో రసాయనాలు, సామగ్రి లేక రెగ్యులర్​గా ప్రయోగాలు చేయక పరీక్షల ముందు ఉన్నవాటితో కానిచ్చేవారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రతి జూనియర్​ కాలేజీకి ప్రయోగాలు చేసేందుకు రూ.25 వేల చొప్పున మంజూరు చేసింది. సీసీ కెమెరాల మధ్య పరీక్షలు నిర్వహించాలని గతంలో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ, ఒకటి రెండు కెమెరాలను ఉపయోగించేవారు. ఈసారి అలా కాకుండా అడిషనల్​ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేసింది. 

ఉమ్మడి జిల్లాలో 118 కెమెరాలు..

ఇంటర్​ ప్రాక్టికల్​ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి జూనియర్​ కాలేజీకి అడిషనల్ గా సీసీ కెమెరాలను అందిస్తూ ఒక్కో కాలేజీకి రూ.12 వేల చొప్పున ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని 59 కాలేజీలకు రూ.7.08 లక్షల నిధులు మంజూరు చేసింది. ఫిబ్రవరి 3 నుంచి​ నుంచి ప్రాక్టికల్​ ఎగ్జామ్స్​ జరగనుండగా, ఇప్పటికే సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ జూనియర్​ కాలేజీలు, కేజీబీవీలు, గురుకులాలతో కలిపి 141 ఉన్నాయి. సెకండ్​ ఇయర్​ ఇంటర్మీడియట్​ ఎంపీసీ, బైపీసీ, ఒకేషనల్​ స్టూడెంట్స్​ ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్​ చేస్తారు. థియరీ ఎగ్జామ్స్​తో పాటు ప్రాక్టికల్​ పరీక్షల మార్కులు కలిసి స్కోరు పెరిగే అవకాశం ఉంటుంది.

 కాబట్టి ప్రాక్టికల్స్​కు సైతం స్టూడెంట్స్​ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఎగ్జామ్స్​ ముందు కెమికల్స్​కు నిధులు మంజూరు చేయడంపై స్టూడెంట్స్​ పెదవి విరుస్తున్నారు. తక్కువ సమయంలో ప్రాక్టికల్స్​ ఎలా స్కోర్​ చేయగలుగుతామని అంటున్నారు.  ప్రైవేట్​ జూనియర్​ కాలేజీలు ఫలితాల మీద దృష్టి కేంద్రీకరించి మార్కులు స్కోర్​ చేసేందుకు ప్రయత్నిస్తాయి. అలా ప్రాక్టికల్​ పరీక్షల్లో ప్రైవేట్​ సెంటర్​కు ఒక డిపార్ట్​మెంటల్​  ఆఫీసర్​ను నియమిస్తారు. ప్రతి ఏడాది ప్రైవేట్​ మేనేజ్​మెంటు కోరుకున్న వారికి ఎగ్జామ్​ డ్యూటీ వేస్తూ రావడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది డీవోల కేటాయింపులో డీఐఈవో పారదర్శకంగా వ్యవహరించాలని మెజారిటీ స్టూడెంట్లు కోరుతున్నారు.  

జిల్లాల వారీగా..

నాగర్​కర్నూల్​ జిల్లాలో 16 కాలేజీలుండగా, 32 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్​నగర్​లో 15 కాలేజీలకు 30, వనపర్తిలో 12 కాలేజీలకు 24, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 8 కాలేజీల చొప్పున ఉండగా, 16 చొప్పున సీసీ కెమెరాలను అమర్చనున్నారు. దీంతో ప్రాక్టికల్​ ఎగ్జామ్స్​ పారదర్శకంగా జరిగేందుకు ఆస్కారం ఏర్పడనుంంది. ఉమ్మడి పాలమూరు​జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్​ జూనియర్​ కాలేజీలు, కేజీబీవీలు, గురుకులాలు, వొకేషనల్​ కాలేజీలు 261 ఉన్నాయి. వీటిలో చదివే సైన్స్​ స్టూడెంట్లు 19,767 మంది ప్రాక్టికల్​ ఎగ్జామ్స్​కు హాజరు కానున్నారు. 

పకడ్బందీగా నిర్వహిస్తాం..

ఇంటర్​ ప్రాక్టికల్​ ఎగ్జామ్స్​ ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తాం. ఈసారి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. గత పరీక్షలు జరిగిన తీరును దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేశాం.
- ఎర్ర అంజయ్య, డీఐఈవో, వనపర్తి

జిల్లాల వారీగా వివరాలు..

జిల్లా                              కాలేజీలు    స్టూడెంట్లు
మహబూబ్​నగర్​                      48     8,392
వనపర్తి                                     41     6,591
నాగర్​కర్నూల్​                         40      6,250
నారాయణపేట                       30      2,359
జోగులాంబ గద్వాల                26     2,230